ప్రధాని రేసులో దూసుకెళ్తోన్న మూర్తి గారి అల్లుడు: మూడో రౌండ్ కూడా మనోడిదే
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో అధికార కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునక్.. దూసుకెళ్తోన్నారు. మూడో రౌండ్‌లోనూ తిరుగులేని మెజారిటీని సాధించారు. ప్రధాని పదవి కోసం పోటీ పడుతోన్న తోటి నాయకుల కంటే అత్యధిక ఓట్లను సాధించారు. బ్రిటన్ పార్లమెంట్ సభ్యుల్లో అధికశాతం మంది రిషి సునక్ ప్రధాని అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. బోరిస్ జాన్సన్ వారసుడిగా ఆయనను ఎన్నుకుంటోన్నారు.

ఓటింగ్ ఇలా..
తాజాగా మూడో రౌండ్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో రిషి సునక్‌కు 115 ఓట్లు పోల్ అయ్యాయి. ఆయనతో పోటీ పడుతోన్న ఇతర అభ్యర్థులెవరూ గానీ ఈ స్థాయిలో ఓట్లను సాధించట్లేదు. 82 ఓట్లతో బ్రిటన్ మాజీ రక్షణ శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్ రెండో స్థానంలో నిలిచారు. విదేశాంగ శాఖ మాజీ మంత్రి లిజ్ ట్రాస్‌కు మద్దతుగా 71 ఓట్లు పడ్డాయి. కెమ్మి బెడెనోచ్-58, టామ్ టుగెండ్హట్-31 ఓట్లకు పరిమితం అయ్యారు. అతి తక్కువ ఓట్లు పోల్ కావడం వల్ల టామ్ టుగెండ్హట్ ఈ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

మరో రౌండ్..
మరో రౌండ్ ఓటింగ్ బ్రిటన్ కాలమానం ప్రకారం మంగళవారం ఆరంభం అయ్యే అవకాశం ఉంది. బోరిస్ జాన్సన్ వారసుడిగా ఎన్నుకునే ఈ ప్రక్రియలో చివరగా ఇద్దరు అభ్యర్థులు మిగిలేంత వరకూ ఓటింగ్ కొనసాగుతుంటుంది. ప్రస్తుతం రిషి సునక్‌తో పెన్నీ మోర్డాంట్, లిజ్ ట్రాస్, కెమ్మి బెడెనొచ్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రిషి సునక్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది పెన్నీ మోర్డాంట్ నుంచే. ఇదివరకటి రౌండ్‌లో 101 ఓట్లు పోల్ అయ్యాయి. మూడో రౌండ్‌లో అనూహ్యంగా ఈ సంఖ్య పడిపోయిందది. 82గా రికార్డయింది.

గట్టి పోటీ లేనట్టే..
ఇది రిషి సునక్‌కు కొంత ఉపశమనం కలిగించినట్టే. ఓట్ల సంఖ్యలో తనతో పాటు బరిలో ఉన్న ఇతర అభ్యర్థులెవరు దరిదాపుల్లో ఉండట్లేదు. గట్టిపోటీ ఇవ్వట్లేదు. దీన్ని బట్టి చూస్తే- బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునక్ ఎన్నిక కావడం లాంఛనప్రాయమేననే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇదే విషయాన్ని బ్రిటీష్ మీడియా సైతం అంచనా వేస్తోంది. ప్రధానిగా బాధ్యతలను స్వీకరించడానికి కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 120 మంది సభ్యుల మద్దతు అవసరమౌతుంది. రిషి సునక్- ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడనే విషయం తెలిసిందే.

పార్టీ గేట్..
పార్టీగేట్ వ్యవహారం తెర మీదికి వచ్చిన తరువాత బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ప్రధానిగా బోరిస్ జాన్సన్ కొనసాగడాన్ని అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులెవరూ అంగీకరించలేదు. ప్రధానిగా కొనసాగడాన్ని వ్యతిరేకించారు. ఆయన ప్రభుత్వం నుంచి తప్పుకోవడం మొదలు పెట్టారు. ఇది- రిషి సునక్‌తోనే ఆరంభం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బోరిస్ జాన్సన్ కేబినెట్ సహచరులందరూ రాజీనామాలు చేశారు. దీనితో బోరిస్ జాన్సన్ తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications