ఆస్ట్రేలియా అధికారి పొరపాటు: మోడీతో సహా దేశాధి నేతల వివరాలు లీక్
లండన్: భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా 31 మంది ప్రపంచ దేశాధినేతల కీలక వివరాలు ఇంటర్నెట్‌లోకి వచ్చాయి. ఆస్ట్రేలియా అధికారులు పొరపాటున ఈ వివరాలను ఇంటర్నెట్‌లో పోస్టు చేశారు. ఈ విధంగా లీకైన వాటిలో దేశాధినేతల పాస్ పోర్టు, ప్రయాణ వివరాలతోపాటు వ్యక్తిగత అంశాలు కూడా ఉన్నాయి.
జీ-20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు గత నవంబరులో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు 31 మంది వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా సేకరించిన ప్రపంచ నాయకుల డేటా పొరపాటున బహిర్గతమైంది.

మోడీతోపాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మోర్కెల్, చైనా అధ్యక్షుడు జింపింగ్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తదితర దేశాధి నేతల వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయి.
ఆస్ట్రేలియన్ ఇమ్మిగ్రేషన్ విభాగంలోని ఓ అధికారి చేసిన పొరపాటు వల్లే ఈ వివరాలు బహిర్గతమైనట్లు తెలుస్తోంది. దేశాధి నేతల వివరాలను ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వాహకులకు ఇంటర్నెట్ ద్వారా పంపించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications