భారత్ ను లాక్ చేసిన డొనాల్డ్ ట్రంప్- సెనెట్ సైతం సై.. !!
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై గతంలో ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు.
తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది. ఆ తర్వాత దీన్ని కుదించినప్పటికీ.. ఆ భయం మాత్రం తొలగిపోవట్లేదు. ఇప్పుడు మరింత తీవ్రతరమైంది. భారత్ సహా రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే అయిదు దేశాలపై మరో విడత టారిఫ్ పెంచబోతోన్నారు. ఇది.. 100 శాతం వరకు ఉండబోతోంది.

రష్యా నుంచి ముడి చమురు, ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేసే భారత్, చైనాతో పాటు ఇతర దేశాలపై భారీగా పన్నులు విధించేలా రూపొందించిన బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. ఆయా దేశాలు పెద్ద ఎత్తున రష్యా నుంచి ముడి చమురు కొంటోండటం వల్లే ఆ దేశం ఆర్థికంగా బలోపేతమౌతోందని, ఆ నిధులతో ఉక్రెయిన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తోందని సెనెట్ అభిప్రాయపడింది. దీన్ని నిలిపివేయాలనే ఉద్దేశంతో బిల్లును ఆమోదించినట్లు తెలిపింది.
ఇటీవల కన్నుమూసిన సెనేటర్ లిండ్సే గ్రాహం గౌరవార్థం దీనికి 'లిండ్సే గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026' అని పేరు పెట్టారు. లిండ్సే గ్రాహం, డెమొక్రాట్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ ఈ బిల్లును రూపొందించారు. దీనికి అనుకూలంగా 86 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు పడ్డాయి. రష్యా నుంచి అత్యధికంగా చమురు, ఇంధనాన్ని దిగుమతి చేసుకునే మొదటి అయిదు దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారాన్ని ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుంది.
ప్రస్తుతం రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల జాబితాలో చైనా, భారత్, అజర్బైజాన్, హంగేరి, స్లోవేకియా మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ రష్యా నుంచి చౌక ధరకే దొరికే ముడి చమురును రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య సెనెట్ ఈ బిల్లును ఆమోదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ బిల్లు చట్టంగా మారితే, రష్యా ఇంధనాన్ని గణనీయంగా కొనుగోలు చేస్తున్న దేశాల దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్ విధించే సంపూర్ణ అధికారం అధ్యక్షుడికి లభిస్తుంది. ట్రంప్ ఒక్క సంతకం చేస్తే.. మొదటి అయిదు దేశాలూ దీని బారిన పడతాయి. ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తక్షణమే టారిఫ్ అమలు కాదు. టారిఫ్ లను పెంచుకోవడానికి అవసరమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను రూపొందించుకునే విషయంలో అడ్డంకులను తొలగించిందీ బిల్లు. ఈ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేయడం ఒక్కటే మిగిలివుంది.





Click it and Unblock the Notifications