అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్-142.86 కోట్లతో చైనా రికార్డు బద్దలు
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇన్నాళ్లుగా చైనా కాపాడుకుంటూ వస్తున్న రికార్డు ఇవాళ బద్దలైంది. 142.86 కోట్ల జనాభాకు చేరుకున్న భారత్.. చైనా రికార్డును బద్దలు కొట్టింది. తద్వారా ఈ భూమి మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లుగా ఉంది. దీన్ని భారత్ అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి అధికారికంగా కీలక ప్రకటన చేసింది.

1950 ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభాను గణించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్ అగ్రస్ధానంలో నిలవలేదు. కానీ తాజాగా 142.86 కోట్ల జనాభాను చేరుకోవడం ద్వారా భారత్ ఈ లిస్టులో అగ్రస్ధానం సాధించింది. అదే సమయంలో 1960 తర్వాత చైనా జనాభాలో భారీగా పతనం చోటు చేసుకోవడం కూడా భారత్ కు కలిసి వచ్చింది. చైనా మాజీ అధినేత మావో జెడాంగ్ వినాశకర వ్యవసాయ విధానాల కారణంగా ఆ దేశ జనాభాలో తొలిసారిగా భారీగా తగ్గుదల నమోదైంది.
మరోవైపు చైనాలో జననాల రేటు పడిపోవడం, దాని శ్రామిక శక్తి వయస్సు తగ్గిపోవడం కూడా జనాభా క్షీణతకు కారణమైందని చెబుతున్నారు. దీంతో చైనాలో అనేక ప్రాంతాలు జననాల రేటును పెంచే ప్రణాళికలను కూడా ప్రకటించాయి. కానీ ఈ ప్రయత్నాలతో జనాభా పెరుగుదల మాత్రం చేయలేకపోయారు. మరోవైపు భారత్ లో 2011 నుంచి జనాభా లెక్కలు గణించకపోవడంతో మన జనాభా ఎంత అనేది అధికారికంగా లెక్కించలేదు. వాస్తవానికి పదేళ్ల కోసారి చేసే జనగణనకు ఈసారి కరోనా కారణంగా అవాంతరాలు ఎదురయ్యాయి. కరోనా తగ్గినా ఇంకా జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కాలేదు.
ఈ ఏడాది మధ్యలో దాదాపు 3 మిలియన్ల మందితో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన డేటా వెల్లడించింది. దీంతో భారత్ ఇకపై ప్రపంచంలో బలమైన శక్తితో పాటు జనాభాలోనూ టాప్ లో నిలిచినట్లయింది.












Click it and Unblock the Notifications