కుప్పకూలిన ఎయిర్‌బస్ ఏ320: 148 మంది మృతి?
ప్యారిస్: దక్షిణ ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో విమానంలో 142 మంది ప్రయాణికులు, 6గురు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో వీరంతా మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

ప్రమాదానికి గురైన ఎయిర్ బస్ ఏ320 విమానం జర్మన్ వింగ్స్ సంస్థకు చెందినదని అధికారులు చెప్పారు. బార్సిలోనా నుంచి డస్సెల్ డార్ఫ్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డిగ్నే అనే ప్రాంతంలో ఫ్రెంచ్ ఆల్ఫ్స్ దగ్గర ఈ విమానం కూప్పకూలిపోయిందనే సమాచారం వచ్చిందని అధికారులు చెప్పారు.
ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్ ప్రాంతంలోని డిగ్ని లెస్ బైన్స్ ప్రాంతంలో విమానంతో రాడార్ సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే దిగ్ర్భాంతి
విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది జర్మనీ, స్పానిష్, టర్కీ జాతీయులని ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండే తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతం మారుమూల ఉండటంతో సహాయ బృందాలు చేరుకోవడం ఆలస్యమైందని చెప్పారు. విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్‌తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
విమానం తక్కువ ఎత్తులో వెళ్లింది
విమానం అతితక్కువ ఎత్తులో వెళ్లిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతంలో కూలిపోయిన విమానం 33000 అడుగులపైన ప్రయాణిస్తూ, ఒక్కసారిగా 6,800 అడుగుల దిగువకు వచ్చినట్లు విమానవర్గాలు తెలిపాయి. ఆ సమయంలో ఒక్కసారిగా రాడార్‌తో విమాన సంబంధాలు తెగిపోయాయని వారు వెల్లడించారు. కాగా, విమానం కూలిన ప్రదేశం సాధారణంగా మంచుతో కప్పబడి ఉంటుందని, అయితే ఇప్పుడు పొడిగా ఉంటుందని స్థానికులు తెలిపారు. జర్మన్ విమానయాన సంస్థ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications