1945 నాటి కంప్యూటర్ లో AI వాడతారా? ఐరాస తీరుపై భారత్ సెటైర్లు!
అంతర్జాతీయ అత్యున్నత వేదిక ఐక్యరాజ్యసమితి (UN) సాక్షిగా భారతదేశం పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగింది. సరిహద్దుల గుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. భారతదేశాన్ని 'వెయ్యి గాయాలతో రక్తమోడిస్తామనే’ (Bleed India with a thousand cuts) కుటిల నీతిని అవలంబిస్తున్న ఇస్లామాబాద్‌కు గట్టి గుణపాఠం తప్పదని తేల్చిచెప్పింది. ఐరాస భద్రతా మండలి (UNSC) వేదికగా బుధవారం జరిగిన ఓపెన్ డిబేట్‌లో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ పాక్ ఉగ్రవాద మూలాలను నడిబజార్లో ఎండగట్టారు. పాక్ దురాక్రమణలను తిప్పికొట్టే సంపూర్ణ హక్కు భారత్‌కు ఉందని ప్రపంచ దేశాల ముందు సింహగర్జన చేశారు. అదే సమయంలో, కాలం చెల్లిన ఐరాస భద్రతా మండలి తీరును ఎండగడుతూ '1945 నాటి కంప్యూటర్‌లో ఆధునిక ఏఐ (AI) టెక్నాలజీని వాడటం’ లాంటిదంటూ హరీష్ వేసిన సెటైర్లు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి.
భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధి చేసిన నిరాధార, అవాస్తవ వ్యాఖ్యలను భారత రాయబారి పర్వతనేని హరీష్ ముక్కలు ముక్కలుగా తిప్పికొట్టారు. పాకిస్తాన్ పుట్టుకతోనే ఉగ్రవాదం, మత ఛాందసవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని డీఎన్‌ఏగా మార్చుకుందని ఆయన మండిపడ్డారు.

"సరిహద్దుల గుండా భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్.. ఇకపై ఆ తీవ్ర పరిణామాలను అనుభవించక తప్పదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ఐరాస చార్టర్ గురించి మాట్లాడటం ఇస్లామాబాద్ డొల్ల నిబద్ధతకు నిదర్శనం. పాక్ ఎన్ని యుద్ధాలకు తెగబడినా, ఎంతగా రెచ్చగొట్టినా భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీయలేదు. ఇటువంటి దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి, శత్రువును హతమార్చడానికి భారత్‌కు సంపూర్ణ సార్వభౌమ హక్కు ఉంది" అని హరీష్ హెచ్చరించారు.
కాశ్మీర్ జోలికొస్తే ఖబడ్డార్.. చైనా-పాక్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్!
మరోవైపు, చైనా-పాకిస్తాన్ సంయుక్త ప్రకటనలో జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన తీసుకురావడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) దిల్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ డ్రాగన్, పాక్‌లకు మైండ్ బ్లాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చారు.
జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమైన, విడదీయరాని భాగాలుగా ఉన్నాయి.. ఉంటాయి.. ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఈ విషయంలో మూడో దేశం జోక్యం చేసుకోవడానికి గానీ, వ్యాఖ్యానించే హక్కు గానీ ఎవరికీ లేదు. భారతదేశ సార్వభౌమ భూభాగాల గుండా వెళ్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టుల ద్వారా పాక్ అక్రమ ఆక్రమణను చట్టబద్ధం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. దీనిని భారత్ దృఢంగా వ్యతిరేకిస్తుందని జైస్వాల్ స్పష్టం చేశారు.
1945 నాటి కంప్యూటర్‌లో 'AI’ వాడతారా?.. ఐరాసపై హరీష్ పంచ్‌లు!
ఐరాస భద్రతా మండలి సంస్కరణలపై రాయబారి పర్వతనేని హరీష్ చేసిన విశ్లేషణ పశ్చిమ దేశాలను ఆలోచనలో పడేసింది. సమకాలీన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో 1940ల నాటి ఐరాస నిర్మాణం పూర్తిగా ఫెయిల్ అయిందని ఆయన ఎత్తిచూపారు.
"ప్రస్తుత ఐరాస భద్రతా మండలి తీరు ఎలా ఉందంటే.. 1945 కాలం నాటి పాత కంప్యూటర్‌లో అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాఫ్ట్‌వేర్‌ను రన్ చేయాలని చూస్తున్నట్లు ఉంది. 20వ శతాబ్దపు నాటి పాత అధికార నిర్మాణంతో 21వ శతాబ్దపు సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం అసాధ్యం" అని హరీష్ చమత్కరించారు.
భద్రతా మండలిని కేవలం ఒక 'శిలాజం’ (Fossil) లాగా ఉంచకూడదని, అది సజీవ సాధనంగా మారాలంటే భౌగోళిక-రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా శాశ్వత సభ్యుల సంఖ్యను విస్తరించాలని, భారత్‌కు తగిన స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ వేదికలపై 'ద్వంద్వ ప్రమాణాలు’ నశించాలి!
ప్రపంచ సంస్థల్లో నెలకొన్న "ద్వంద్వ ప్రమాణాలను" (Double Standards) భారతదేశం తీవ్రంగా తప్పుపట్టింది. అంతర్జాతీయ సంస్థలు మాటలకు, చేతలకు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నాయని, కేవలం క్రూరమైన శక్తి, అధికారం మాత్రమే ప్రపంచ ప్రజా శ్రేయస్సును అందించలేవని భారత్ తేల్చి చెప్పింది. నిజమైన బహుళపాక్షికత సాధించాలంటే పెద్ద దేశాలు తమ స్వార్థ అధికార రాజకీయాలను పక్కనబెట్టి, సహకార స్ఫూర్తితో, సామూహిక శ్రేయస్సు కోసం రాజీ పడే గుణాన్ని అలవర్చుకోవాలని భారత రాయబారి పర్వతనేని హరీష్ హితవు పలికారు.














Click it and Unblock the Notifications