భారత్-కెనడా మధ్య ఖలిస్తాన్ చిచ్చు-మన దౌత్యవేత్త బహిష్కరణ-కేంద్రం కౌంటర్..
భారత్ నుంచి వేరుగా ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోసం పోరాడుతున్న సిక్కులు అంతర్జాతీయంగా పలు దేశాల్లో హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇందులో సిక్కుల ప్రభావం ఎక్కువగా ఉండే కెనడా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కు పనిచేస్తున్న ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ ను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఏడాది కాల్చి చంపారు. ఈ వ్యవహారం ఇప్పుడు భారత్ మెడకు చుట్టుకుంటోంది.
హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై విచారణ జరుపుతున్న కెనడా ప్రభుత్వం ఇందులో భారత్ హస్తం ఉందని ప్రకటించింది. అంతే కాదు కెనడాలోని భారత దౌత్యవేత్త, తమ రాజధాని లోని న్యూఢిల్లీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ను బహిష్కరించింది. బ్రిటీష్ కొలంబియాలో జూన్‌లో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు తమ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నట్లు ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పార్లమెంటరీ ప్రతిపక్షాల అత్యవసర సమావేశంలో చెప్పారు.

ఈ విషయాన్ని క్లియర్ చేయడంలో సహకరించాల్సిందిగా భారత ప్రభుత్వానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పిలుపునిచ్చారు.
ట్రూడో ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు చేపట్టిందని విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. ఇవాళ తాము కెనడా నుండి ఒక సీనియర్ భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించామని అధికారి పేరు చెప్పకుండా ప్రకటన చేశారు. బహిష్కరణకు గురైన భారతీయుడు కెనడాలోని భారత విదేశీ గూఢచార సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతి అని శ్రీమతి జోలీ వెల్లడించారు.
భారతదేశం వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన నిజ్జర్‌ను జూన్ 18న ప్రధాన సిక్కు సమాజానికి నిలయంగా ఉన్న వాంకోవర్ శివారు ప్రాంతంలోని సర్రేలో కాల్చి చంపారు. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారత్-కెనడా మధ్య మాటల యుద్ధం మొదలైంది. కెనడా రాజధాని ఒట్టావా ఉగ్రవాదుల్ని ఎలా కాపాడుతోందని భారత్ ప్రశ్నించింది. ఖలిస్తానీ మద్దతుదారుల చర్యల్ని కెనడా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఈ నెల ప్రారంభంలో ట్రూడో హాజరైన న్యూఢిల్లీ జీ20 సదస్సు సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా చెలరేగాయి.కెనడా ఇటీవల భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను నిలిపివేసింది.

ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో తమ పాత్ర ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలను "అసంబద్ధమైన, ప్రేరేపిత ఆరోపణలుగా భారత్ అభివర్ణించింది. కెనడా ప్రధాని ఆరోపణలను భారత ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించింది. వారి రాజకీయ ప్రముఖులు అటువంటి ఉగ్రవాదుల పట్ల బహిరంగంగా సానుభూతి వ్యక్తం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. కెనడాలో ఆశ్రయం కల్పించి, భారతదేశ సార్వభౌమాధికారం ,ప్రాదేశిక సమగ్రతకు ముప్పును కొనసాగిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు ,తీవ్రవాదుల నుండి దృష్టి మరల్చడానికి ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications