వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్ ఖాన్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి పతనానికి కారణం ఏమిటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాకిస్తాన్

పాకిస్తాన్‌ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందడంతో ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడయ్యారు. ఇంతకీ ఆయన పతనానికి కారణాలు ఏమిటి?

2018లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయంలో దాదాపు అన్ని పరిణామాలూ ఇమ్రాన్‌కు అనుకూలంగా ఉన్నట్లే కనిపించాయి.

క్రికెట్ ఆడేటప్పుడు హీరోగా మన్ననలు పొందిన ఆయన రాజకీయాల్లోనూ పెద్దయెత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఏళ్లపాటు నిరీక్షణ తర్వాత, దశాబ్దాలపాటు పాకిస్తాన్‌ను పాలించిన రెండు ప్రధాన రాజకీయ పార్టీలను తోసిరాజని ఆయన అధికారం దక్కించుకున్నారు.

ఆకట్టుకునే పాటలు, భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్, అవినీతి వ్యతిరేక సందేశాలతో ఇమ్రాన్ ప్రజల్లోకి వెళ్లారు. దేశంలో మార్పు తీసుకొస్తానని, కొత్త పాకిస్తాన్‌ను మీరు చూస్తారని ఆయన అన్నారు.

పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రధాన మంత్రీ తన ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేదు. ఈ ఘనత సాధించబోయే తొలి ప్రధాని ఇమ్రాన్ అంటూ చాలా విశ్లేషణలు కూడా వచ్చాయి.

అధికారం చేజిక్కించుకోవడానికి ఆయనకు తోడ్పడిన అంశాలను పరిశీలిస్తే, ఆయన పతనం వెనకున్న కారణాలు కూడా మనకు కనిపిస్తాయి. పాకిస్తాన్‌లోని శక్తిమంతమైన సైన్యం, గూఢచర్య సంస్థల మద్దతుతో ఆయన తెరపైకి వచ్చారు. ఇప్పుడు ఇమ్రాన్, సైన్యంల మధ్య విభేదాలున్నట్లు విశ్లేషణలు వచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని అటు ఇమ్రాన్, ఇటు సైన్యం ఆ వార్తలను ఖండించాయి.

పాకిస్తాన్

భారీగా ప్రజల మద్దతుతో..

2018లో ఇమ్రాన్ ఖాన్‌కు భారీగా ప్రజల మద్దతు ఉండేది.

పాకిస్తాన్‌లో ''ద ఎస్టాబ్లిష్‌మెంట్’’గా పిలిచే సైన్యం మద్దతు కూడా ఇమ్రాన్ ఖాన్‌కు ఉండేది. పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని కొన్నిసార్లు ప్రత్యక్షంగా మరికొన్నిసార్లు పరోక్షంగా సైన్యం నడిపిస్తుంటుంది. సైన్యం మద్దతు విషయంలో ఇమ్రాన్ ఖాన్ సర్కారును ''హైబ్రిడ్ ప్రభుత్వం’’గా నిపుణులు అభివర్ణించేవారు.

ఇమ్రాన్‌కు సైన్యం మద్దతు ఎప్పటికప్పుడే బయటపడేది. 2018 ఎన్నికల సమయంలో ఆయన పార్టీలో చేరాలని కొంతమంది నాయకులపై సైన్యం ఒత్తిడి తీసుకొచ్చిందని, ఆయనకు వ్యతిరేకంగా పనిచేసేవారిని జైలు కూడా పంపించారని మీడియాలో వార్తలు వచ్చాయి.

''సైన్యమే ఆయన్ను ముందుకు తీసుకొచ్చింది’’అని ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఓ రాజకీయ నాయకుడు బీబీసీతో చెప్పారు. ''ఆయన అధికారం చేపట్టడానికి సైన్యమే కారణం’’అని ఆయన అన్నారు.

పాకిస్తాన్

నవాజ్ షరీఫ్ కూడా ఇలానే..

ఇమ్రాన్ ఖాన్ ప్రధాన ప్రత్యర్థి నవాజ్ షరీఫ్‌పై మొదట అనర్హత వేటు పడింది. ఆ తర్వాత అవినీతి కేసుల్లో ఆయన్ను దోషిగా తేల్చారు.

గతంలో షరీఫ్ అవినీతికి పాల్పడ్డారని చాలా మంది చెబుతుంటారు. కానీ, ఆయన పతనానికి ప్రధాన కారణం సైన్యంతో వచ్చిన విభేదాలని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.

నవాజ్ షరీఫ్ మొదట సైనిక నియంతల మద్దతుతో ముందుకు వచ్చారు. అయితే, క్రమంగా స్వతంత్రంగా విధాన నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో సైన్యం ఆగ్రహానికి గురయ్యారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదని ఆయన చాలాసార్లు చెప్పారు. కావాలనే తనపై ఆ ఆరోపణలు మోపారని ఆయన అన్నారు.

దీనికి భిన్నంగా ఇమ్రాన్ ఖాన్ మొదట్నుంచీ విధాన పరమైన నిర్ణయాల విషయంలో సైన్యంతో ఎలాంటి విభేదాలు లేవని చెబుతూ వచ్చారు.

చాలా మంది పౌర హక్కుల కార్యకర్తలు ఇమ్రాన్ ప్రభుత్వ చర్యలపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇమ్రాన్ ప్రభుత్వంతోపాటు గూఢచర్య సంస్థలను విమర్శించే జర్నలిస్టులపై దాడులు, అపహరణలు కూడా జరిగాయి. అయితే, ఈ ఆరోపణలను ఇద్దరూ ఖండించారు. కానీ, బాధితులపై దాడులకు వేరే కారణాలేమీ కనిపించలేదు.

పరిపాలనా విధానాలను మెరుగు పరచడంపైనే తను ఎక్కువ దృష్టిపెట్టినట్లు ఇమ్రాన్ చెప్పారు. చాలా ప్రజాప్రయోజన పథకాలను తీసుకొచ్చామని, ఆరోగ్య బీమా పథకాలను కూడా ప్రవేశపెట్టినట్లు వివరించారు.

అయితే, చాలా విషయాల్లో ఆయన వెనుకపడ్డారు. కీలకమైన పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఎలాంటి అనుభవమూలేని ఉస్మాన్ బుజ్దార్‌ను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

విమర్శలు వస్తున్నప్పటికీ పంజాబ్ ముఖ్యమంత్రిని ఇమ్రాన్ ఎందుకు మార్చలేదో చాలా విశ్లేషణలు వచ్చాయి. ''బుజ్దార్‌కు దైవానుగ్రహం ఉందని, ఆయన్ను పదవి నుంచి తొలగిస్తే తన ప్రభుత్వం కుప్పకూలుతుందని ఇమ్రాన్ ఖాన్ భార్య హెచ్చరించారు’’అని ఒక రాజకీయ విశ్లేషకుడు పేర్కొన్నారు. మతానికి సంబంధించిన వ్యవహారాల్లో తనకు మార్గదర్శిగా ఉండే బుష్రాను ఇమ్రాన్ మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పాకిస్తాన్

మరోవైపు పాకిస్తాన్‌లో నిత్యవసర సరకుల ధరలు విపరీతంగా పెరిగాయి. పాకిస్తాన్ రూపాయి మారకం విలువ కూడా పడిపోయింది.

అంతర్జాతీయ పరిణామాలే దీనికి కారణమని ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులు చెప్పేవారు. అయితే, ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత పెరిగింది. ''షరీఫ్ అవినీతి పాల్పడి ఉండొచ్చు.. కానీ, ఆయన ప్రజల గురించి కూడా పట్టించుకున్నారు’’అనే సామాన్యులు భావించేవారు.

అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్‌కు సైన్యం మద్దతు అలానే ఉండేది. ప్రపంచ వేదికలపై కూడా ఇమ్రాన్ బాగా మాట్లాడేవారు. కరోనావైరస్ వ్యాప్తి సమయంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నాయి. అలా చేసినప్పటికీ, ఇక్కడ ఎక్కువ కేసులు, మరణాలు నమోదు కాలేదు. ఇది ఆయనకు కాస్త ఉపశమనం కలిగించే అంశమే.

సైన్యాధిపతిగా జనరల్ భజ్వాను ఎంచుకోవడం, ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ఐ అధిపతిగా జనరల్ ఫైజ్ అహ్మద్‌ను నియమించడంపై ఇమ్రాన్ ఖాన్‌ మీద ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. అయినప్పటికీ ఇమ్రాన్ వాటిని పట్టించుకోనేవారు కాదు.

పాకిస్తాన్

కానీ, గత ఏడాది పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సుపరిపాలన అందించడంలో ఇమ్రాన్ ప్రభుత్వం విఫలం కావడంతో సైన్యంలో అసంతృప్తి పెరిగింది. ముఖ్యంగా కీలకమైన పంజాబ్‌లో పరిమాణాలు మరింత ఇబ్బందికి గురిచేశాయి. ఆయన్ను సైన్యమే ముందుకు తీసుకొచ్చిందని విపక్షాలు కూడా సైన్యంపై విమర్శలు పెంచాయి.

మరోవైపు తర్వాతి సైన్యాధిపతి రేసులో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమిద్, ప్రస్తుత సైన్యాధిపతి భజ్వాల మధ్య విభేదాలు కూడా ఇమ్రాన్ పతనానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

సైన్యాధిపతిగా తన నియామకంపై హమిద్ చాలా నమ్మకంతో ఉండేవారు. పొరుగునున్న అఫ్గానిస్తాన్ సైన్యంలో సీనియర్ అధికారులకు కూడా త్వరలో తను పాక్ సైన్యాధిపతి అవుతానని హమిద్ చెప్పేవారు.

అయితే, రాజకీయ నాయకులను పక్కదోవ పట్టించడం, విమర్శకుల నోరు నొక్కేయడం లాంటి లక్షణాలు హమిద్‌లో మెండుగా ఉండేవని సైనిక వర్గాలు వెల్లడించాయి.

గత వేసవిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో భజ్వా, హమిద్‌ల మధ్య విభేదాలు పక్కాగా కనిపించాయి. ఐఎస్ఐ అధిపతిగా ఉన్న హమిద్‌ను ఆ కార్యక్రమంలో జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగారు. అయితే, ''ఇక్కడ నేను చీఫ్‌ను. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు’’అని ఆ ప్రశ్నకు భజ్వా సమాధానం ఇచ్చారు.

గత అక్టోబరులో ఈ వివాదం ఇమ్రాన్ ఖాన్ దగ్గరకు వెళ్లింది. నిఘా విభాగం అధిపతిగా వేరే వ్యక్తిని నియమించాలని అనుకుంటున్నట్లు ఇమ్రాన్‌కు భజ్వా చెప్పారు.

అయితే, హమిద్‌తో ఇమ్రాన్‌కు మంచి సంబంధాలున్నాయి. దీంతో భజ్వా ప్రతిపాదనను ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించారు. మరోసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు హమిద్ తనకు సాయపడతారని ఇమ్రాన్ భావించారు.

దీంతో సైన్యం, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాల మధ్య కూడా విభేదాలు మొదలయ్యాయి. ఇవి ప్రతిపక్షాలకు అస్త్రంలా మారాయి.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చర్చలు జరుపుతున్నప్పుడు, ఇమ్రాన్ ఖాన్ పార్టీలో సభ్యులపై అనర్హత వేటు పడినప్పుడు.. తాము ఈ వివాదాల్లో తటస్థంగానే ఉంటున్నట్లు సైన్యం స్పష్టంచేసింది.

సైన్యం నుంచి ఫోన్లు

తర్వాత ఏం చేయాలో ఎంపీలకు నిఘా విభాగం నుంచి ఫోన్లు వచ్చేవని ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ఒక ఎంపీ బీబీసీతో చెప్పారు.

''ప్రతి విషయంలోనూ సైన్యం జోక్యం ఉండేది. అయితే, హమిద్‌ను బయటకు పంపేసిన తర్వాత, మాకు ఫోన్లు రావడం ఆగిపోయింది. ఇప్పుడు సైన్యం జోక్యం చేసుకోవడం లేదు’’అని ఆయన వివరించారు.

ప్రతిపక్షాలను సైన్యం ముందుండి నడిపించిందని జర్నలిస్టు కమ్రాన్ యూసఫ్ కూడా బీబీసీతో అన్నారు. ''సైన్యం మద్దతు కోల్పోయిన తర్వాత, ఆయన (ఇమ్రాన్) పతనాన్ని ఎవరూ ఆపలేరు.’’

చాలా విషయాల్లో విభేదాలు

విదేశాంగ విధానంలోనూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి సైన్యం మధ్య విభేదాలు కనిపించాయి. యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైనప్పుడు రష్యా పర్యటనలో ఇమ్రాన్ ఉన్నారు.

రష్యా అధ్యక్షుడి చర్యలను ఖండించాలని పశ్చిమ దేశాల అధికారులు చేస్తున్న డిమాండ్లను ఇమ్రాన్ పట్టించుకోలేదు. అయితే, గత వారం రష్యా తక్షణమే దాడులను ఆపేయాలి అని జనరల్ భజ్వా వ్యాఖ్యానించారు.

భారత్‌తో వాణిజ్యం పునరుద్ధరణకు భజ్వా చేస్తున్న ప్రయత్నాలను కూడా ఇమ్రాన్ పక్కన పెట్టేశారు. ఇదివరకు భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు రాజకీయ నాయకులు మద్దతు పలుకుతుంటే, సైన్యం వ్యతిరేకించేది. కానీ, ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఇది పూర్తి భిన్నంగా మారింది.

తాను చివరివరకు పోరాడతానని ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. అమెరికా నేతృత్వంలో విదేశాలు పన్నిన కుట్ర వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ఆయన ఆరోపించారు. పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఆయన విదేశాంగ విధానంలో తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం అని చెప్పారు.

అయితే, ఈ ఆరోపణలను చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఖండించారు. దేశంలో అమెరికా వ్యతిరేక భావనను పెంచి, తనకు అనుకూలంగా ఓట్లు తెచ్చుకోవడానికి ఇమ్రాన్ చేసిన ప్రయత్నం ఇదని విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Imran Khan: What caused the downfall of the Prime Minister of Pakistan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X