ప్రపంచం చూపు..భారత్ వైపు: మోదీతో భేటీకి భారత్ రానున్న దేశాధినేత
జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్.. భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆయన భారత్ లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
బెర్లిన్: ప్రపంచ దేశాలు.. భారత్ వైపు చూపులు సారిస్తోన్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జీ20 సమ్మిట్ కు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ భేటీ ఏర్పాటు కానుంది. వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు.. ఇందులో పాల్గొనడానికి భారత్ కు రానున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోన్న నేపథ్యంలో దీనికి ఉద్దేశించిన సన్నాహాక సమావేశాలు ఇప్పటికే మొదలయ్యాయి.
జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్‌పింగ్ హాజరు కానున్నారు. వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్.. భారత పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో భారత్ లో పర్యటిస్తారు. 25వ తేదీన దేశ రాజధానికి వస్తారాయన. ఆయన వెంట జర్మనీ విదేశాంగ, ఆర్థిక, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు భారత్ కు రానున్నారు. 26వ తేదీన బెంగళూరుకు వెళ్తారు. బెంగళూరులో వాణిజ్య సదస్సులో పాల్గొంటారు.
జర్మన్ ఛాన్సలర్ గా నియమితులైన తరువాత ఒలాఫ్ ష్కాల్జ్.. భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. తన రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఒలాఫ్ ష్కాల్జ్- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమౌతారు. ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకుంటారు. పెట్టుబడులు, రక్షణ, వాణిజ్యం..వంటి రంగాలకు సంబంధించిన ఒప్పందాలు ఇవి. వివిధ సంస్థల సీఈఓలతోనూ ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications