ఆఖరు సారి.. ఆమెను చూడాలి : ఓ వృద్ధుడి చివరి కోరిక
66 ఏళ్ళు కలిసి జీవించిన ఆ వృద్ధుడు తన చివరి క్షణాల్లో భార్యను చూడాలని పరితపించాడు. మొత్తానికి ఆమెను చూపించిన తర్వాత రెండు గంటలకే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచాడు.
చైనా: భాష, జాతి, మతం, దేశం.. ఏదైనా సరే వివాహ బంధానికి అర్థం మారదు. పెళ్లి ఏ పద్ధతిలో చేసుకున్నా దానికి పరమావధి కలకాలం కలిసి జీవించడమే. వాళ్ళూ అలాగే 66 ఏళ్ళు కలిసి జీవించారు. అందుకే తన చివరి క్షణాల్లో కూడా ఆ వృద్ధుడు భార్యను చూడాలని పరితపించాడు. మొత్తానికి ఆమెను చూపించిన తర్వాత రెండు గంటలకే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచాడు.
సినిమా కథను తలపిస్తోన్న ఈ ఘటన చైనాలోని నింగ్బో ప్రాంతానికి చెందిన ఫెంగ్(92) దంపతుల కథ ఇది. వృద్ధుడైన ఫెంగ్ తీవ్ర అనారోగ్యానికి గురై ఇంగ్ జు పీపుల్స్ ఆసుపత్రిలో చేరాడు. అదేసమయంలో ఎముక విరగడంతో అతడి భార్య కూడా అదే ఆసుపత్రిలో చేరింది.
ఫెంగ్ మూడో అంతస్తులోని ఐసీయూలో ఉండగా , ఆయన భార్య పధ్నాలుగో అంతస్తులో చికిత్స పొందుతోంది. భార్యాభర్తలు ఇరువురూ ఒకే ఆసుపత్రిలో దాదాపు నెల రోజులపాటు ఉన్నా ఒకరినొకరు చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి కుదరలేదు.
ఇంతలో ఫెంగ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయన శరీరంలోని పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. ఇక తాను ఎక్కువ రోజులు బతకనని ఫెంగ్ కు అర్థమైంది. తనకిక ఎలాంటి చికిత్సలు చేయవద్దని, శేష జీవితాన్ని ఇంటి వద్ద గడుపుతానని కుటుంబ సభ్యులకు తెలిపాడు.

దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోని డాక్టర్లతో మాట్లాడి ఆయన్ని ఇంటికి చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తీరా ఇంటికి తీసుకెళ్ళే ముందు ఆయన మొహం చిన్నబోయి ఉండడం ఫెంగ్ కుమార్తె గమనించింది. తండ్రి మనసులో బాధపడుతున్నట్లు ఆర్థం చేసుకున్న ఆమె 'పోనీ.. చికిత్స కొనసాగించమంటావా నాన్నా..' అని అడగ్గా తల అడ్డంగా ఊపిన ఆయన.. భార్యను చూసి చాలా కాలమైందని, ఒకసారి ఆమెను చూడాలని ఉందని, అదీ తన చివరి కోరిక అని కుమార్తెతో చెప్పాడు.
దీంతో ఫెంగ్ కుమార్తె ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు జరిపింది. ఫెంగ్ మనసును ఆర్థం చేసుకున్న వైద్యులు కూడా అందుకు అంగీకరించి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన భార్యను స్ట్రెచర్ మీద ఫెంగ్ ఉన్న ఐసీయూలోకి తీసుకొచ్చారు.
వృద్ధ దంపతులు ఇరువురూ ఒకరినొకరు చూసుకుని కన్నీరుమున్నీరు అయ్యారు. ఆ వృద్ధురాలు ఫెంగ్ చేతిని తన చేతిలోకి తీసుకుని.. " నా ఆరోగ్యం గురించి దిగులు పెట్టుకోకండి.. నేను ఇంటికొచ్చేవరకు మీకేం కాకపోతే అంతేచాలు.." అంటూ భోరుమంది. దాదాపు 20 నిమిషాలపాటు దంపతులు పరస్పరం పరామర్శించుకున్నారు.
అనంతరం ఫెంగ్ ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లగా మరో గంటకే ఆయన మరణించారు. అయితే ఆసుపత్రిలో వారిరువురి కలుసుకున్న క్షణాలను తన వద్దనున్న మొబైల్ ఫోన్లో బంధించిన ఒక నర్సు వారిరువురి కలయిక తన మనసును ఎంతగానో కదిలించిందని, నేటి యువతరం వారిని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొంటూ ఆ ఫోటోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎప్పుడో అక్టోబరు నెలలో జరిగిన ఈ సంఘటన తాలూకు ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఫెంగ్ దంపతుల కలయిక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్దిసేపటికే 34 వేల మంది నెటిజన్లు లైకులు, కామెంట్లతో స్పందించారు.












Click it and Unblock the Notifications