
ఘోర రోడ్డు ప్రమాదం: 53 మంది దుర్మరణం: 58 మందికి గాయాలు: అందరూ వలస కార్మికులే..
ఓ రోడ్డు ప్రమాదంలో 53 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులు సమీక్షిస్తున్నారు.
బెంగళూరుకు
వరుణ్
సింగ్
ఎయిర్‌లిఫ్ట్:
బిపిన్
రావత్
భౌతిక
కాయానికి
ప్రముఖుల
నివాళి
మృతులను వలస కార్మికులుగా గుర్తించారు. మెక్సికోలో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మెక్సికో దక్షిణ ప్రాంతం చియాపాస్ స్టేట్‌లోని టక్స్ట్‌లా గ్వాటెర్రెజ్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సుమారు 120 మంది వలస కార్మికులు, వారి కుటుంబాలతో వెళ్తోన్న ఓ భారీ ట్రక్ ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్లోన్న సమయంలో రోడ్డు మలుపులో అదుపు తప్పింది. ఫుట్‌పాత్‌ను ఢీ కొని బోల్తా పడింది. నుజ్జునుజ్జయింది. దీనితో అందులో ప్రయాణిస్తోన్న వారిలో 53 మంది దుర్మరణం పాలయ్యారు. 58 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

వారందరూ హోండురస్, గ్వాటెమాలకు చెందిన వలస కార్మికులు, వారి కుటుంబీకులుగా ప్రాథమికంగా నిర్ధారించారు. చియాపాస్ స్టేట్.. గ్వాటెమాలకు సరిహద్దుల్లో ఉంటుంది. హోండూరస్, గ్వాటెమాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు మెక్సికోకు తరలి వస్తుంటారు. వారివద్ద ఎలాంటి డాక్యుమెంట్లు గానీ, విసాలు గానీ ఉండవు. చెక్ పోస్టులను దాటుకోవడానికి ట్రక్కుల మీద ఆధారపడుతుంటారు. మెక్సికో మీదుగా అమెరికా వెళ్తుంటారు.
హోండూరస్, గ్వాటెమాలల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఆకలి వంటి కారణాలతో వేలాదిమంది మెక్సికో మీదుగా అమెరికా వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఓ ట్రక్కు ద్వారా 120 మంది వరకు ఈ రెండు దేశాల ప్రజలు మెక్సికోలో ప్రవేశించారు. అది ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటన పట్ల మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుల్ లోపెజ్ అబ్రడార్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అత్యంత బాధాకరమైన ఘటనగా అభివర్ణించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సను అందించాలని చియాపాస్ స్టేట్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న వెంటనే చియాపాస్ స్టేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రుల బాధితుల ఆర్తనాదాలు, రోదనలతో సంఘటనా స్థలం మొత్తం భీతావహంగా కనిపించింది. ఈ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా మూసివేశారు.