నా కోసం కూడా, 'కొత్త పాకిస్తాన్' తర్వాతే పెళ్లి: ఇమ్రాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి తెరతీసిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని తెలిపారు. అయితే తన పెళ్లి నూతన పాకిస్తాన్ అనే స్వప్నం నెరవేరిన తరువాత జరుగుతుందన్నారు.
1995లో బ్రిటన్‌కు చెందిన జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగాక, 2004లో పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోయారు. ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్న ఇమ్రాన్ కొత్తగా పెళ్లిపై ప్రకటన చేయడం పట్ల పలు ఊహాగానాలు జోరందుకున్నాయి.

నవాజ్ షరీఫ్ రాజీనామాను డిమాండ్ చేస్తు ఇమ్రాన్ ఖాన్ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్లమెంటు సమీపంలో తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
కొత్త పాకిస్తాన్ ఏర్పాటు కేవలం మీకోసమే కాదని.. నా కోసం కూడా అని చెప్పారు. తన కొత్త పాకిస్తాన్ కల నిజమయ్యాక పెళ్లి చేసుకుంటానన్నారు.
రాజీనామా చేసేది లేదు
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించడానికి వీలుగా ప్రధాని నవాజ్ షరీఫ్ 30 రోజుల పాటు పదవి నుంచి తప్పుకోవాలన్న ఆందోళనకారుల ప్రధాన డిమాండ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం తిరస్కరించడంతో గత 11 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు ఇప్పట్లో పరిష్కారం లభించే సూచనలు కనిపించడం లేదు.
ప్రభుత్వ ప్రతినిధులు, ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్ (పిటిఐ) ప్రతినిధుల మధ్య శనివారం రాత్రి జరిగిన మూడో విడత చర్చలు విఫలమైనాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ పై ఒక స్వతంత్ర దర్యాప్తు జరిపించడానికి వీలుగా ప్రధాని నవాజ్ షరీఫ్ నెలరోజుల పాటు పదవి నుంచి తప్పుకోవాలని ఇమ్రాన్ పార్టీ డిమాండ్ చేసింది.
ఒక వేళ నిర్దోషిగా తేలితే షరీఫ్ తిరిగి అధికారం చేపట్టవచ్చని చర్చల్లో పాల్గొన్న ఆ పార్టీ ప్రధాన ప్రతినిధి షా మహమూద్ ఖురేషీ విలేఖరులతో అన్నారు. ప్రధాని రాజీనామా చేయాలన్న పిటిఐ డిమాండ్ తమకు ఆమోదం కాదని మరోవైపు ప్రభుత్వ ప్రతినిధి అహసాన్ ఇక్బాల్ చెప్పారు.












Click it and Unblock the Notifications