పాక్ ప్రధానికి అమెరికాలో ఘోర అవమానం!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీకి ఇటీవల అమెరికా పర్యటనలో ఘోర అవమానం ఎదురైంది. ఇస్లామాబాద్ నుంచి న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి చేరుకున్న పాక్ ప్రధాని అబ్బాసీని అక్కడి భద్రతా అధికారులు సామాన్య పౌరుడిలా దుస్తులు తీయించి తనిఖీలు నిర్వహించారు.
పాక్ ప్రధానిని ఇలా తనిఖీ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడంతో అమెరికా తీరుపై పాక్ మండిపడింది. మరోవైపు పాక్ ప్రభుత్వాధి నేతలకు వీసా నిషేధం, ఇతర ఆంక్షలు విధించాలని ట్రంప్ సర్కారు యోచిస్తోన్న తరుణంలో ఏకంగా ప్రధానిపైనే వ్యక్తిగత తనిఖీలకు పాల్పడడం గమనార్హం.
న్యూయార్క్ విమానాశ్రయంలో పాక్ ప్రధాని అబ్బాసీ వేసుకున్న కోటు, బెల్టు తీయించి సిబ్బంది తనిఖీలు చేసిన దృశ్యాలు పాకిస్తాన్ టీవీ ఛానళ్లలో గత రెండు రోజులుగా ప్రసారమవుతున్నాయి. దీంతో అగ్రరాజ్యం తీరుపై పాక్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది.

22 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి అయిన తమ ప్రధానిని ఇంతగా అవమానిస్తారా? అంటూ పాకిస్తాన్ టీవీ ఛానళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని అబ్బాసీ వ్యక్తిగత పర్యటనపై అమెరికా వెళ్లారని పాక్‌కు చెందిన జియో న్యూస్ పేర్కొంది.
తన సోదరిని చూడటానికి అమెరికా వెళ్లిన తమ ప్రధాని, సామాన్య పౌరుడిలా స్వచ్ఛందంగా సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను పాటించారని, ఇది ఆయన నిరాడంబరత్వానికి నిదర్శనమంటూ మరోవైపు ప్రశంసలు కురిపించింది.
పాక్‌కు భద్రత సాయం కింద అందజేయనున్న 2 బిలియన్ డాలర్లును నిలిపేస్తున్నట్టు గత జనవరిలో ప్రకటించిన అగ్రరాజ్యం, తమ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోకపోతే అంతర్జాతీయ వేదికపై దౌత్యపరంగా ఏకాకిని చేస్తామని కూడా హెచ్చరించింది.
అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకు ప్రయత్నిస్తోన్న నాటో దళాలపై దాడులకు పాల్పడుతోన్న ఉగ్రవాదులకు పాక్ సాయం అందుతోందని అమెరికా మండిపడుతోంది. అంతేకాదు, పాక్‌కు చెందిన ఏడు సంస్థలను రెండు రోజుల కిందటే అమెరికా నిషేధిత కంపెనీల జాబితాలో చేర్చింది. అణు వాణిజ్యంతో వీటికి సంబంధం ఉందనే అనుమానంతో ఈ చర్య తీసుకుంది.












Click it and Unblock the Notifications