ఇరాన్-ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒట్టిదే ..! భీకర దాడులు, ప్రతిదాడులు..!
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి చరమగీతం పాడుతూ ఇవాళ ఇరుదేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ వేర్వేరుగా కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించాయి. ఇజ్రాయెల్ అయితే ఇరాన్ యుద్ధంలో తమ లక్ష్యం నెరవేరిందని కూడా ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులు ఆపితే తామూ కాల్పుల విరమణ అమలు చేస్తామని ఇరాన్ ప్రకటించింది.
దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ ఒకేసారి కాల్పుల విరమణకు అంగీకరించి అమలు చేస్తున్నట్లు ప్రపంచమంతా భావించింది. అయితే అదంతా నిజం కాదని తేలిపోవడానికి కొన్ని గంటలు కూడా పట్టలేదు. కాల్పుల విరమణతో సంబంధం లేదన్నట్లుగా ఇరు దేశాలూ దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన సమయంలో ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్న ఇరాన్ ఇప్పటికీ వాటిని కొనసాగిస్తోంది. ఇరాన్ దాడుల్లో తమ పౌరులు చనిపోతున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది.

ఇది జరిగిన కాసేపటికే కాల్పుల విరమణ ఉల్లంఘించి దాడులకు దిగుతున్న ఇరాన్ పై ప్రతిదాడులు ముమ్మరం చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తమ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు తాము కాల్పుల విరమణకు అంగీకరించినా ఇజ్రాయెల్ ను నమ్మబోమని ఇరాన్ కూడా ప్రకటించింది. తాము కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఇరాన్ తెలిపింది. అమెరికా-ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణను తాము ఉల్లంఘించలేదని వెల్లడించింది. దీంతో పైకి కాల్పుల విరమణ ప్రకటన జరిగినా క్షేత్రస్దాయిలో పరిస్ధితులు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఖతార్ తమ దేశంలోని అమెరికా ఎయిర్ బేస్ అల్ ఉదైద్ పై ఇరాన్ జరిపిన దాడిపై ఆ దేశ రాయబారికి సమన్లు పంపింది.












Click it and Unblock the Notifications