సెట్స్‌లో ప్రాప్ గన్‌తో కాల్పులు: చీఫ్ సినిమాటోగ్రాఫర్ దుర్మరణం: దర్శకుడికి తీవ్ర గాయాలు
మెక్సికో సిటీ: ఓ హాలీవుడ్ సినిమా చిత్రీకరణలో అపశృతి చోటు చేసుకుంది. సినిమా షూటింగ్‌లో వినియోగించే ప్రాప్ గన్‌తో కాల్పులు జరపడంతో చీఫ్ సినిమాటోగ్రాఫర్ దుర్మరణం పాలయ్యాడు. దర్శకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు.
శాంటా ఫె కంట్రీలో..
అమెరికాలోని న్యూ మెక్సికోలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెక్సికో సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది ఇది. ఇక్కడి శాంటా ఫె కంట్రీలోని బొనాంజా క్రీక్ రాంచ్‌లో సినిమా షూటింగ్ కొనసాగుతోంది. సినిమా పేరు రస్ట్ (Rust). ఎడారి వంటి ప్రదేశంలో ఉంటుందీ బొనాంజా క్రీక్ రాంచ్. చెక్కలతో నిర్మించిన కొన్ని నివాసాలు మాత్రమే ఉంటాయి అక్కడ. కౌబాయ్ తరహా సినిమాల చిత్రీకరణకు అనుకూలంగా ఉంటుంది ఇక్కడి ప్రాంతం.
రస్ట్ మూవీ కోసం..
తాజాగా రస్ట్ మూవీ చిత్రీకరణ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది యూనిట్. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు అలెక్ బాల్డ్‌విన్ ఇందులో హీరో. అతను లీడ్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నాడు. జైలు నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఓ దొంగ పాత్రను పోషిస్తున్నాడతను. అవుట్ లాస్ క్యారెక్టర్ అది. అతని క్యారెక్టర్ పేరు హార్లాండ్ రస్ట్. జైలు నుంచి తప్పించుకుని, తన 13 సంవత్సరాల వయస్సున్న మనవడితో బొనాంజా క్రీక్ రాంచ్‌లోని ఓ ఇంట్లో తలదాచుకుంటాడు.
కాల్పుల సన్నివేశాలు తెరకెక్కిస్తోండగా..
ఈ సమాచారం తెలుసుకున్న యూఎస్ మార్షల్స్.. అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తారు. ఈ సందర్భంగా మార్షల్స్.. అలెక్ మధ్య కాల్పులు చోటు చేసుకుంటాయి. దీనికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సినిమాకు దర్శకుడు జోయెల్ సౌజా. ఇదివరకు బుల్లెట్ ప్రూఫ్, క్రిస్మస్ ట్రేడ్, ఘోస్ట్ స్క్వాడ్, హన్నాస్ గోల్డ్, బ్రేక్ నైట్, మెషీన్ హెడ్ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. టాప్ మహిళా చీఫ్ సినిమాటోగ్రాఫర్‌గా హెలైనా హచిన్స్ ఈ రస్ట్ మూవీ కోసం పని చేస్తోన్నారు.
రక్తపు మడుగులో..
బొనాంజా క్రీక్ రాంచ్‌లో కొన్ని ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న సమయంలో అలెక్ బాల్డ్‌విన్.. తన క్యారెక్టర్‌లో భాగంగా ప్రాప్ గన్ వినియోగించాడు. షూటింగ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఆ ప్రాప్ గన్ నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ బుల్లెట్లు చీఫ్ సినిమాటోగ్రాఫర్ హెలైనా హచిన్స్, దర్శకుడు జోయెల్ సౌజాను తాకాయి. దీనితో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు.
సినిమాటోగ్రాఫర్ దుర్మరణం..
వెంటనే హెలికాప్టర్ అంబులెన్స్ ద్వారా వారిని ఆసుపత్రికి తరలించారు. హెలైనా హచిన్స్‌ను యూనివర్శిటీ ఆఫ్ న్యూ మెక్సికో వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హెలైనా హచిన్స్ మరణించారు. ఆమె వయస్సు 42 సంవత్సరాలు. దర్శకుడు జోయెల్ సౌజాను శాంటా ఫే లోనే ఉన్న క్రిస్టస్ సెయింట్ విన్సెంట్ రీజినల్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
మిస్ ఫైర్‌గా..
సమాచారం అందుకున్న వెంటనే న్యూమెక్సికో పోలీసులు బొనాంజా క్రీక్ రాంచ్‌కు చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. అలెక్ బాల్డ్‌విన్ ఉపయోగించిన ప్రాప్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్దేశపూరకంగా కాల్పులు జరపాల్సి వచ్చిందా? ప్రమాదకరంగా తుపాకీ పేలిందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న రస్ట్ మూవీ యూనిట్ సభ్యులను ప్రశ్నించారు. వారి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. ప్రాప్ గన్ మిస్ ఫైర్ అయిందంటూ వారు స్టేట్‌మెంట్ ఇచ్చారు.