హిరోషిమాపై బాంబులేసిన చివరి వ్యక్తి మృతి (ఫోటో)
వాషింగ్టన్: జపాన్ పైన తొలిసారిగా అటామిక్ బాంబును జారవిడిచిన వారిలో చివరి వ్యక్తి అమెరికాలో మృతి చెందాడు. హిరోషిమా బాంబు దాడికి మార్గనిర్దేశకుడిగా పని చేసిన థియోడోర్ వ్యాన్ కిర్క్(93) సోమవారం జార్జియాలోని స్టోన్‌మౌంటెన్‌లో మరణించారు.
ఆయన మరణాన్ని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక నిర్ధారించింది. హిరోషిమా దాడిలో పాల్గొన్న యుద్ధ విమాన సిబ్బందిలో జీవించి ఉన్న చివరి వ్యక్తి ఆయనే. హిరోషిమా ఘటన నాటికి ఈయన వయసు 24 సంవత్సరాలు.

పెన్సిల్వేనియాలో జన్మించిన కిర్క్ 1946లో మేజర్ హోదాలో సైన్యం నుంచి రిటైరయ్యారు. తన సేవలకు గానూ అమెరికా సైన్యపు మూడో అత్యున్నత పురస్కారమైన సిల్వర్ స్టార్‌ను అందుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా అమెరికా జపాన్‌లోని హిరోషిమా నగరంపై 1945, ఆగస్టు 6న అణుదాడి చేసింది.
వాన్ క్రిక్ 24వ ఏళ్ల వయస్సులో 12 మందితో కూడిన బీ 29 యుద్ధ విమానం ఎనోలా గేకి నావిగేటర్‌గా పని చేశారు. ఆ విమానమే 1945 ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా పైన లిటిల్ బాయ్ బాంబును జార విడిచింది. దీంతో నగరంలోని సగానికి పైగా అంటే.. లక్షా నలభై వేలమంది మరణించారు. యుద్ధంలో ఆటంబాంబును వినియోగించడం చరిత్రలో అదే మొదటిసారి. రెండోసారి నాగసాకి నగరం పైన ప్రయోగించారు. ఈ ప్రమాదంలో డెబ్బై వేల మంది చనిపోయారు.












Click it and Unblock the Notifications