ట్రంప్ -పుతిన్ చర్చలపై భారత్ రియాక్షన్ ఇదే..! మోడీ పాత కామెంట్స్ గుర్తుచేస్తూ..!
ఓవైపు రష్యా చమురు కొంటున్నామన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 50 శాతం అదనపు సుంకాల మోత మోగించారు. మరోవైపు అమెరికా-రష్యా అధినేతలు ట్రంప్, పుతిన్ చర్చలకు సిద్దమవుతున్నారు. దీంతో ఈ డబుల్ గేమ్ పై భారత్ ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో విదేశాంగశాఖ ఇవాళ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాధినేతల చర్చలపై చేసిన ప్రకటనలో గతంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని సైతం గుర్తుచేసింది.
రష్యా-ఉక్రెయిన్ వార్ కు ముగింపు పలికేందుకు ఆగస్టు 15న అలస్కాలో వ్లాదిమీర్ పుతిన్ తో భేటీ కానున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ చర్చల్ని ఆహ్వానిస్తున్నట్లు భారత విదేశాంగశాఖ ఇవాళ ప్రకటించింది. అలాస్కాలో సమావేశం కోసం అమెరికా , రష్యా మధ్య కుదిరిన అవగాహనను భారతదేశం స్వాగతిస్తోందని తెలిపింది. ఈ సమావేశం ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణను ముగించి శాంతి అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా ఇది యుద్ధాల యుగం కాదని విదేశాంగశాఖ గుర్తుచేసింది.

Statement by Official Spokesperson⬇️
— Randhir Jaiswal (@MEAIndia) August 9, 2025
🔗 https://t.co/22vVtFYFOh pic.twitter.com/zWvhRSRlhp
పుతిన్ 2015 తర్వాత అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆయన అమెరికాలో కలిశారు. ఆ తర్వాత ఇప్పుడు ట్రంప్ తో భేటీ కాబోతున్నారు. ఓవైపు రష్యా చమురు అమ్మకాలపై ట్రంప్ ఆంక్షల కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్దం ముగిస్తే వాటి నుంచి ఊరట లభించే అవకాశం ఉండటంతో పుతిన్ ఈ చర్చలకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ట్రంప్-పుతిన్ చర్చలు సఫలమైతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగడంతో పాటు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో భారత్ పై ట్రంప్ విధించిన సుంకాల నుంచి ఊరట లభించే అవకాశాలు మెరుగుపడతాయి. అందుకే భారత్ ఇప్పుడు ఈ చర్చల్ని స్వాగతిస్తోంది. అలాగే ఈ చర్చలు సఫలమైతే భారత్ తో పాటు రష్యా చమురు కొంటున్న చైనా, బ్రెజిల్ వంటి దేశాలకు సైతం ఊరట లభించే అవకాశముంది. దీంతో రెండు అగ్రరాజ్యాధినేతల చర్చల కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.












Click it and Unblock the Notifications