24 గంటల్లో గాజా నుంచి వెళ్లిపోండి-11 లక్షల మందికి ఇజ్రాయెల్ హెచ్చరిక-తప్పుబట్టిన ఐరాస ..!
ఇజ్రాయెల్ పై భూమి, ఆకాశం,సముద్ర మార్గాల్లో హమాస్ ఏకకాలంలో జరిపిన మెరుపుదాడులు, ఆ తర్వాత ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతిదాడులతో గాజా ప్రాంతం వణికిపోతోంది. ఇప్పటికే హమాస్ వందలాది మందిని బందీలుగా పట్టుకుపోయింది. అదే సమయంలో హమాస్ తమపై దాడులు చేస్తున్న గాజా ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. ఇప్పటివరకూ ఆకాశ మార్గంలో చేసిన దాడుల్ని ఇకపై భూమిపైకి కూడా విస్తరించాలని భావిస్తోంది. దీంతో తాజాగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని గాజా ప్రజల్ని హెచ్చరించింది.
త్వరలో గాజాను నేలమట్టం చేసేలా భారీ ఆపరేషన్ కు ప్లాన్ చేసిన ఇజ్రాయెల్ .. అందుకు ముందస్తుగా హెచ్చరికలు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే గాజాలో ఉంటున్న వారికి విద్యుత్, తాగునీరు, ఆహార పదార్ధాలు అందకుండా చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్న 11 లక్షల మంది ప్రజల్ని అక్కడి నుంచి దక్షిణదిశకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం తాజా హెచ్చరికలు పంపింది.

ఇజ్రాయెల్ తాజా హెచ్చరికలతో గాజాలో ఏం జరగబోతోందన్నది ప్రపంచానికి అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి స్పందించింది. గాజాపై ఇజ్రాయెల్ చర్యలతో తీవ్ర వినాశనం తప్పదని హెచ్చరించింది. ఇప్పటికే గాజాను కైవసం చేసుకుని అక్కడకు ఆహారం, నీరు అందకుండా చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు దాడులతో ఆ ప్రాంతాన్ని నాశనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని ఐరాస తప్పుబట్టింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం తమ బందీల్ని వదిలిపెడితేనే ఆహారం, నీటిని అనుమతిస్తామని చెబుతోంది.
శనివారం ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్‌లో కనీసం 1,200 మంది, గాజా స్ట్రిప్‌లో మరో 1,400 మంది మరణించారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ భూభాగంలో 1,500 మంది హమాస్ కార్యకర్తల మృతదేహాలు లభించాయని ప్రభుత్వం పేర్కొంది. ఇజ్రాయెల్ నుంచి తాము కిడ్నాప్ చేసిన దాదాపు 150 మందిని కూడా హమాస్ బందీలుగా ఉంచింది. దీంతో ఈ బందీలపై ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications