Operation Sindhu: భారత్ కోసం ఇరాన్ అసాధారణ నిర్ణయం..! ఇజ్రాయెల్ తో యుద్ధం వేళ..!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం పతాక స్థాయికి చేరుకుంది. ఇరు దేశాలూ ప్రత్యర్థులపై తీవ్ర స్ధాయిలో క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. యుద్ధ విమానాలు, బాంబుల మోతలు ఇరు దేశాల్లోనూ సర్వసాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ లో ఉంటున్న భారతీయ విద్యార్ధుల్ని సురక్షితంగా ఉండాలని ఎంబసీలు కోరుతున్నాయి. అయితే పరిస్ధితులు మరింత విషమించే ప్రమాదం ఉండటంతో భారతీయ విద్యార్ధుల్ని స్వదేశానికి తరలించే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.
అయితే ఇజ్రాయెల్ తో యుద్ధం ప్రారంభమయ్యాక ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. ఇరాన్ గగన తలంలోకి వచ్చే ఏ విమానాన్ని అయినా కూల్చేసేందుకు సైన్యం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ఇరాన్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మన విద్యార్ధులను క్షేమంగా స్వదేశానికి పంపేందుకు తాత్కాలికంగా గగనతలం తెరవాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

దీంతో దాదాపు వెయ్యి మంది భారతీయ విద్యార్ధుల్ని ప్రత్యేక విమానాల్లో భారత్ కు తరలించనున్నారు. ఇవాళ రాత్రికి ఇరాన్ నుంచి బయలుదేరే తొలి విమానం రాత్రి 11 గంటలకు భారత్ చేరుకోనుంది. ఆ తర్వాత మిగిలిన విమానాలు కూడా వరుసగా భారతీయ విద్యార్ధుల్ని తీసుకుని రేపు ఉదయం, సాయంత్రం టెహ్రాన్ నుంచి బయలుదేరబోతున్నాయి. ఇరాన్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి ఆపరేషన్ సింధును భారత్ చేపట్టింది. ఇందులో భాగంగా ఇరాన్ కు విమానాలు వెళ్లాయి.

ఇరాన్ లో 4 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇందులో సగం మంది విద్యార్ధులే. వీరిలో 110 మంది దాడుల భయంతో ఈ వారం రోడ్డు మార్గంలో అర్మేనియాకు చేరుకున్నారు. వీరి కోసం ఇరాన్ తమ భూసరిహద్దుల్ని తెరిచింది. వీరు అర్మేనియా చేరుకున్నాక అక్కడి యెరెవాన్ నుంచి ప్రత్యేక విమానంలో వీరు భారత్ కు వచ్చారు. ఈ విషయంలో సహకరించిన ఇరాన్, అర్మేనియా ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం ఇప్పటికే ధన్యవాదాలు తెలిపింది.












Click it and Unblock the Notifications