• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెల్లం: ఆహారమా... ఔషధమా

By BBC News తెలుగు
|

బెల్లం

భారత్ తదితర దక్షిణాసియా దేశాల్లోని తల్లులు, బామ్మలు ఓ అలిఖిత గృహవైద్య సూత్రాలు అమలు చేస్తుంటారు. ఆహారంలో చేసే మార్పులతో చేయలేని వైద్యం లేదని మా అమ్మ కూడా నమ్మేది. ఆమె ఒక పదార్థాన్ని మాత్రం తరచూ ఉపయోగించేది. ఇదేదో విచిత్రమైన పద్ధతిలో కాకుండా మామూలుగా ఒక చిన్న ముద్దలాగా, మింగడానికి వీలుగా ఉండేది.

నేను మొదటిసారి పెనం మీద వేడి వేడిగా కాలుతున్న పరాఠా మీద నెమ్మదిగా కరుగుతున్న బెల్లం పాకాన్ని చూశాను.

పాకిస్తాన్ లోని ఖైబర్ ఫంఖ్తూంఖ్యా ప్రాంతంలో నివసించే మా అమ్మ నన్ను ఆ వంటకాన్ని జలుబుకు చిట్కా వైద్యంగా తీసుకోమని సూచించారు.

కరకోరం హైవే సరిహద్దుల్లో ఉన్న పర్వత శ్రేణుల్లో ఉన్న నేను ఆ బెల్లం ముక్క ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందని ఆలోచించడం మొదలుపెట్టాను.

కానీ, ఆ తీయని పదార్ధాన్ని నోట్లో వేసుకోగానే శరీరంలోకి శక్తి పుంజుకున్నట్లు అనిపించింది. ఇది కేవలం సంప్రదాయ ఔషధ ఆహారం మాత్రమే కాకుండా మంచి మిఠాయి అని కూడా అనిపించింది. ఇది కొన్ని శతాబ్దాల పురాతనమైన ఆహార పదార్ధమని అర్ధం అయింది.

చెరుకురసాన్ని ఆవిరిగా చేసి చల్లార్చి దానిని బెల్లం దిమ్మలుగా తయారు చేస్తారు. ఇది ఫిల్టర్ అయితే చక్కెర తయారవుతుంది.

ఇలాగే, తాటి, ఖర్జూర రసాల నుంచి కూడా బెల్లం తయారు చేస్తారు.

ఇదే పదార్ధం కొలంబియా, కరీబియన్ దీవుల్లో పానెలా, జపాన్ లో కొకుటో , బ్రెజిల్ లో రపడురా అనే పేర్లతో ప్రాచుర్యంలో ఉంది.

ఇలా గడ్డకట్టించిన చెరుకు రసాల్లో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇతర ఖనిజాలు శుద్ధి చేసే ప్రక్రియలో వ్యర్థం కాకుండా అందులోనే కేంద్రీకృతమై ఉండటం వల్ల దీనిని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ ఏ ఓ కూడా గుర్తించింది. అయితే, దీని నుంచి తయారు చేసే పంచదారను శుద్ధి చేసే ప్రక్రియలో అందులో ఉండే మైక్రో న్యూట్రియెంట్స్ కోల్పోతాయి.

బెల్లం: దక్షిణాసియా మిఠాయి

కానీ, బెల్లంలో మాత్రం ఆవిరి పట్టిన తర్వాత కూడా ఖనిజాలు, మొలాసెస్ అందులోనే ఉంటాయి.

ఇందులో ఉండే మొలాసెస్ వల్ల బెల్లానికి గోధుమ లేదా ఇసక రాతి రంగు వస్తుంది.

దీనితో పాటు ఇందులో కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి.

కానీ, ఈ పదార్ధంతో ఉన్న అవసరాలే దీని వ్యాప్తికి కూడా దారి తీసింది.

"చెరుకు పంటను సంరక్షించేందుకు బెల్లం పుట్టి ఉంటుంది. దీంతో పురాతన మానవునికి సంవత్సరం అంతా బెల్లం తినే అవకాశం దొరికింది" అని పాకిస్తాన్ లోని కరాచీలోని హం దర్ద్ యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ హకీమ్ అబ్దుల్ హన్నన్ చెప్పారు.

భారతదేశంలోకి చెరుకు క్రీస్తు పూర్వం 6000 లో మలయ ద్వీపం, బర్మాల మీదుగా ప్రవేశించిందని చెబుతారు. "ఇది అతి తక్కువ భూభాగంలో పండి అతి చౌకగా శక్తిమంతమైన ఆహారాన్ని అందిస్తుంది" అని అగ్రికల్చర్ ఆఫ్ ది షుగర్ కేన్ అనే పుస్తకంలో ఏ సి బార్న్స్ రాసారు.

కొన్ని వందల రకాల చెరుకును పండించే భారతదేశంలో పండిస్తారు. ప్రపంచంలోనే 70 శాతం చెరుకు పంట భారతదేశంలో పండుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ విభజనకు ముందు ఈ రెండు దేశాలు చెరుకు ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా ఉండేవి.

"చెరుకు బెల్లానికుండే ప్రత్యేకమైన రుచి, సువాసన వల్ల ఇది చాలా రకాల భారతీయ , థాయ్, బర్మా, ఇతర దక్షిణ ఆసియా, ఆఫ్రికా వంటకాల్లో కనిపిస్తుంది" అని ఫుడ్ అండ్ కుకింగ్: ది సైన్స్ అండ్ లోర్ ఆఫ్ ది కిచెన్ పుస్తక రచయత హారొల్ద్ మాక్ గీ ఆయన పుస్తకంలో వివరించారు.

వివిధ ఆకారాలలో ఉన్న బెల్లంతో నిండిన గోనె సంచులు పాకిస్తాన్, భారతీయ హోల్ సేల్ మార్కెట్ లలో చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.

వివిధ ఆకారాలలో ఉన్న బెల్లంతో నిండిన గోనె సంచులు పాకిస్తాన్, భారతీయ హోల్ సేల్ మార్కెట్ లలో చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.

ఈ తీపి పదార్ధాన్ని ప్రకృతి ఇచ్చిన మధుర పదార్థంగా భావిస్తారు. దీనితో చాలా మందికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది.

చాలా మంది ఇళ్లల్లో తీపి పదార్ధమేదైనా తినాలని అనుకుంటే బెల్లం దగ్గు మందులానో, లేదా చాక్లెట్ లాగో తింటూ ఉంటారు.

కొంత మంది టీతో పాటు బెల్లాన్ని కూడా పక్కన పెడతారు.

ఇక్కడ పిల్లలకు చాక్లెట్లకు బదులు బెల్లం ముక్కలు ఇస్తూ ఉంటారు.

దీనికుండే గాఢమైన రుచి వల్ల దీనిని అనేక సంప్రదాయ వంటకాల్లో వాడతారు.

హల్వా లాంటి అనేక రకాల స్వీట్లు మాత్రమే కాకుండా బెల్లం వేసి నువ్వుల ఉండలు, కొబ్బరి ఉండలు, వేరుశనగ చెక్కలు కూడా తయారు చేస్తారు.

బెల్లంతో చేసే పాయసం తినకుండా భారతీయ, పాకిస్తాన్ గ్రామీణ ప్రాంతాల బాల్యం గడవనే గడవదు. బియ్యం, పాలు, జీడిపప్పు, బాదంపప్పు, కొబ్బరి, బెల్లం కలిపి చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది.

చాలా లారీ షాపుల దగ్గర బెల్లం వేసిన టీ కూడా అమ్ముతారు. దీంతో టీ కి ఒక విభిన్నమైన రుచి వస్తుంది.

పాకిస్తాన్, భారతదేశంలో కూడా పండుగలలో, కొన్ని ప్రత్యేకమైన దినాల్లో బెల్లంతో చేసిన మిఠాయిలను తోపుడు బళ్ల పై అమ్ముతారు. కొన్ని రకాల మిఠాయిలను పెళ్లిళ్లలో పంచుతారు.

నేను చిన్నప్పుడు వేరుశనగ చెక్కలు అమ్మే తోపుడు బండి కోసం ఎదురు చూస్తూ ఉండేదానిని.

ఆ బళ్ల వాళ్ళు బండికుండే ఒక ప్రత్యేకమైన గంట వాయిస్తూ ఒక ప్రత్యేక పద్దతిలో పిలుస్తూ అమ్మేవారు. ఆ పిలుపు వినగానే నేను పరుగున వెళ్లి మిఠాయి కొనుక్కుంటూ ఉండేదానిని.

కొన్ని దశాబ్దాల తర్వాత ఖైబర్ ఫక్టున్క్వ దగ్గర ఉన్న చరసద్దా పట్టణంలో తబరాక్ అనే వ్యక్తి బెల్లం తయారీ పరిశ్రమను ప్రత్యేక పద్దతిలో నడుపుతున్నారు.

ఇక్కడ బెల్లం తయారీకి ఒక సంప్రదాయ, విప్లవాత్మక మైన పద్దతిని వాడతారు. ఇక్కడ చెరుకు నుంచి రసం తీసాక ఆ పిప్పిని ఇంధనం కోసం వాడతారు. దాంతో ఇది జీరో వేస్ట్ పరిశ్రమగా పని చేస్తోంది.

తాబరాక్ లాంటి చాలా మందికి బెల్లంతో చాలా మానసిక సంబంధం ఉంటుంది.

"ప్రకృతి ఇచ్చిన లాలిపాప్ ని ఎలా తయారు చేయాలో ఒక కాల్పనిక కథలా చూడగల్గుతున్నాను" అని ఆయన అన్నారు.

ఇది అన్ని వయసుల వారి జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. గ్రామీణ పాకిస్తాన్ లో మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే క్రామ్ప్స్, లేదా నొప్పులు వచ్చినప్పుడు, పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు బెల్లాన్ని ఇస్తూ ఉంటారు.

చాలా మంది భోజనం చేసిన వెంటనే ఒక బెల్లం ముక్క తింటారు. ఇలా చేయడం వల్ల భోజనం జీర్ణమై మోకాళ్ళు నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలుగుతుందని భావిస్తారు.

ఆరోగ్యం కోసం ఉపఖండం అంతా ఈ సంప్రదాయ తీపి పదార్ధాన్ని ఔషధంగా వాడటం వెనక కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. ముఖ్యంగా ఒకటి నుంచి మూడు సంవత్సరాల పాత బెల్లం బలమైనదని సంస్కృత వైద్య గ్రంథం శుశ్రుత సంహిత గ్రంధంలో రాశారు. బెల్లం తినడం వల్ల రక్త శుద్ధి జరిగి, కీళ్ల నొప్పులు, పైత్య సమస్యలను కూడా నివారిస్తుందని కూడా చెబుతారు.

అనేక రకాల స్వీట్లు బెల్లంతో తయారు చేస్తారు

పర్షియాలో కూడా బెల్లాన్ని సంప్రదాయ వైద్య విధానాల్లో వాడతారు. బెల్లం శరీరంలో రక్తం ఉత్పత్తికి సహకరిస్తుందని నమ్ముతారు.

ఆయుర్వేదంలో చెప్పే శరీర దోషాల్లో ఒకటైన వాత దోషాన్ని సమతుల్యం చేసే లక్షణం వల్ల ఇది చాలా రకాల రుగ్మతలకు పని చేస్తుందని చెబుతారు.

దీనిని ఇతర పదార్ధాలతో కలిపి కూడా వాడతారు. దీనిని ఆయుర్వేదంలో పంచకర్మ విధానంలో కూడా వాడతారు.

ఈ విధానంలో శరీరంలో వివిధ భాగాలకు అయిదు విధానాల ద్వారా చికిత్స చేస్తారు. ఈ చికిత్స సమయంలో అన్నం, పప్పు, నేతితో చేసిన కిచిడీ మాత్రమే ఆహారంగా ఇస్తారు. అందులో అప్పుడప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా పెడతారు.

"ఇది కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ పోషకాలతో కూడిన సంప్రదాయ గని" అని డాక్టర్ ముహమ్మద్ నవీద్ అనే హోమియోపతి డాక్టర్ చెప్పారు.

రోగ నిరోధక శక్తి పెరగడానికి, లివర్ ను శుభ్రపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి, కఫం తొలగించడానికి, బాలింతలకు పాలు పడటానికి జీలకర్రతో కలిపి నూరి ఇమ్మని చెబుతామని చెప్పారు.

కానీ, మధుమేహ వ్యాధి గ్రస్థులకు మాత్రం బెల్లం హాని చేస్తుందని ఆగా ఖాన్ యూనివర్సిటీ లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ లో డాక్టర్ సారా నదీమ్ అన్నారు. "మధుమేహం ఉన్న వారి శరీరం అది పంచదారా, బెల్లమా అని చూడదు. బెల్లం తినడం వల్ల మధుమేహ శాతం పెరగడం కాస్త ఆలస్యంగా జరగవచ్చు కానీ, ఇందులో కూడా కార్బోహైడ్రేట్ లు అధికంగానే ఉండటంతో మధుమేహం పెరగకుండా ఉండటం మాత్రం తప్పదు" అని ఆమె అన్నారు.

బెల్లం వల్ల ఉన్న ఉపయోగాలను శరీరం గ్రహించాలంటే చాలా పెద్ద మొత్తాలలో బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అని ఆమె వివరించారు. బెల్లం, నేయి తిని తమ పెద్దలు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పే రోగులకు ఆమె కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటారు.

కానీ, పాకిస్తాన్ లాంటి దేశాల్లో బెల్లానికున్న సాంస్కృతిక ప్రాధాన్యతను మాత్రం విస్మరించడానికి లేదు.

ఇది కేవలం ఒక ఆహార పదార్ధం కాదు. ఇది అనారోగ్యాలను తగ్గించడానికి, జలుబు లాంటి రోగాలను తరిమివేయడానికి , తక్షణ శక్తి రావడానికి వాడతారనే ఆలోచన ప్రజల మనస్సులో కొన్ని తరాలుగా జీర్ణించుకుపోయింది.

మా అమ్మాయికి మొదట తినిపించిన తీపి పదార్ధం బెల్లమే.

తనకి ఎప్పుడైనా జలుబు చేస్తే వెంటనే నేను బెల్లం పాకం వేసిన రొట్టెను తినిపిస్తాను. మా అమ్మ నాకు అదే చేసేవారు.

"ఇది ప్రకృతికి దగ్గరగా బ్రతికే జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది" అని హనాన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి.లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Jaggery: Food or medicine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X