• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్‌: యాభైఏళ్ల కిందటే అత్యాధునిక జీవితాన్ని చూసిన మహిళల జీవితాలు తర్వాత ఎలా మారిపోయాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
1970లలో ఇరాన్‌లోని విద్యార్థులు

"ఇస్లామిక్ విప్లవానికి ముందు మా ఇంట్లో ఉన్న పాత ఫొటోలు చూశాను. మా అమ్మమ్మ ఇస్లామిక్ పద్ధతిలో తలకు ముసుగు వేసుకుని ఉన్నారు. మా అమ్మ మినిస్కర్టు వేసుకుని ఉన్నారు. ఇద్దరూ ఎవరి పద్ధతుల్లో వారు దుస్తులు ధరించి, ఏ గొడవా లేకుండా సామరస్యంగా కలిసి జీవించారు."

బీబీసీ పర్షియన్ సర్వీస్ నుంచి ఇరానియన్-బ్రిటిష్ ప్రెజెంటర్ రానా రహింపూర్ చెప్పిన మాటలవి. ఇది కేవం రానా అనుభవం మాత్రమే కాదు.

ఇరాన్‌లో 1979లో ఇస్లామిక్ విప్లవం రాక మునుపు కఠినమైన డ్రెస్ కోడ్ ఏమీ ఉండేది కాదు. ప్రస్తుతం అక్కడ మహిళలకు ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను చట్టబద్ధం చేశారు. ఆడవాళ్లు నిరాడంబరంగా ఉండే దుస్తులే ధరించాలి. జుట్టు కనిపించకూడదు, పొడవైన వస్త్రాలు ధరించాలి.

"ఒకప్పుడు ఇరాన్ ఉదారవాద దేశంగా ఉండేది. మహిళలు ఇష్టానుసారం దుస్తులు ధరించేవారు" అని చెప్పారు రానా రహింపూర్.

ఇరాన్‌లో తాజా హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనల నేపథ్యంలో రానా తన అనుభవాలను పంచుకున్నారు. ఇరాన్ మొరాలిటీ పోలీసుల చేతిలో 22 ఏళ్ల మహసా అమీనీ మరణం ఆ దేశంలో ఆగ్రహ జ్వాలలు రగిలించింది. పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.

హిజాబ్ సరిగ్గా ధరించలేదని, జుట్టు కనిపిస్తోందని మహసా అమీనీని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయారు. వెంటనే కోమాలోకి వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత సెప్టెంబర్ 16న ఆమె ఆస్పత్రిలో మరణించారు.

ఇరాన్‌లో మహిళలు ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను తప్పనిసరిగా పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు మొరాలిటీ పోలీసు అనే విభాగం ఉంది.

రానా ఇస్లామిక్ విప్లవం వచ్చిన తరువాత పుట్టారు. కానీ, తన తల్లిదండ్రులు, సన్నిహితుల అనుభవాలు, జర్నలిస్ట్‌గా ఆమె ఆసక్తులు ఇరాన్‌లో విప్లవానంతర మార్పులపై, ముఖ్యంగా మొహమ్మద్ రెజా పెహ్లావి (రెజా షా) పతనం తరువాత వచ్చిన సాంఘిక పరివర్తనపై దృష్టి సారించేందుకు పురికొల్పాయి.

ఇస్లామిక్ విప్లవం ప్రారంభ రోజుల్లో, అది దుస్తులకు మించిన పరివర్తన అని బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో విమెన్స్ అఫైర్స్ రిపోర్టర్, ఇరానియన్ జర్నలిస్ట్ ఫెరానక్ అమీదీ పేర్కొన్నారు.

"ఇస్లామిక్ విప్లవానికి ముందు మాకు లింగ విభజన లేదు. 1979 తరువాత పాఠశాలల్లో జెండర్ పరమైన విభజన వచ్చింది. ఏ సంబంధం లేని ఇద్దరు ఆడ, మగ కలిసి తిరిగితే అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. నేను టీనేజీలో ఉన్నప్పుడు, స్నేహితులతో కలిసి పిజ్జా రెస్టారెంటుకు వెళ్లానని నన్ను మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1979కి ముందు ఇరాన్‌లో నైట్‌క్లబ్స్ ఉండేవి. వినోద కార్యక్రమాలు ప్రదర్శించేవారు. జనం నచ్చినట్టు తిరిగేవారు" అని ఫెరానక్ అమీదీ వివరించారు.

విప్లవానికి ముందు వచ్చిన ఇరానియన్ సినిమాలు కూడా మహిళలు దుస్తుల విషయంలో స్వేచ్ఛగా ఉండేవారని చెప్పడానికి నిదర్శనం.

"రకరకాల దుస్తులు ధరించేవారు. కొంతమంది నల్లటి ముసుగు ధరించేవారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న డ్రెస్‌కోడ్‌లా కాదు" అని చెప్పారు ఫెరానక్ అమీదీ.

1970లలో రెజా షా పుట్టినరోజు వేడుకకు హాజరైన జనం

పహ్లావి పాలన

1979కి ముందు ఇరాన్‌లో పహ్లావి రాజవంశం అధికారంలో ఉండేది. 1926లో రెజా ఖాన్ తిరుగుబాటు చేసి ఇరాన్ సింహాసనాన్ని ఆక్రమించుకున్నారు. రెజా షా పహ్లావి (రెజా ఖాన్) రాజయ్యారు. అప్పటి నుంచి పహ్లావి పాలన ప్రారంభమైంది. ఆయన తరువాత ఆయన కుమారుడు మొహమ్మద్ రెజా పహ్లావి సింహాసనాన్ని అధిష్టించారు. ఇరాన్‌ను పాలించిన చివరి షా ఆయనే.

ఇరాన్ రచయిత హలే ఎస్ఫందియారీ తన పుస్తకం 'రికన్స్ట్రక్టెడ్ లైవ్స్: విమెన్ అండ్ ఇరాన్స్ ఇస్లామిక్ రివల్యూషన్ 'లో విప్లవానంతర పరిస్థితుల గురించి విపులంగా రాశారు.

ఎస్ఫందియారీ 1978లో ఇరాన్ విడిచిపెట్టారు. తరువాత 14 సంవత్సరాలకు మళ్లీ స్వదేశం వచ్చి ఇరాన్ మహిళలపై ఇస్లామిక్ విప్లవం ప్రభావాన్ని విశ్లేషించారు.

"ఇరాన్‌లో మహిళల ఉద్యమం 19వ శతాబ్దం చివరిలో ప్రారంభమైంది. రాజ్యాంగ విప్లవం సమయంలో మహిళలు వీధుల్లోకి వచ్చారు" అని ఎస్ఫందియారీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆ తరువాత చాలామంది మహిళలు.. బాలికల కోసం పాఠశాలలు తెరవడం, మహిళా పత్రికలు ప్రచురించడం వంటి సామాజిక కార్యక్రమాలను చేపట్టారు.

ఇది ఇరాన్ రాజధాని టెహ్రన్‌లో ప్రారంభమైంది. కానీ, ఇతర నగరాలను కూడా విస్తరించింది. దాంతో, "మహిళా ఉద్యమం ప్రగతిపథంలో సాగింది."

19770లలో షా పుట్టినరోజు వేడుక సందర్భంగా జరిగిన ఒక కవాతు

ఇస్లామిక్ పద్ధతిలో తలకు ముసుగు

20వ శతాబ్దం ప్రారంభంలోనే మహిళల వస్త్రధారణ ప్రభుత్వ అజెండాలోకి వచ్చేసింది.

"ఆధునిక ఇరాన్ పితామహుడు రెజా షా పహ్లావి కాలంలో 1936 వరకు ఇరాన్‌లో తలకు ముసుగును అధికారికంగా రద్దు చేయలేదు" అని ఎస్ఫందియారీ పేర్కొన్నారు.

ప్రారంభంలో ఆయన, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ముసుగు ధరించవద్దని చెబుతూ, ఆ దిశలో ప్రోత్సహించారు. లేదా "పొడవైన దుస్తులకు బదులు కేవలం తలకు ముసుగు ధరించమని" ప్రోత్సహించారు.

"ఇస్లామిక్ పద్ధతిలో తలకు ముసుగు ధరించడాన్ని అధికారికంగా రద్దు చేసినప్పుడు, కచ్చితంగా అది మహిళలకు విజయం. మరొకవైపు అదొక విషాదం కూడా. ఎందుకంటే మహిళలకు ఛాయిస్ లేకుండా పోయింది. 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ సమయంలో తరువాత మళ్లీ తలకు ముసుగును అధికారికంగా ప్రవేశపెట్టారు" అని ఎస్ఫందియారీ వివరించారు.

అయితే, ముసుగును అధికారికంగా రద్దు చేసినప్పుడు చాలామంది మహిళలు తలకి గుడ్డ కప్పుకోకుండా వీధుల్లోకి వెళ్లడానికి సిగ్గుపడ్డారని, అవమానపడ్డారని ఆయన చెప్పారు.

అయినప్పటికీ, ఇరాన్ చివరి పాలకుడు షా తీసుకొచ్చిన సంస్కరణలు ఇరాన్ మహిళల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని ఎస్ఫందియారీ అంటారు.

1964లో జూలై 23న టెహ్రాన్‌లో ఓ వీధి

శ్వేత విప్లవం

1941లో రెజా షా కుమారుడు మొహమ్మద్ రెజా అధికారంలోకి వచ్చారు. ఆయన పాలనలో "ఇరాన్ ఆధునికీకరణ ప్రారంభమైంది" అని ఫెరానక్ అమీదీ వివరించారు.

దీన్నే "శ్వేత విప్లవం" (వైట్ రివల్యూషన్) అంటారు. ఇది 1963లో మహిళలకు ఓటు హక్కు, పురుషులతో సమానమైన రాజకీయ హక్కులను ఇచ్చింది.

అలాగే, మారుమూల ప్రాంతల్లో విద్యావకాశాలను పెంపొందించే ప్రయత్నాలు జరిగాయి.

మొహమ్మద్ రెజా పాలనలో కుటుంబ రక్షణ చట్టం అమలులోకి వచ్చింది. వివాహం, విడాకులు సహా కుటుంబానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

"ఆ చట్టం మహిళ హక్కులను విస్తరించింది. బాలికల కనీస వివాహ వయసును 13 నుంచి 18కి పెంచేందుకు దోహదపడింది. విడాకులు తీసుకోవడానికి మహిళలకు మరింత స్వేచ్ఛ కల్పించింది. అలాగే, ఒక పురుషుడికి ఒక భార్య అనే విధానాన్ని తీసుకువచ్చారు. చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే ఇరాన్ చాలా ముందుకెళ్లింది" అని అమీదీ వివరించారు.

మొహమ్మద్ రెజా నియంతృత్వాన్నే అవలంబించినా, ప్రగతిశీల దృక్పథం ఉన్న నాయకుడు. పశ్చిమ సంస్కృతిని ఆహ్వానించారు. లౌకికవాదానికి పెద్దపీట వేశారు.

1978 ఆగస్టు 26న టెహ్రాన్ వీధిలో బట్టలు కొంటున్న మహిళలు

రోజువారీ జీవితం

మహిళలు అధికారంలోకి వచ్చారు.

దేశంలో "మహిళా మంత్రులు, జడ్జిలు ఉండేవారు" అని రానా రహింపూర్ చెప్పారు.

శ్వేత విప్లవం దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లినప్పటికీ "మహిళలు సంప్రదాయాలకే పరిమితమయ్యారు" అని అమీదీ అన్నారు.

"పార్లమెంట్‌లో మహిళలు ఉండేవారు కానీ, సామాన్య మహిళలు రాజకీయాల్లో పాలుపంచుకున్నది తక్కువ. అయితే, ఇది అర్థ శతాబ్దం క్రితం మాట. అప్పటికి ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా రాజకీయాధికారం ఉన్న మహిళలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉండేవారు" అని ఆమె అన్నారు.

అయినప్పటికీ, పబ్లిక్ లైఫ్‌లో మహిళలు తమ ఉనికిని పెంచుకుంటూ వచ్చారని అమీదీ అన్నారు.

ప్రముఖ ఆర్టిస్ట్ నహిద్ హగిగాట్

మహిళా సమస్యలు

ఇరాన్ కళలు, సంస్కృతిపై మొహమ్మద రెజా భార్య రాణి ఫరా పహ్లావి ప్రభావం చాలా ఉందని అమీదీ అంటారు.

నిజానికి, 1950లలో ఇరాన్‌లో కళలు అభివృద్ధి చెందాయి. 1960లు, 70లలో కూడా ఈ అభివృద్ధి కొనసాగిందని న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఇస్లామిక్ ఆర్ట్ విభాగానికి చెందిన మరియం ఎఖ్తియార్, జూలియా రూనీ అంటారు. ఈ అంశంపై వారొక వ్యాసాన్ని కూడా రాశారు.

"ఈ దశాబ్దాలలో ఇరాన్ అంతర్జాతీయ కళలకు తలుపులు తెరిచింది" అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

ఆ కాలంలో ఇరాన్ ఆర్థికాభివృద్ధి చాలావరకు కళల వికాసానికి దోహపడింది.

మరోవైపు, ఇరాన్‌లో చమురు వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ, సాధారణ ప్రజానీకానికి ఆ ఫలాలు అందలేదు. మొహమ్మద్ రెజా షా, ఆయన భార్య కళల అభివృద్ధికి దోహదపడినా, కళాకారులకు ఈ వాస్తవం తెలుసు. అలాగే, పాలనకు ఎదురెళ్లిన వారిని అణచివేసే మార్గాన్ని వారు విస్మరించలేదు.

"ఇస్లామిక్ విప్లవానికి ముందు మహిళల సమస్యల గురించి మాట్లాడినవారిలో ప్రముఖ ఆర్టిస్ట్ నహిద్ హగిగాట్ ఒకరు" అని మరియం ఎఖ్తియార్, జూలియా రూనీ వివరించారు.

"నిరంతరం ప్రభుత్వ పరిశీలనలో ఉండే, పురుషాధిక్య సమాజంలో మహిళల భయాలు, ఆందోళనలను ఆమె తన ఫొటోల ద్వారా బయటపెట్టారు."

టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌లో డిన్నర్.. రెజా షా, అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్, క్వీన్ ఫరా, నిక్సన్ భార్య పాట్ (ఎడమ నుంచి కుడికి)

ఇస్లామిక్ విప్లవానికి మద్దతు

1971లో మొహమ్మద్ రెజా తనను తాను "షెహన్‌షా"గా ప్రకటించుకున్నారు. అంటే రాజులకు రాజు, చక్రవర్తి అని అర్థం. ఆ సమయంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో మొహమ్మద్ రెజా ఒకరు. ఇరాన్ అధికారంపై సర్వహక్కులున్న నాయకుడు కూడా.

ఆయన పాలనలో రాజకీయ అసమ్మతి తెలిపినవారిని అణగదొక్కేవారని రానా రహింపూర్ అన్నారు.

"ఇస్లామిక్ విప్లవానికి ముందు ప్రజలకు సాంఘిక స్వేచ్ఛ ఉండేది కానీ, రాజకీయ స్వేచ్ఛ ఉండేది కాదు. అది చాలా పెద్ద సమస్య. అన్ని రాజకీయ పార్టీలు రాజు నియంత్రణ, పర్యవేక్షణలోనే ఉండేవి. పత్రికా స్వేచ్ఛ ఉండేది కాదు. రాజకీయ ఉద్యమాలు ఏవైనా జైలుకు చేరాల్సిందే" అని ఆమె వివరించారు.

ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. 1978లో రెజా షా పాలకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు.

రెజా షా పాలనలో మహిళలు సాధించిన పురోగతి చివరినాళ్లల్లో క్షీణించిందని ఎస్ఫందియారీ అన్నారు.

"సమాజంలో సంప్రదాయ ఆలోచనలకు మద్దతు పెరగడం ప్రారంభమైంది. దాంతో, షా నిర్ణయాధికారాల్లో మహిళల పాత్రను చాలావరకు తగ్గించేశారు."

ఇస్లామిక్ విప్లవానికి అంతగా మతవిశ్వాసాలు లేనివారు కూడా మద్దతు ఇచ్చారు. చాలామంది నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారని రహింపూర్ చెప్పారు.

"అన్ని వర్గాల వారు ఇస్లామిక్ విప్లవానికి మద్దతునిచ్చారు. ఉదారవాదులు, కమ్యూనిస్టులు, మతవిశ్వాసాలు ఉన్నవారు అందరూ తోడ్పడ్డారు."

మహిళలు కూడా ఇందుకు చేయూతనిచ్చారు. దాంతో, 1979లో రెజా షా పాలన పతనమైంది.

"ఇస్లామిక్ విప్లవం కోసం జరిపిన పోరాటంలో కొంతమంది మహిళలు తలకు ముసుగులు ధరించకుండానే పాల్గొన్నారు. మరికొంతమంది సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. దిగువ, మధ్య తరగతి మహిళలు, పిల్లలు పాలుపంచుకున్నారు. ఈ మహిళలంతా భుజం భుజం కలిపి నడిచారు. ఈ విప్లవం తమ జీవితాలలో ఆర్థిక, సామాజిక ప్రగతిని తీసుకొస్తుందని ఆశించారు. ముఖ్యంగా చట్టాల్లో మార్పులు వస్తుందని భావించారు" అని ఎస్ఫందియారీ వివరించారు.

విభిన్న వాదనలు

ఇస్లామిక్ విప్లవానికి ముందు మహిళలు ఎక్కువ స్వేచ్ఛగా ఉన్నారన్న వాదనతో అమీదీ ఏకీభవించట్లేదు.

"రెజా షా పాలనలో కూడా ఇరాన్ సంప్రదాయవాద, మతాచారాలతో కూడిన సమాజమే. అయితే, సంప్రదాయ ధోరణి నుంచి బయటపడేందుకు రాజకీయంగా ప్రయత్నాలు జరిగాయి. మహిళల వికాసానికి, సమాజంలో వారి స్థానం మెరుగుపడడానికి అవకాశం లభించింది. అయితే, ఇది పూర్తి మార్పు కాదు" అని అమీదీ అన్నారు.

మహిళలకు అప్పుడు ఎక్కువ స్వేచ్ఛ ఉందా, విప్లవం తరువాత స్వేచ్ఛ పెరిగిందా అన్నది చర్చనీయాంశమని రానా రహింపూర్ అభిప్రాయపడ్డారు.

"సంప్రదాయ మహిళలు ఇస్లామిక్ విప్లవం తరువాత వీధుల్లోకి వెళ్లడానికి ఎక్కువ సౌకర్యవంతంగా భావించారు. ఉదారవాద మహిళలు దానికి వ్యతిరేకం. ఇరాన్ సమాజంలో ఒక భాగం సంప్రదాయ ధోరణులతో నిండినదని మనం మర్చిపోకూడదు" అంటారామె.

పాత ఫొటోల్లో స్కర్టులు వేసుకున్న మహిళలు కనిపించవచ్చుగాక, కానీ అది సాధారణ ఇరాన్ మహిళల జీవితాన్ని ప్రతిబింబించదు అని ఒక ఇరాన్ మహిళ అన్నారు.

"కొంతమంది మహిళలు పాశ్చాత్య దుస్తులు ధరించినప్పటికీ చాలామంది మహిళలు సంప్రదాయ దుస్తులకే పరిమితమయ్యారు. బహుశా అప్పటి సమాజం ఇప్పటికన్నా సంప్రదాయబద్ధమైనది, మతవిశ్వాసాలతో నిండినది కావచ్చు" అన్నారామె.

సెప్టెంబర్ 23న ఇరాన్‌లో జరిగిన ప్రభుత్వ అనుకూల ప్రదర్శన

నిరసనలు

స్వేచ్ఛ కోసం కలలు కన్నవారంతా ఇస్లామిక్ విప్లవానికి మద్దతునిచ్చారు. కానీ, వారి ఆశలన్నీ చాలా త్వరగా అడియాశలైపోయాయని రానా రహింపూర్ అన్నారు.

"విప్లవం తరువాత మాకు అర్థమైన విషయం ఏమిటంటే, మతవిశ్వాసాలు మెండుగా ఉన్న చాలామందికి మహిళలు పొట్టి దుస్తులు ధరించడం, పురుషులకు, మహిళలకు స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉండడం రుచించలేదు. అందుకే వాళ్లు కూడా విప్లవానికి మద్దతునిచ్చారు" అని ఆమె అన్నారు.

అయితే, ఇరాన్‌లో "లోతైన మతవిశ్వాసాలు" ఉన్నవారు తలపై ముసుగు ఛాయిస్‌గా ఉండాలనే భావిస్తారని అన్నారామె.

ప్రస్తుతం మహసా అమీనీ మరణంతో ఇరాన్ అట్టుడికిపోతోంది.

అమీనీ అనారోగ్య కారణాల వలన చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. కానీ, అధికారుల వాదనలు అబద్ధమని ఆమె కుటుంబం అంటోంది. పోలీసులు కొట్టడం వలనే ఆమె చనిపోయారని ఇరాన్ ప్రజలు విశ్వసిస్తున్నారు.

ఇరాన్‌లో ఇటీవల కాలంలో ఇంత తీవ్ర స్థాయిలో ఆందోళనలు వచ్చిన దాఖలాలు లేవు.

ఇరాన్ ప్రజా నిరసనలో ఇది కొత్త అధ్యాయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Iran: How have women's lives changed after seeing a sophisticated life less than fifty years ago?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X