భారత్ కు ఇరాన్ బిగ్ షాక్..! నౌకపై దాడి, స్వాధీనం..!
అమెరికా-ఇజ్రాయెల్ తమపై యుద్దం మొదలుపెట్టాక భారత్ విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న ఇరాన్ (Iran) ఇవాళ మరో షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) రెండు వారాల కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించిన గంటల వ్యవధిలోనే హార్ముజ్ జలసంధి మీదుగా గుజరాత్‌కు వెళ్తున్న ఒక సరుకు రవాణా నౌక (Cargo Ship)తో సహా రెండు నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దాడి చేసింది. అలాగే నౌకల్ని స్వాధీనం కూడా చేసుకుంది.
గత వారం కీలకమైన హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన భారత జెండా కలిగిన రెండు నౌకలపై దాడి జరిగిన తర్వాత.. ఇవాళ చోటు చేసుకున్న ఈ సంఘటన ఇరాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఇవాళ పనామా జెండా కలిగిన MSC ఫ్రాన్సెస్కా, లైబీరియా జెండా కలిగిన ఎపామినోడెస్ అనే ఆ రెండు నౌకలపై ఇరాన్ దాడి చేసి స్వాధీనం చేసుకుంది. గ్రీకు యాజమాన్యంలోని యూఫోరియా అనే మూడవ నౌకను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. అది ఇరాన్ తీరంలో చిక్కుకుపోయింది.

సముద్ర ట్రాఫిక్ డేటా ప్రకారం ఎపామినోడెస్ దుబాయ్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వెళ్తోంది. ఈ నౌకలకు తగిన అనుమతి లేదని, అవి "నావిగేషన్ వ్యవస్థలను తారుమారు చేశాయని", తద్వారా సముద్ర భద్రతకు ప్రమాదం కలిగించాయని ఇరాన్ నౌకాదళం పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వాస్తవంగా ఇరాన్ నియంత్రణలో ఉన్న హార్ముజ్‌లో మూడు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిగాయని అంతకుముందు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) తెలిపింది. ఈ జలమార్గంపై ఇరాన్ పట్టు సాధించడం వల్ల చమురు సరఫరా స్తంభించిపోయి, ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఇటీవల అమెరికా మెరైన్లు తమ నావికా దిగ్బంధంలో భాగంగా ఒమన్ గల్ఫ్ సమీపంలో ఇరాన్ జెండా ఉన్న రెండు సరుకు రవాణా నౌకలను స్వాధీనం చేసుకున్నందుకు, ఇది ప్రతీకార చర్యగా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications