నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్..?
Nepal Interim Prime Minister: నేపాల్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం, జనరేషన్-జెడ్ యువత హింసాత్మక నిరసనల నేపథ్యంలో తాత్కాలిక ప్రధాన మంత్రి పదవికి ఇంజనీర్ కుల్మన్ ఘీసింగ్ పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. కుల్మన్ ఘీసింగ్ పేరును జనరేషన్-జెడ్ ప్రతిపాదించగా.. అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించినట్లు తెలిసింది. కాసేపట్లో ఈ నియామకంపై అధికారిక ప్రకటన వెలవడే అవకాశం ఉంది. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనరేషన్-జెడ్ బృందం మొదట మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ పేరును ప్రతిపాదించింది. అయితే అంతర్గత విభేదాల కారణంగా ఆమె పేరును వెనక్కి తీసుకుంది.
జనరేషన్-జెడ్ బృందం విడుదల చేసిన ఓ పత్రిక ప్రకటన ప్రకారం.. "రాజ్యాంగం ప్రకారం మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు ఈ పదవికి అర్హులు కారు. అంతేకాకుండా, 70 ఏళ్లు పైబడినందున ఆమె జనరేషన్ జెడ్ యువతకు ప్రాతినిధ్యం వహించలేరు. ఈ కారణాల వల్ల ఆమె పేరును తిరస్కరించాం." అని పేర్కొన్నారు.

అలాగే ఈ ప్రకటనలో ఇతర ప్రముఖుల పేర్ల గురించి కూడా ప్రస్తావించారు. "బాలేంద్ర షా ఆసక్తి చూపలేదు, హర్క్ సామ్‌పాంగ్ అందరికీ నాయకత్వం వహించలేకపోవచ్చు. సుశీలా కార్కీ అత్యున్నత పదవితో పాటు 70 ఏళ్లు పైబడినవారు. అందుకే నేపాల్‌ను 'లోడ్‌షెడింగ్' (విద్యుత్ కోతలు) నుండి విముక్తం చేసిన, దేశభక్తుడైన, అందరికీ ఇష్టమైన ఇంజనీర్ కుల్మన్ ఘీసింగ్ ను తాత్కాలిక ప్రభుత్వ నాయకత్వానికి పంపాలని నిర్ణయించుకున్నాం" అని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తాత్కాలిక ప్రధాని ఎంపికలో అధ్యక్షుడికి, జనరేషన్ జెడ్ కు సహకరిస్తామని నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.
నేపాల్ లో మళ్లీ ఉద్రిక్తతలు
నేపాల్‌లో ప్రభుత్వ నేతల అవినీతిపై చెలరేగిన హింస కాస్త సద్దుమణిగింది. ఆ దేశంలో తీవ్ర హింసాత్మక ఘటనలు జరగడంతో మంగళవారమే ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో ఆందోళనకారులు శాంతించారు.












Click it and Unblock the Notifications