Video: రహదారిపై కుప్పకూలిన విమానం, పది మంది మృతి
కౌలాలంపూర్: మలేషియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. మలేషియా సెంట్రల్ సెలంగర్ రాష్ట్రంలోని ఓ రద్దీ రహదారిపై ఓ చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వివరాలను స్థానిక పోలీసులు వెల్లడించారు. లంగ్‌కావి ద్వీపం నుంచి ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో విమానం గురువారం మధ్యాహ్నం బయల్దేరింది.
సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయం వైపు ప్రయాణం సాగిస్తుండగా.. విమానంలో సమస్య తలెత్తింది. దీంతో విమానం గాల్లో అస్తవ్యస్థంగా గింగిరాలు తిరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఏం జరుగుతుందోనని చూస్తుండగానే.. అది రహదారిపై కూలిపోయింది.

ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. విమానం ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి, మరో ద్విచక్ర వాహనదారుడు కూడా చనిపోయాడని వెల్లడించారు. కాగా, మృతుల్లో సెంట్రల్ పహాంగ్ రాష్ట్రానికి చెందిన చట్టసభ్యుడు జోహారీ హరున్ ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
కాగా, ఈ ప్రమాద దృశ్యాలు ఓ వాహనం డ్యాష్ బోర్డ్ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. ప్రమాద జరగడంతో భారీగా మంటలు చెలరేగాయి. పరిసరాలను నల్లని పొగ కమ్మేసింది. ప్రమాదంపై మలేషియా ఎయిర్‌ఫోర్స్ మాజీ సభ్యుడు మహమ్మద్ శ్యామీ మహమ్మద్ హషీమ్ మాట్లాడుతూ.. విమానం అస్థిరంగా, గింగిరాలు కొట్టడం తాను చూశానని చెప్పారు.
A plane crash in #Malaysia, Dethe 10 pic.twitter.com/5ph6W4dD6g
— shahinur (@shahinu_r) August 17, 2023
కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో భారీ శబ్ధంతో విమానం కూలిపోయిందని చెప్పారు. వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. విమానం పూర్తిగా కాలిపోయిందని.. ఓ మృతదేహం కాలుతూ కనిపించిందని చెప్పారు. ప్రమాదంలో విమానంలోని వారంతా చనిపోయారని, ప్రమాద ఘటన స్థలం భీతావాహంగా ఉందని చెప్పారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని రవాణా శాఖ మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications