London Tower Bridge: పైకి లేచిన టవర్ బ్రిడ్జి.. కిందికి రాలేదు, భారీగా ట్రాఫిక్ జామ్
లండన్: ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లోని ప్రఖ్యాత టవర్ బ్రిడ్జి (London tower bridge)లో ఏర్పడిన సమస్య భారీ ట్రాఫిక్‌కు కారణమైంది. నదిలో పడవ ప్రయాణం కోసం దారి ఇచ్చేందుకు పైకి లేచిన బ్రిడ్జీలో సమస్య తలెత్తడంతో అది యథాస్థానానికి తిరిగి రాలేకపోయింది. దీంతో రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచపోయాయి.
లండన్‌లో థేమ్స్ నదిపై నిర్మించిన టవర్ బ్రిడ్జి ప్రత్యేక అందరికీ తెలిసిందే. ఓ జల రవాణాకు.. మరోవైపు రోడ్డు ప్రయాణాలకు వీలుగా ఉంటుంది. గురువారం మధ్యాహ్నం ఒక బోటు వెళ్లేందుకు బ్రిడ్జికి చెందిన రెండు టవర్ల మధ్య భాగాన్ని పైకి ఎత్తారు. సాధారణంగా జరిగే ప్రక్రియే ఇది. కానీ, పైకి లేచిన భాగం బోటు వెళ్లిన తర్వాత కిందికి దిగలేదు.

సమస్య తలెత్తిన కారణంగా అది యథాస్థానానికి రాలేకపోయింది. దీంతో రోడ్డు నుంచి వంతెన మీదుగా వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ పరిణామాలపై స్థానికులు కొంతసేపటి వరకు ఆందోళనకు గురయ్యారు.
బ్రిడ్జి పైకి లేచి ఉండటం చూసేందుకు మొదటగా బాగానే అనిపించిందని.. కొద్ది సేపటి తర్వాత అర్థమైంది దాని ప్రభావం ఎంటో అని చెప్పారు. అరగంట సేపటి తర్వాత ఆ బ్రిడ్జి కిందికి దిగడంతో అందరి మొహల్లో ఆనందం కనిపించిందని తెలిపారు. అరగంట వరకు భారీగా నిలిచిన వాహనాలు.. బ్రిడ్జి యథాస్థానానికి రావడంతో ముందుకు కదిలాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
హైడ్రాలిక్ సమస్య కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొన్నాయి. కాగా, లండన్‌లోని థేమ్స్ నదిపై ఈ కదిలే బ్రిడ్జి నిర్మాణం 1894లో పూర్తయింది. దీంతో జంట టవర్లు నదికి 61 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ రెండింటి మధ్య నిర్మించిన స్కైవాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనిపై నుంచి రహదారిపై వెళుతున్న వాహనాలు, నదినీటిలో వెళుతున్న పడవలను చూసేందుకు వీలుంది.












Click it and Unblock the Notifications