కాబూల్ లో సినీ ఫక్కీలో విమానం చోరీ-తొలుత హైజాక్, తర్వాత దొంగతనం-ఇరాన్ పై అనుమానం
ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన తమ పౌరుల్ని వెనక్కి తెచ్చేందుకు వెళ్లిన ఉక్రెయిన్ విమానం ఒకటి హైజాక్ కు గురైంది. కాబూల్ ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి స్వదేశానికి బయలుదేరిన విమానాన్ని కొందరు
హైజాక్ చేసినట్లు తెలిసింది. ఈ విమానాన్ని వీరు ఇరాన్ తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానాన్ని కొందరు సాయుధులు బెదిరించి ఇరాన్ తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి యెనిన్ ప్రకటించారు. ఆదివారం ఈ విమానం హైజాక్ కు గురైందని, ఆయితే నిన్న ఈ విమానాన్ని హైజాకర్లు దొంగిలించారని, తమ పౌరుల్ని కాకుండా ఇతరుల్ని ఎక్కించుకుని ఇరాన్ వెళ్లిపోయినట్లు మంత్రి వెల్లడించారు. దీంతో కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి పౌరుల తరలింపు కోసం తాము చేపడుతున్న చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు ఆయన పేర్కొన్నారు.

కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి ఉక్రెయిన్ ప్రయాణికుల్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన వారి విమానాన్ని అక్కడి డిమాండ్ దృష్ట్యా కొందరు సాయుధులు తొలుత హైజాక్ చేసినట్లు నటించి ఆ తర్వాత పూర్తిగా దొంగిలించుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాబూల్ ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున జనం తమ స్వదేశాలకు వెళ్లేందుకు రోజుల తరబడి వేచి చూస్తున్నారు. ఇందులో కొందరు ఈ చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. పైకి హైజాక్ అని చెప్తున్నా.. సాంకేతికంగా చోరీ జరిగినట్లేనని ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి తెలిపారు.
మరోవైపు విమానం చోరీ ఘటనపై స్పందించిన నార్వే.. ఉక్రెయిన్ పౌరుల తరలింపుకు ఆప్ఘన్ లో తాలిబన్లు విధించిన డెడ్ లైన్ ఆగస్టు 31 నుంచి పొడిగించే అవకాశం ఉందన్నారు.. ఈ విషయంలో ఉక్రెయిన్ కు సహకారం అందిస్తామన్నారు. అటు చోరీ అయిన విమానం తమ దేశంలోకి వచ్చిందన్న వార్తల్ని ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. అలాంటి విమానమేదీ తమ గడ్డపై ల్యాండ్ కాలేదని తెలిపింది. దీంతో హైజాక్, చోరీ చేసిన సాయుధులు దాన్ని ఏ దేశం తీసుకెళ్లారనే దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications