పాక్ కొట్టిన దెబ్బ..! చైనా సాయం కోరుతున్న భారత్..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ (India) చేపట్టిన ఆపరేషన్ సింధూర్, తదనంతర పరిణామాల్లో భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేసింది. దీంతో పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సిన భారత విమానాలు చుట్టు తిరిగి వెళ్లాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. అలాగే భారీగా చమురు ఖర్చు కావడంతో పాటు విమాన ప్రయాణ ఖర్చులూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ గత ఏడాది కాలంగా ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా చైనాలోని హోటాన్ మీదుగా విమానాలు నడిపేందుకు అనుమతివ్వాలని డ్రాగన్ ను కోరుతోంది.
అయితే ఇన్నాళ్లూ ఈ ప్రతిపాదనపై చైనా స్పందించడం లేదు. కానీ తాజాగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ భారత్ లో పర్యటించడం, ప్రధాని మోడీతో భేటీ కావడం జరిగాయి.ఈ నేపథ్యంలో మరోసారి చైనా మీదుగా భారత విమానాలు ఎగురనిచ్చే విషయంలో చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ గగనతల నిషేధం నేపథ్యంలో.. భారత విమానయాన సంస్థలకు ప్రత్యామ్నాయ మార్గంగా జిన్జియాంగ్ గగనతలాన్ని ఇచ్చేందుకు భారత్.. చైనాతో చర్చలు జరుపుతోందని ఎన్డీటీవీకి అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

షీ జిన్పింగ్ ఢిల్లీ పర్యటనకు ముందు, చైనా సదరన్ ఎయిర్లైన్స్, ఆరు సంవత్సరాలుగా నిలిపివేసిన మార్గాన్ని పునరుద్ధరిస్తూ.. సెప్టెంబర్ 21 నుండి గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి, తదనంతరం భారత్-చైనా సరిహద్దు వెంబడి నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిన తర్వాత, ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నంలో ఈ పునఃప్రారంభం ఒక భాగం. భారత్-చైనా బంధం పునఃప్రారంభించిన తొలి భారతీయ విమానయాన సంస్థ ఇండిగో. గత అక్టోబర్ లో కోల్కతా-గ్వాంగ్జౌ మధ్య ఇండిగో సర్వీసులను పునఃప్రారంభించింది. తర్వాత నవంబర్లో ఢిల్లీ-గ్వాంగ్జౌ మధ్య కూడా భారత్-చైనా ప్రత్యక్ష విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 1న ఢిల్లీ-షాంఘై సర్వీసులను పునఃప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనా మీదుగా ఇతర దేశాలకు వెళ్లేందుకు భారత్ అనుమతులు కోరుతోంది.















Click it and Unblock the Notifications
