దిగిపోతున్న జపాన్ పీఎం- మోదీ వెళ్లొచ్చాక..!!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జపాన్ లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబాతో సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. అక్కడి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ ను పరిశీలించారు. ఇషిబాతో కలిసి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. ఇందులో టోక్యో నుంచి సెండాయ్ వరకు బుల్లెట్ రైలులో ప్రయాణించారు మోదీ. దీనికి సంబంధించిన వివరాలను షిగేరు ఇషిబా తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
దీని తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. షిగేరు ఇషిబా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో చీలికను నివారించడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇషిబా ఈ సాయంత్రం 6 గంటలకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. జపాన్ అధికారిక మీడియా ఎన్ హెచ్ కే.. ఈ విషయాన్ని వెల్లడించింది.

పార్టీ నాయకత్వ ఎన్నికలను ముందుగానే నిర్వహించాలా? వద్దా అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడటానికి ఒక రోజు ముందు ఇషిబా తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడి రాజకీయాల్లో తీవ్ర కలకలానికి దారి తీసింది. పార్టీ అధినేతను ఎన్నుకుంటే అది- ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంగా పరిగణించాల్సి ఉంటుంది. దీన్ని నివారించడంలో భాగంగా ఇషిబా.. రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించినట్లు ఎన్ హెచ్ కే వెల్లడించింది.
జులైలో జపాన్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహించాలని ఇషిబాపై ఒత్తడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎల్డీపీ- దాని కూటమి భాగస్వామి కోమీటో మెజారిటీని కోల్పోయాయి. ఎగువ సభలో కూడా తన మెజారిటీని కోల్పోయింది.
మొత్తం 465 స్థానాలు ఉన్న జపాన్ పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం 248 సీట్లు అవసరమౌతాయి. ఈ మేజిక్ ఫిగర్ ను ఎల్డీపీ కూటమి అందుకోలేకపోయింది. మెజారిటీని కోల్పోయినప్పటికీ.. ఇషిబా దేశ ప్రధానిగా కొనసాగుతానని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ సాయంత్రం తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications