వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీ20: 11 ఏళ్ల తరువాత కలుస్తున్న బైడెన్, జిన్‌పింగ్.. ఏం చర్చించనున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చైనా రష్యా సంబంధాలు

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సోమవారం ఇండోనేషియాలోని బాలిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలవనున్నారు.

భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీరిద్దరి సమావేశం జరుగుతుంది.

అధ్యక్షుడిగా జో బైడెన్‌కు జిన్‌పింగ్‌తో తొలి సమావేశం ఇది.

తైవాన్, రష్యా అంశాలతో పాటు వాణిజ్య రంగంలోనూ రెండు దేశాల మధ్య సంబంధాలు ఘర్షణాత్మకంగా ఉన్న దశలో ఈ ఇద్దరు నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఇద్దరు నేతలు 11 ఏళ్ల తర్వాత జీ20 గ్రూప్ లీడర్స్ కాన్ఫరెన్స్‌లో ముఖాముఖి కలుసుకోబోతున్నారు.

తైవాన్‌కు అమెరికా బహిరంగ మద్దతు ఇస్తుండటం, చైనా ఇటీవల తైవాన్‌లో సైనిక విన్యాసాల ద్వారా తన బలాన్ని ప్రదర్శించిన తరుణంలో ఈ ఇద్దరు నాయకుల సమావేశం చాలా ఆసక్తికరంగా మారింది.

అమెరికా చైనా సంబంధాలు

షీ జిన్‌పింగ్-జో బిడెన్

చైనాలో షీ జిన్‌పింగ్ మూడోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ సమావేశం జరుగుతోంది.

ఇక అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి తొలి ట్రెండ్స్‌లో కనిపించినంత నష్టం జరగలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేదానికి ఈ శిఖరాగ్ర సమావేశం నిదర్శనంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

''ఇద్దరు నాయకులు చర్చలు కొనసాగించడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. అలాగే ఇరుదేశాలు స్నేహపూర్వకంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు, ముఖ్యంగా అంతర్జాతీయ సవాళ్లపై ఇరు దేశాలు బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలో, ఎలా కలిసి పనిచేయాలో అన్నదాని గురించి మాట్లాడుకుంటారు’’ అని వైట్‌హౌస్ ప్రతినిధి కరెన్ జీన్-పియర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అమెరికా చైనా సంబంధాలు

ఈ భేటీ ఎలా ఉండబోతోంది?

బాలిలో జీ20 లీడర్స్ గ్రూప్ సమావేశానికి ముందు అమెరికా, చైనాల ఈ భేటీ ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో జరిగిన భేటీలాంటి అనుభవాన్ని ఇస్తోందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.

ఈ సమావేశం ఉద్దేశం రెండు దేశాల మధ్య ఘర్షణను, వివాదాలను తగ్గించడం, రెండు దేశాల మధ్య సామరస్య పూర్వక వాతావరణాన్ని ఏర్పరచడమేనని ఈ కథనం పేర్కొంది.

''ఈ సమావేశం ఎటువంటి నాటకీయ మార్పులను తీసుకురాదు. రెండు ఆర్థిక అగ్రరాజ్యాల అధినేతలు కలుసుకుంటున్నారు. వాటి మధ్య ప్రస్తుత సంబంధాలు కోల్డ్‌వార్ 2.0 లాగా ఉన్నాయి’’ అని లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌లోని ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ హర్ష్‌పంత్ అన్నారు

బైడెన్ తన ఉద్దేశాలను చెప్పారని, తన హద్దులు ఏంటో తాను గీసుకున్నారని, వీటిపై షీజిన్‌పింగ్ ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవాలనుకుంటున్నారని పంత్ అన్నారు.

ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నం జరుగుతుందని దిల్లీలోని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చైనా వ్యవహారాల నిపుణుడు డాక్టర్ ఫైజల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

“తైవాన్‌పై తన వైఖరిని అమెరికా మార్చుకోబోవడం లేదు. కానీ ఇప్పుడు చైనాతో ఉద్రిక్తతలను పెంచే కొత్త విషయం ఏమీ ఆ దేశం చెప్పబోదు. చైనాతో సంబంధాల మధ్య ఘర్షణాత్మక వైఖరిని తగ్గించుకోవాలని అమెరికా కోరుతోంది’’ అని డాక్టర్ ఫైజల్ అహ్మద్ అన్నారు.

చైనాకు నాయకుడిగా షీ జిన్‌పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. మరోవైపు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు కూడా జరిగాయి. ఇప్పుడు ఇరువురు నేతలూ ఎలాంటి సమస్యలు లేని వాతావరణంలో వ్యూహాత్మకంగా కీలక అంశాలపై చర్చించుకోవచ్చు.

తైవాన్‌తో పాటు రెండు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, సముద్ర భద్రత తదితర అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

అయితే, ఈ సమావేశం నుంచి ఎలాంటి మార్పును ఆశించకూడదని హర్ష్ పంత్ అభిప్రాయపడ్డారు.

అమెరికా చైనా సంబంధాలు

2011లో బిడెన్, జిన్‌పింగ్‌ను కలిసినప్పుడు..

ఆగస్ట్ 2011లో, జో బైడెన్ బరాక్ ఒబామా పాలనా కాలంలో వైస్-ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఆరు రోజుల పాటు చైనాను సందర్శించారు.

ఈ సమయంలో ఆయన షీ జిన్‌పింగ్‌తో అయిదుసార్లు సమావేశమయ్యారు.

బైడెన్ చైనా పర్యటన జరిగిన ఆర్నెల్ల తర్వాత షీ జిన్‌పింగ్ అమెరికాను సందర్శించినట్లు జపాన్ నుండి ప్రచురితమయ్యే నిక్కీ ఏషియా పత్రిక రాసింది.

వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్, బైడెన్‌ల మధ్య సమావేశం జరిగింది.

తర్వాత బైడెన్ ఆయన్ను అధ్యక్షుడితో మర్యాదపూర్వక సమావేశం కోసం ఓవల్ ఆఫీసుకు తీసుకెళ్లారు.

బరాక్ ఒబామా, జో బైడెన్, షీ జిన్‌పింగ్‌ల మధ్య అసాధారణ రీతిలో 85 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది.

ఈ దశాబ్దంలో ఇరు దేశాలు, నేతల మధ్య సంబంధాలు మలుపు తిరిగాయి.

“బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అమెరికా-చైనా సంబంధాలు ఇప్పటికంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి.

కానీ, ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిని ఉన్నాయి’’ హర్ష్ పంత్ వ్యాఖ్యానించారు.

అమెరికా చైనా సంబంధాలు

రష్యా-చైనా సాన్నిహిత్యం

''ఇటీవల కాలంలో చైనాకు వ్యతిరేకంగా బైడెన్ కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ను నిషేధించారు. టెక్ చిప్‌ల ఎగుమతిని నిలిపేశారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లోని కొన్ని కోర్సుల్లో చైనీస్ విద్యార్థుల ప్రవేశంపై కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.11 ఏళ్లలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయి’’ అని పంత్ అభిప్రాయపడ్డారు.

జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్ట్జ్ ఈ నెలలోనే చైనా పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో, షీ జిన్‌పింగ్ స్కోల్ట్జ్‌తో మాట్లాడుతూ ''చైనా అణు ఆయుధాల ఉపయోగాన్ని లేదా ముప్పును వ్యతిరేకిస్తుంది’’ అని చెప్పారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగిస్తారన్న ఆందోళనల నడుమ, దీనిపై చైనా ఒక ప్రకటన చేయాలన్న వాదన వినిపించింది.

“అణ్వాయుధాల వినియోగానికి వ్యతిరేకంగా చైనా ఒక ప్రకటన చేయాలి. అయితే రాబోయే రోజుల్లో రష్యా, చైనా మధ్య సంబంధాలు మారవు, ఇంకా బలపడతాయి కూడా’’ అన్నారు హర్ష్ పంత్.

అమెరికా చైనా సంబంధాలు

వాణిజ్యంలో లాభనష్టాలు

“వాణిజ్య యుద్ధంలో అమెరికా ఆర్థికంగా నష్టపోయింది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో అమెరికా వాణిజ్యంలో 5.7 శాతం నష్టాన్ని చవిచూసినట్లు నివేదికలో వెల్లడైంది. చైనాతో సంబంధాలు లేకుండా ఆర్థికంగా ముందుకు వెళ్లలేమని అమెరికాకు ఇప్పుడు అర్థమైంది’’ అని ఫైజల్ అహ్మద్ అన్నారు.

"చైనా వ్యాల్యూ చైన్ చాలా బలంగా ఉంది. అమెరికన్ కంపెనీలు చైనా నుండి పూర్తిగా నిష్క్రమించడం సులభం కాదు. ఏదైనా కంపెనీ చైనా నుండి నిష్క్రమిస్తే, అది దాని వ్యాల్యూ చైన్‌ను రెండు-మూడు దేశాలకు విస్తరించవలసి ఉంటుంది. ఆర్ధికంగా కంపెనీలకు ఇది అంత లాభదాయకం కాదు’’ అని ఫైజల్ అహ్మద్ అన్నారు.

''వన్ చైనా పాలసీని తిరస్కరించడం, దాన్ని లేకుండా చేయాలనుకోవడాన్ని అమెరికా మానేయాలి’’ అని ఇటీవల చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ వ్యాఖ్యానించారు.

1978లో వన్‌ చైనా పాలసీని అమెరికా గుర్తించిందని, అయితే తైవాన్‌పై ట్రంప్‌, బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని చూసి అమెరికా ఇప్పుడు చైనా 'వన్‌ చైనా పాలసీ’ని అంగీకరిస్తుందా లేదా అన్నది పెద్ద ప్రశ్న అని డాక్టర్‌ అహ్మద్‌ చెప్పారు.

ఈ సమావేశం వల్ల పెద్దగా ఏమీ సాధించేది ఉండదని నిపుణులు భావిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల కంటే ఈ బంధం కాస్త మెరుగ్గా ఉండేలా ఇరు దేశాల నేతలు ప్రయత్నిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
G20: What will be discussed between Biden and Xining after 11 years?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X