వాట్సాప్ ను బ్యాన్ చేసిన ఇరాన్.. ఫోన్లు స్విచాఫ్ చేయాలంటూ ప్రజలకు వార్నింగ్.. కారణం అదేనా..?
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు దేశాలు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ ను డిలీట్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇరాన్ ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్ కు చేరవేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు తక్షణమే వాట్సాప్ డిలీట్ చేయాలంటూ హెచ్చరించింది ఇరాన్.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య గత 6 రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధం పీక్స్ కు చేరింది. యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.. అయితే అత్యాధునిక మిసైల్స్ తో ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. దీంతో అక్కడి వాతావరణం రణరంగంలా మారింది. అయితే యుద్ధం నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు ఇరాన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ లోని ప్రజలు తక్షణమే వాట్సాప్ ను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రజల డేటాను రహస్యంగా సేకరిస్తున్న వాట్సాప్.. ఆ సమాచారాన్ని ఇజ్రాయెల్ కు అందిస్తోందని ఇరాన్ ఆరోపణలు చేసింది.
2022లోనూ ఇరాన్ లో వాట్సాప్, గూగుల్ ప్లే ను వాడొద్దని దేశ ప్రజలకు ఆదేశాలు ఇచ్చింది. ఇరాన్ పోలీస్ చేతిలో ఓ మహిళ మృతిచెందడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన క్రమంలో అప్పట్లో ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇజ్రాయెల్ తో యుద్ధం కారణంగా మరోసారి ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ లోని ముఖ్యమైన నేతలు, అణు శాస్త్రవేత్తలు లను హతమార్చేందుకు ఇజ్రాయెల్ ఫోన్లు ట్రాక్ చేస్తోందని ఇరాన్ మీడియా కోడైకూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరాన్ పేర్కొంది.
అయితే ఇరాన్ వ్యాఖ్యలను వాట్సాప్ సంస్థ ఖండించింది. ఇలాంటి ఫేక్ వార్తలను చూసినప్పుడు ఆందోళనగా ఉంటుందని పేర్కొంది. ప్రజలకు ఇలాంటి సమయంలోనే సమాచారం ముఖ్యం అని అలాంటిది ఈ సమయంలోనే వాట్సాప్ సేవలు నిలిపివేయడం తగదని తెలిపింది. తాము ఎలాంటి ప్రదేశాలను ట్రాక్ చేయట్లేదని.. సమాచారం చేరవేయట్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం తీరును తప్పుబట్టింది.

మరోవైపు ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 17న ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు శ్వేతసౌధం తెలిపింది. ఇరాన్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మిలిటరీకి సపోర్ట్ ఇవ్వాలన్న దానిపై చర్చించినట్లు సమాచారం. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలను అమెరికా మోహరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అమెరికాకు చెందిన ఎఫ్-16, ఎఫ్-22,ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ను అమెరికా మోహరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications