ఐసిస్ కిరాతకం: సొంత ఫైటర్లనే చంపేస్తున్నారు
కైరో: బందీలను దారుణంగా హత్య చేసే ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) తన సహచరుల పట్ల కూడా అంతే క్రూరంగా ప్రవర్తిస్తోందని వెల్లడైంది. అమెరికా తదితర దేశాల దాడుల కారణంగా భారీ ఎత్తున భూభాగాల్ని కోల్పోయిన ఐసిస్ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉందని, ఈ నేపథ్యంలో గాయాలపాలైన తన సహచరుల అవయవాలను తొలగించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తోందట.
దాడులలో గాయాలపాలైన ఐసిస్ ఉగ్రవాదులను చంపి వారి శరీరం నుంచి గుండె, మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలను ఐసిస్ తొలగిస్తోందని, ఈ పని కోసం వైద్యులను బలవంతంగా ఒప్పిస్తోందని అరబ్ పత్రిక ఒకటి వెల్లడించింది.
ఇరాక్‌లోని మోసుల్ పట్టణం దక్షిణభూభాగాన్ని కోల్పోవటంతో ఆదాయపరంగా ఆ సంస్థ ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, ఈ నేపథ్యంలో సహచరుల అవయవాలను అంతర్జాతీయ నల్లబజారులో అమ్ముతోందని ఆ పత్రిక పేర్కొంది.

తమ ఆధీనంలోని జైళ్లలో ఉన్న ఖైదీలను రక్తందానం చేయాల్సిందిగా ఐసిస్ నిర్బంధిస్తోందని, మరణశిక్ష పడినవారిపై శిక్షను అమలు చేయకుండా వాయిదా వేస్తూ వారి నుంచి వీలైనంత రక్తాన్ని తీసుకుంటోందని తెలిపింది. అవయవాలను తొలగించిన 183 మృతదేహాలను మోసుల్‌లోని ఒక ఆసుపత్రిలో చూసినట్లుగా కొందరు ప్రత్యక్షసాక్షులు పేర్కొన్న విషయాన్ని వెల్లడించింది.
పోరాటంలో గాయపడిన ఉగ్రవాదులను హతమార్చి, వారి అవయవాలను తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పలు వార్తా సంస్థలు కూడా వెల్లడించాయి. గాయపడిన ఉగ్రవాది అవయవాలను తీయాలని ఉగ్రవాదులు డాక్టర్లను బెదిరిస్తున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications