• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ-బైడెన్: క్వాడ్ సదస్సుపై చైనా ఎంతవరకు ప్రభావం చూపనుంది

By BBC News తెలుగు
|
బైడెన్ మోదీ

గత ఏడాదిన్నర కాలంలో నిర్వహించిన అనేక సమావేశాల్లాగే, తొలి 'క్వాడ్' సమావేశం కూడా వర్చువల్‌గానే జరిగింది.

భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ఈ క్వాడ్ గ్రూపులో సభ్య దేశాలుగా ఉన్నాయి. గత మార్చిలో ఈ దేశాల నాయకులు ఆన్‌లైన్ వేదికగా సమావేశయ్యారు.

2022 నాటికి ఒక బిలియన్ డోసుల కోవిడ్-19 వ్యాక్సీన్లను ఆసియా దేశాలకు అందించడానికి సహకరించాలని ఆయా దేశాల నాయకులు ఈ సమావేశంలో అంగీకారానికి వచ్చారు.

ఈ వారం ప్రారంభంలో వివాదాస్పద గ్లోబల్ జాయింట్ సెక్యూరిటీ ప్యాక్ట్‌ను ప్రకటించారు. దీన్ని 'AUKUS' ఒప్పందం అని పిలుస్తున్నారు. దీనిపై అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలు సంతకాలు చేశాయి. దీని ద్వారా న్యూక్లియర్ పవర్ సబ్‌మెరైన్ టెక్నాలజీని అమెరికా తొలిసారిగా ఆస్ట్రేలియాకు అందించనుంది.

ఈ ఒప్పందం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రధాని మోదీ

ఈ AUKUS ఒప్పందం నేపథ్యంలో శుక్రవారం వాషింగ్టన్ డీసీలో క్వాడ్ దేశాల నేతలు తొలిసారిగా వ్యక్తిగతంగా సమావేశమవుతున్నారు. అయితే, ఈ క్వాడ్ సమావేశంపై 'ఆకస్' ఒప్పందం ప్రభావం ఎలా ఉండనుంది?

క్వాడ్, ఆకస్ నేతలు చైనా గురించి నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పరస్పర సహకారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

క్వాడ్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనాను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే క్వాడ్ గ్రూపులో ఉన్న దేశాల్లో చైనాతో సరిహద్దును పంచుకుంటోన్న ఏకైక దేశం భారత్. ఈ సరిహద్దులోని చాలా ప్రాంతాలు వివాదాస్పదం అయ్యాయి. గతేడాది ఒకానొక సమయంలో ఇరు దేశాల బలగాల మధ్య సరిహద్దుల్లో ఘర్షణ జరిగింది.

ఇటీవలి కాలంలో బహుళ పక్ష ఫోరమ్‌లలో భారత్ చురుగ్గా పాల్గొంటోంది. అందులో కొన్నిట్లో చైనా కూడా భాగస్వామిగా ఉంది. తాజా ఆకస్, క్వాడ్ ఫోరమ్‌ల నుంచి భారత్ లబ్ధి పొందుతుందని విశ్లేషకులు అంటున్నారు.

''ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు, క్వాడ్‌లోని మిగతా మూడు సభ్య దేశాలతో కలిసి వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించేందుకు భారత్‌కు తాజా క్వాడ్ సమావేశం ఉపయోగపడుతుంది'' అని దక్షిణాసియా కంట్రోల్ రిస్క్ కన్సల్టెన్సీ డైరెక్టర్ ప్రత్యూష్ రావు అన్నారు.

''క్లిష్టమైన సాంకేతికతలు పంచుకోవడానికి, సైనిక సహకారం, మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక వనరుల సేకరణలో దీర్ఘకాల సహకారానికి ఈ సమావేశంలో పునాది పడవచ్చు'' అని ప్రత్యూష్ రావు చెప్పారు.

కోవిడ్ వ్యాక్సీన్

ఇండో-పసిఫిక్ ప్రాంతీయ భద్రతలో సభ్య దేశాలు ప్రదర్శిస్తోన్న నిబద్ధత గురించి క్వాడ్, ఆకస్ సమావేశంలో చర్చకు రావచ్చని ఆయన అన్నారు.

వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు కొత్తగా వస్తోన్న 5జీ సాంకేతికతను పంచుకోవడం వంటి అంశాలపై ఈ క్వాడ్ సదస్సులో సభ్యదేశాలు లోతైన సహకారం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సీన్ల తయారీ, పంపిణీ విషయంలో ఈ గ్రూపు ఇప్పటికే సహకారం ప్రకటించిందని వాషింగ్టన్ విల్సన్ సెంటర్ థింక్-ట్యాంక్ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మన్ అన్నారు.

''క్వాడ్ సదస్సులో తీసుకునే ఈ నిర్ణయాలు చైనాను అంత రెచ్చగొట్టేవిగా ఉండవు కాబట్టి భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు'' అని కుగెల్‌మన్ పేర్కొన్నారు.

హిందు మహాసముద్రంలో భారత్‌కు ఉన్న సవాళ్లు, సరిహద్దుల్లో చైనాతో వివాదాల వంటి ప్రధానమైన సమస్యలకు ఈ క్వాడ్ సదస్సు ఎలాంటి పరిష్కారం చూపలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ద్వారా పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌లో చైనా పెట్టుబడులు పెడుతుండటం చాలా కాలంగా భారత్‌కు ఇబ్బందిగా మారింది. తాజాగా అఫ్గానిస్తాన్‌లో బీజింగ్ ప్రభావం పెరుగుతుండటం కూడా ఢిల్లీలో ఆందోళనకు కారణమవుతోంది.

కాబట్టి ఈ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో క్వాడ్ సదస్సు భారత్‌కు ఎంతవరకు సహాయపడుతుంది? భారత్‌కున్న ప్రధాన ఆందోళన దాని ప్రయోజనాలను కాపాడుకోవటమే అని భారత మాజీ దౌత్యవేత్త జితేంద్ర నాథ్ మిశ్రా అన్నారు.

''క్వాడ్ సదస్సులో భారత్ కొన్ని కఠిన ప్రశ్నలు అడగాల్సి ఉంది. అనేక సంవత్సరాలుగా చైనా తన ఉనికిని విస్తరించుకుంటోన్న సముద్ర జలాల్లో, భారత ప్రయోజనాలను కాపాడేందుకు క్వాడ్ గ్రూపు ఏ విధంగా సహకరిస్తుందో భారత్ ప్రశ్నించాలి'' అని మిశ్రా వ్యాఖ్యానించారు.

తాలిబాన్

క్వాడ్ సమావేశంతో పాటు శుక్రవారం భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో తొలిసారిగా వ్యక్తిగతంగా సమావేశం కాబోతున్నారు. ఇరు దేశాలు నేతలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఈ సమావేశం ఒక అవకాశంగా మారనుంది.

మోదీ, బైడెన్ బహిరంగంగా చైనా గురించి మాట్లాడకపోవచ్చు. కానీ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, అఫ్గానిస్తాన్‌లో చైనా దూకుడు గురించి వారిద్దరూ సామరస్యంగా చర్చించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌పై దాడులకు, అఫ్గాన్ కేంద్రంగా జైష్-ఇ-మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి గ్రూపులను తాలిబాన్లు ఉపయోగించకుండా నిరోధించడంలో అమెరికా సహకారాన్ని భారత్ కోరనుంది. చాలా దేశాలు ఇప్పటికే అఫ్గానిస్తాన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతం అవుతున్నాయి. కానీ దీనిపై సొంత విధానాన్ని రూపొందించిన భారత్ దాని గురించి అమెరికాతో చర్చించనుంది.

వీటితో పాటు కొన్ని వాణిజ్య వివాదాలు, అపరిష్కృతంగా ఉన్న ఎస్-400 క్షిపణుల కొనుగోలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. రష్యా నుంచి భారత్ ఈ క్షిపణులను కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆంక్షల నుంచి భారత్‌కు ఉపశమనం లభిస్తుందా? లేదా అనే అంశాన్ని అమెరికా ఇంకా స్పష్టం చేయలేదు.

ప్రస్తుతం మోదీ-బైడెన్‌ల ద్వైపాక్షిక సమావేశం ఈ కఠినమైన సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలను అందించకపోవచ్చు. కానీ వాటి పరిష్కారానికి కావాల్సిన కొత్త రోడ్ మ్యాప్‌ రూపొందించేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది.

వీటితో పాటు మరికొన్ని అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారం కుదరవచ్చు. గవీ, కోవాక్స్ వ్యాక్సీన్ కార్యక్రమాలకు మద్దతుగా నిలిచేందుకు... యూఎస్ వ్యాక్సీన్ స్టాక్‌ను పెంచడం, భారత ఉత్పత్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు ప్రయత్నించవచ్చు.

''క్లీన్ టెక్నాలజీల్లో ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టడం ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, రక్షణ శాఖలో ఇప్పటికే బలంగా ఉన్న భద్రత సహకారాన్ని కొనసాగించడం గురించి వారిద్దరు చర్చించే అవకాశం ఉంది'' అని రావు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Modi-Biden: How much influence will China have on the quad summit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X