ఇజ్రాయెల్ కీలక ప్రకటన..!!
Israel: హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్ మరో అడుగు ముందుకేసింది. హమాస్ చీఫ్ కమాండర్‌ను హతమార్చింది. తాము నిర్వహించిన డ్రోన్ దాడుల్లో అతను మరణించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వస్తోంది.

ఈ దాడుల్లో ఈ రెండు గ్రూప్‌లకు చెందిన పెద్ద తలకాయలు తెగిపడ్డాయి. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు. హషెమ్ షఫియొద్దీన్, హుస్సేన్ అలీ హజీమాను మట్టుపెట్టింది ఇజ్రాయెల్.
దీనికి కారణాలు లేకపోలేదు. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన పలువురిని అపహరించింది హమాస్. ఇప్పటికీ వందమంది వరకు ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నారు.
దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటూ వచ్చింది ఇజ్రాయెల్. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచీ క్రమం తప్పకుండా డ్రోన్ దాడులను నిర్వహించింది. హెజ్బొల్లా, హమాస్..ఈ రెండింటినీ ఏకకాలంలో మట్టుపెట్టింది. లెబనాన్, గాజాల్లో మొత్తంగా 1,300లకు పైగా ఆయా మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై ఈ దాడులు సాగించింది ఇజ్రాయెల్. బీకా వ్యాలీ,సిడాన్, మర్జయాన్, నబాటి, టయర్, జెజ్ఝీన్, జెహ్రానీ జిల్లాలతో పాటు తూర్పు ప్రాంతంలోని జహ్లేయ్, బాల్బెక్, హెర్మెల్ వంటి ప్రాంతాలపై నిరంతరాయంగా దాడులు సాగుతోన్నాయి.
ఈ దాడుల్లో హమాస్ చీఫ్ కమాండర్ అబ్దెల్- హడీ సబా దుర్మరణం పాలైనట్లు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. అత్యంత ప్రమాదకరమైన నుఖ్బా ప్లాటూన్, ఖాన్ యునుస్ బెటాలియన్‌కు చీఫ్ కమాండర్‌గా వ్యవహరిస్తోన్నాడని తెలిపింది. ఇటీవలే నిర్వహించిన డ్రోన్ దాడుల్లో అతను మరణించాడని అధికారికంగా వెల్లడించింది.
🔴Abd al-Hadi Sabah, a Nukhba Platoon Commander in the Western Khan Yunis Battalion was eliminated in an intelligence-based IDF and ISA strike.
— Israel Defense Forces (@IDF) December 31, 2024
Abd al-Hadi Sabah—who operated from a shelter in the Humanitarian Area in Khan Yunis—was one of the leaders of the infiltration into… pic.twitter.com/KMC5HAXNfA
2023 అక్టోబర్ 7వ తేదీన కిబ్బుర్ట్జ్ నిర్ ఒజ్‌పై జరిగిన భీకర దాడికి ప్రధాన సూత్రధారి అతనేనని, ఈ దాడులకు సారథ్యాన్ని వహించినట్లు తెలిపింది. అప్పటి ఊచకోతకు అబ్దెల్ స్వయంగా సారథ్యాన్ని వహించినట్లు పేర్కొంది. తమ దేశ దళాలకు వ్యతిరేకంగా అనేక తీవ్రవాద దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు వివరించింది.












Click it and Unblock the Notifications