
హష్ పప్పీ: ఆన్‌లైన్ ప్రేమలతో మొదలుపెట్టి.. అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమినెల్‌గా ఎదిగిన ఇన్‌స్టాగ్రామర్ కథ

''హష్ పప్పీ’’ - ఇది బ్రాండ్ పేరు కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25లక్షల మంది ఫాలోవర్లు ఉన్న రామోన్ అబ్బాస్ ఇన్‌స్టా హ్యాండిల్.
ప్రపంచంలోనే తీవ్రమైన నేరాలకు పాల్పడినందుకు గాను, ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అబ్బాస్ పేరు కూడా ఉంది.
మనీ లాండరింగ్ నేరం రుజువైతే, ఆయన అమెరికాలో 20 ఏళ్ల వరకు జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది.
నైజీరియాలో 'యాహూ బాయ్'గా కలకలం సృష్టించి, 'బిలియనీర్ గుక్కీ మాస్టర్'గా మారి కోట్లాది రూపాయిలను కొల్లగొట్టిన సైబర్ నేరాల వెనుకనున్న వ్యక్తి పూర్వాపరాలు తెలుసుకునేందుకు బీబీసీ ఇటీవల ప్రయత్నించింది. దుబాయిలో గతేడాది అబ్బాస్ అరెస్టు అయ్యారు.
37ఏళ్ల అబ్బాస్ లాగోస్‌కు ఈశాన్యంగా ఉన్న సముద్ర తీర ప్రాంతం ఒవోరోన్‌షోకిలో తన కెరీర్ మొదలుపెట్టారు.
"ఓలోజోజో మార్కెట్‌లో ఆయన తల్లితో కలిసి పని చేసే బాలుడిగా నాకు అబ్బాస్ గుర్తున్నారు" అని స్థానిక డ్రైవర్ సేయే బీబీసీకి చెప్పారు. అబ్బాస్ తండ్రి ఒక ట్యాక్సీ డ్రైవర్.
క్రమంగా అబ్బాస్ డబ్బును విపరీతంగా వెదజల్లడం మొదలుపెట్టాడు. "డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా దాతృత్వంతో వ్యవహరించేవాడు. అందరికీ బీర్ కొనిపెట్టేవాడు" అని చెప్పారు.
"ఆయనకు అకస్మాత్తుగా ఈ డబ్బు సైబర్ నేరాలు చేయడం ద్వారా వచ్చినట్లు అందరికీ తెలుసు. ఆయనొక "యాహూ" అని సేయే చెప్పారు.

ఆన్‌లైన్‌లో ప్రేమ పేరు చెప్పి మోసం చేసేవారిని "యాహూ బాయ్స్’’ అంటారు. నైజీరియాలో తొలిసారి ఉచితంగా అందుబాటులోకి వచ్చిన యాహూ మెయిల్ ద్వారా వారికీ పేరు వచ్చింది.
"వాళ్ళు మొదట్లో వ్యక్తిగత వివరాలను దొంగిలించడం మొదలుపెట్టారు. నెమ్మదిగా డేటింగ్ మోసాలు మొదలుపెట్టారు" అని లాగోస్ స్టేట్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్ నిపుణుడు డాక్టర్ అడేడేజి ఓయేనుగా చెప్పారు.
నకిలీ ఆచూకీతో ఒక్కసారి బంధం ఏర్పడిన తర్వాత, ఈ రొమాన్స్ స్కామర్లు ఆన్‌లైన్ ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెడతారు.
ఇతర యాహూ బాయ్స్ మాదిరిగానే అబ్బాస్ కూడా తన నేరాల పరిధిని విస్తరించుకున్నారు. అందులో చాలా మంది మలేసియా వెళ్లారు. అబ్బాస్ కూడా వారిని అనుసరించారు. ఆయన 2014లో మలేసియాలో అడుగుపెట్టి, 2017కల్లా దుబాయి చేరారు.
నార్త్ కొరియా హ్యాకర్లు
ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు, నేరాలు మరో స్థాయికి చేరుకున్నాయి.
2019 ఫిబ్రవరిలో నార్త్ కొరియా హ్యాకర్లు మాల్టా బ్యాంక్ ఆఫ్ వాలెట్టా నుంచి దొంగలించిన 15మిలియన్ డాలర్లను అబ్బాస్ లాండర్ చేసేందుకు ప్రయత్నించాడు. (నల్లధనాన్ని చట్టబద్ధమైన ధనంగా మార్చే ప్రక్రియను మనీ లాండరింగ్ అంటారు).
"ఈ దోపిడీ హాలీడే దీవిని గందరగోళంలోకి నెట్టేసింది" అని మాల్టా ఛాంబర్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ అబిగైల్ మామో అన్నారు.
"పేమెంట్ వ్యవస్థలన్నీ ఆగిపోవడంతో వినియోగదారులు షాపింగ్ ట్రాలీలను చెక్ అవుట్ కౌంటర్ల దగ్గర వదిలేసి రావల్సిన పరిస్థితి ఏర్పడింది."
"బ్యాంక్ ఆఫ్ వాలెట్టా ప్లాట్‌ఫార్మ్ ద్వారా విదేశీ సప్లయర్లకు డబ్బును బదిలీ చేస్తుంటే, డబ్బులు వారికి అందటం లేదని చెబుతూ మా సభ్యుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి" అని మామో చెప్పారు.
"మేము కొన్ని వేల యూరోల గురించి మాట్లాడుతున్నాం" అని చెప్పేవారు.
అయితే, 10 మిలియన్ యూరోల వరకూ తిరిగి రాబట్టినట్లు బ్యాంకు తెలిపింది.

"ఎఫ్‌బీఐ ఈ దోపిడీని చేధించేందుకు సందేశాలు సేకరిస్తున్నప్పుడు.. అబ్బాస్ తన తోటి స్కామర్‌కు "డామ్" (నిరాశతో వ్యక్తం చేసే ఇంగ్లీష్ పదం) అని పంపిన సందేశం దొరికింది.
మరి కొన్ని వారాల్లోనే మరో దోపిడీ చేయబోతున్నాం. ప్రణాళిక సిద్ధం అవ్వగానే మీకు చెబుతాం. వారు మనలో కొందరిని పట్టుకోవడం చాలా దురదృష్టకరం. లేదంటే, ఇది మంచి లాభాలను తెచ్చి ఉండేది" అని ఆ సందేశానికి మరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుడు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చేయబోయే దోపిడీ గురించి ప్రణాళికను సూచించే విధంగా ఇది ఉంది.
మే 2019లో అబ్బాస్‌కు మెక్సికోలో బ్యాంకు అకౌంటు తెరిచే పనిని అప్పగించారు.
ఆ అకౌంటులోకి ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ క్లబ్ నుంచి 100 మిలియన్ పౌండ్లు, ఒక యూకే సంస్థ నుంచి 200 మిలియన్ పౌండ్లు రావాల్సి ఉంది. కానీ, ఈ విషయం గురించిన ప్రస్తావన కోర్టు పత్రాల్లో ఎక్కడా కనిపించలేదు.
బిజినెస్ ఈ-మెయిల్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఈ మోసాలు చేయాలని ప్రణాళిక చేశారు.
ఈ మోసంలో సప్లయర్ ఈ-మెయిల్‌ను పోలినట్లు ఒక నకిలీ ఈ-మెయిల్ సృష్టిస్తారు. నకిలీ ఈ-మెయిల్‌తో క్లయింట్‌కు చెల్లింపులు చేయమని మెయిల్ పంపిస్తారు. అందులో బ్యాంకు అకౌంటు వివరాలు కూడా పొందుపరుస్తారు.
ఈ తరహాలోనే బిజినెస్ ఈ-మెయిల్ కాంప్రమైజ్ జరుగుతుంది.
ఈ ఐడిలో కేవలం ఒక అక్షరం లేదా, ఒక సంఖ్య.. అసలు ఐడి కంటే భిన్నంగా ఉంటుంది.
అకౌంట్ గుమాస్తాలు కూడా అది సప్లయర్ నుంచి వచ్చిన మెయిల్‌లాగే భావించి మోసపోతారు.
ఒకే ఒక్క మౌస్ క్లిక్‌తో భారీగా డబ్బును పోగొట్టుకుంటారు.
- 'ఈ ఇంట్లో కాఫీ మెషీన్ దానంతట అదే కాఫీ తయారు చేస్తుంది, లైట్ దానంతటదే వెలుగుతుంది' - డిజిహబ్
- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
కానీ, యూకే బ్యాంకులు మెక్సికో అకౌంటుకు డబ్బులు బదిలీ చేయడానికి తిరస్కరించడంతో, ఈ ప్రీమియర్ దోపిడీ ప్రణాళిక ముందుకు సాగలేదు.
"నేను యూకే నుంచి మెక్సికో పంపలేను" అంటూ అబ్బాస్‌తో కలిసి పని చేసే మరో స్కామర్ అబ్బాస్‌కు సందేశం పంపారు.
అయితే, ఈ దోపిడీలో బాధితులెవరూ తమను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు నిర్ధారించలేదు.
వివిధ భౌగోళిక ప్రాంతాల్లో అల్లుకుని ఉన్న క్రిమినల్ నెట్‌వర్క్ లను పట్టుకోవడం చాలా కష్టం అని యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీలో ఫ్రాడ్ లీడ్‌గా పని చేస్తున్న జాన్ షిల్లాండ్ అన్నారు.
దుబాయిలో ఉన్న న్యాయవాది బార్నీ అల్మజార్‌తో సహా ఇది అందరికీ బాగా తెలిసిన విషయం.
ఆయన మొత్తం 25 మంది బాధితుల తరుపున వాదిస్తున్నారు. అందులో యూఏఈ లో ఉంటున్న 8 మంది యూకేకు చెందిన వ్యక్తులు ఉన్నారు.
వీరంతా హష్ పప్పీ బిజినెస్ ఈ-మెయిల్ కాంప్రమైజ్ మోసానికి గురైనవారని భావిస్తున్నారు.
"అయితే, ఈ మోసం వెనుక హష్ పప్పీ ఉన్నట్లు 100 శాతం చెప్పలేం" అని అల్మజార్ చెబుతున్నారు.
"కానీ, పోలీసులు కనిపెట్టిన బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే, అవన్నీ దుబాయిలో ఉన్న హష్ పప్పీ ఇంటిపై రెయిడ్‌లు నిర్వహించినప్పుడు దొరికిన రికార్డులతో సంబంధం ఉన్నట్లు అర్ధమవుతోంది.
"పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక యూకే బాధితుడు 500,000 పౌండ్లను పోగొట్టుకుని యూఏఈ ని వదిలిపెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ మోసంతో అప్పుల వల్ల ఆయనిప్పుడు దుబాయిలో నేర విచారణను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
"ఆయనొక బాధితుడని ఆయన క్లయింట్‌లకు తెలుసు" అని అల్మజార్ చెప్పారు.
"కానీ, ఈ నష్టాలను పూడ్చుకోవాలి. ప్రస్తుతానికి ఆయనకు యూఏఈ ఎలా తిరిగి వెళ్ళాలో అర్ధం కావడం లేదు. ఆయన జీవితమంతా అక్కడే గడిపారు. ఆయన కుటుంబం ఇంకా అక్కడే ఉంది. ఇమ్మిగ్రేషన్‌లో ఆయనను వెంటనే అనుమానిస్తారేమోనని ఆయన భయపడుతున్నారు" అని చెప్పారు.
సిగ్గుతో చాలా మంది బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి ముందుకు రారని అల్మజార్ చెప్పారు.
ఇప్పుడిప్పుడే హష్ పప్పీ బాధితులు తమకు జరిగిన అన్యాయం గురించి చెబుతూ ముందుకు వస్తున్నారు.
"ఈ మోసాన్ని చాలా తెలివితేటలతో చేశారు. ప్రొఫెషనల్ వ్యక్తులు కూడా బాధితులుగా మారారు. కొందరైతే, ఏమి జరిగిందో చెప్పడానికి సంకోచిస్తున్నారు" అని ఆయన చెప్పారు.
- సెల్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చా?
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
ఖతార్ స్కూల్ మోసం
జూన్ 2020, దుబాయిలో అరెస్టు కాక ముందు అబ్బాస్ వ్యక్తిగత వివరాలను దొంగిలించే మరొక పెద్ద నేరానికి పాల్పడ్డాడు.
ఆయన గల్ఫ్‌లో కొత్త స్కూల్ కట్టేందుకు ఖతార్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త నుంచి 15 మిలియన్ డాలర్ల లోన్ అడిగి మోసం చేసేందుకు ఒక న్యూయార్క్ బ్యాంకర్ అవతారం ఎత్తారు.
డిసెంబరు 2019 నుంచి ఫిబ్రవరి 2020 మధ్య వరకూ అబ్బాస్ కెన్యా, నైజీరియా, యూఎస్‌లలో ఉన్న కొంత మంది మధ్యవర్తుల ముఠాతో కలిసి కొన్ని మిలియన్ డాలర్లను రాబట్టారు.
అందులో కొంత డబ్బుతో 230,000 డాలర్ల ఖరీదు చేసే వాచ్ కొన్నారు
https://www.instagram.com/p/B918wDMJUNP/
కానీ, ఈ ముఠా సభ్యుల మధ్య విబేధాలు బయటపడటం నెమ్మదిగా మొదలయింది.
ఆ ముఠాలో ఓ సభ్యుడికి చాలా తక్కువ మొత్తం లభించడంతో, ఈ మొత్తం మోసాన్ని బయటపెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు.
ఆ వ్యక్తి నోరు మూయించాలని అబ్బాస్ నిర్ణయించుకున్నారు.
"జీవితంలో ఎన్నడూ తినని దెబ్బలను అతడికి రుచి చూపించండి" అని నైజీరియా పోలీసు ఆఫీసర్ అబ్బా క్యారీకి అబ్బాస్ మెసేజ్ పెట్టాడు.
"ఈ అబ్బాయిని జైలుకు పంపేందుకు నేను డబ్బులు ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాను. అతనిని ఎక్కువ రోజులు జైలులోనే ఉండనివ్వండి" అని ఆ మెసేజ్‌లో రాశాడు.
ఆ తర్వాత క్యారీ ఆ మధ్యవర్తిని నేరారోపణలు ఏవీ లేకుండానే నైజీరియా జైలులో ఒక నెల రోజుల పాటు పెట్టినట్లు అభియోగాలు ఉన్నాయి.
మోసం, మనీ లాండరింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ నేరాలకు గాను, క్యారీ కూడా ప్రస్తుతం అమెరికాలో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయన ముందు తనకు అబ్బాస్‌తో సంబంధం ఉందనే ఆరోపణలను తిరస్కరించారు.
ఈ విషయంపై బీబీసీతో మాట్లాడేందుకు ఆయన స్పందించలేదు.
- మీ సెల్‌ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రిలయన్స్ జియో: టెలికాం కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతుంటే 'జియో'పై కాసుల వర్షం ఎలా?
తగ్గని ఫాలోవర్లు
బిజినెస్ ఈ-మెయిల్ కాంప్రమైజ్ ఫ్రాడ్ ప్రపంచ వ్యాప్తంగా కలవరపెడుతున్న సమస్య.
2020లోనే ఈ మోసం వల్ల 1.8 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది.
అబ్బాస్ చేసిన నేరాల వల్ల బాధితులకు 24 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు కోర్టు పత్రాలు చెబుతున్నాయి. కానీ, నిజానికి ఈ మొత్తం మరింత ఎక్కువ ఉండవచ్చు.
ఆయనను అరెస్టు కావడానికి 8 నెలల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ప్రొఫైల్ వివరాలను "బిలియనీర్ గుక్కీ మాస్టర్" నుంచి "రియల్ ఎస్టేట్ డెవెలపర్ గా మార్చుకున్నారు.
ఆయన మనీ లాండరింగ్ నేరాలను చేసినట్లు అంగీకరించిన తర్వాత కూడా హష్ పప్పీ సోషల్ మీడియా అకౌంటు ఇంకా ఫాలోవర్లను ఆకర్షిస్తోంది
ఆయన అకౌంట్ యాక్టివ్‌గా ఉండటం పట్ల ఇన్‌స్టాగ్రామ్‌ను సంప్రదించాం. ఆయన అకౌంట్ విషయంలో పరిశోధన చేసి దానిని మూసివేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ బీబీసీకి చెప్పింది.
ఇదే ప్రశ్నను స్నాప్‌చాట్‌ను అడిగిన కొన్ని రోజులకు హష్ పప్పీ అకౌంటును తొలగించారు.
ఆయనకున్న ఫాలోవర్లను చూస్తుంటే, ఆయనను ఇంకా చాలా మంది ఒక రోల్ మోడల్‌గానే చూస్తున్నారని డాక్టర్ ఓయేనుగా చెప్పారు.
''చాలా మంది యువత ఇబ్బందులు పడుతున్న దేశంలో మేము నివశిస్తున్నాం. ఒకప్పుడు వారిలాగే ఉన్న ఒక యువకుడు గొప్పగా అవ్వడాన్ని మాత్రమే చూస్తున్నారు" అని డాక్టర్ ఓయేనుగా అన్నారు.
"యాహూ బాయ్స్‌గా మారేందుకు శిక్షణ పొందడానికి తమ పిల్లలను దగ్గరుండి తీసుకుని వెళ్లిన తల్లితండ్రులను కూడా చూశాను" అని చెప్పారు.
"హష్ పప్పీ నేరం చేశారని అందరికీ తెలుసు. కానీ, అది అర్ధం చేసుకోగలరు. "ఎవరూ పేదవారిగా ఉండిపోవడం కోసం ప్రార్ధించరు. అందుకే, ఎవరైనా ధనవంతులను చూసినప్పుడు, తమను కూడా అలాంటి ధనవంతులను చేయమని భగవంతుని ప్రార్ధిస్తారు" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)