‘జీత్ బహదూర్’ను తల్లిదండ్రులకు అప్పగించిన మోడీ
ఖాట్మాండ్: పదహారేళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయిన తమ కుమారుడు కళ్లముందు కనిపిస్తే ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేగాక అతడు పట్టభద్రుడై, ప్రయోజకుడై వచ్చిన వేళ ఆమె నోటి వెంట మాటలూ కరువయ్యాయి. ఆనందబాష్పాలు రాలాయి. తన కన్నకొడుకుని ప్రయోజకుడ్ని చేయడంతోపాటు స్వయంగా వచ్చి అప్పగించిన వ్యక్తి సాక్షాత్తూ ఓ దేశ ప్రధాని కావడంతో... ఆ కుటుంబ ఆనందానికి అవధులుంటాయా? అదే ఇక్కడ జరిగింది.
పదహారేళ్లుగా ఆ కుర్రాడ్ని తన కనుసన్నల్లో పెంచి పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పించిన ఆ వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఆదివారం తన నేపాల్ పర్యటనలో అత్యంత ముఖ్యమైన, వ్యక్తిగతమైన కార్యక్రమంగా ముందుగానే పేర్కొన్న మోడీ ఆ కుర్రాడ్ని ఆదివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ ఉద్విగ్న క్షణాలను ఆయన కూడా స్వయంగా పంచుకున్నారు. మోడీ ముఖంలోనూ, కుర్రాడి కుటుంబ సభ్యుల్లోనూ ఆనందం వికసించింది.

1998లో నేపాల్‌కు చెందిన జీత్‌బహదూర్ తన అన్నతో కలిసి ఉపాధి కోసం భారత్ వచ్చేశాడు. అందరి వలసవాదులమాదిరిగానే సోదరులిద్దరూ ఉపాధి కోసం వెతకని ప్రాంతం లేదు. చివరకు రాజస్థాన్‌లో వీరిద్దరూ కొంతకాలం పనిచేశారు. సంతృప్తి లేకపోవడంతో ఉద్యోగం వదిలి నేపాల్ వెళ్లిపోవాలని జీత్‌బహదూర్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్‌కు జీత్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వెళ్లే రైలు ఎక్కబోయి, పొరపాటున గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెళ్లే రైలు ఎక్కేశాడు.
అహ్మదాబాద్‌లో దిక్కుతోచక తిరుగుతున్న జీత్‌ని ఓ మహిళ నరేంద్ర మోడీ వద్దకు తీసుకువెళ్లింది. ఆ సమయానికి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. కేవలం పార్టీ కార్యకర్తగా ఉన్నారు. అప్పటినుంచి జీత్.. మోడీ సంరక్షణలో పెరిగాడు. అనంతర కాలంలో మోడీ ముఖ్యమంత్రి కావడం, ప్రస్తుతం ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టగానే జీత్ మకాం యూనివర్సిటీ హాస్టల్‌కు మారింది. ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న జీత్ అహ్మదాబాద్‌లో బిబిఎ చదువుతున్నాడు.
తన నేపాల్ పర్యటనలో జీత్‌బహదూర్‌ను కుటుంబసభ్యులకు స్వయంగా అప్పగించాలని నిర్ణయించుకున్నారు మోడీ. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయ అధికారులు కవసోటిలో జీత్ కుటుంబ సభ్యుల నివాసానికి వెళ్లి ప్రధాని మోడీ కలుసుకోవాలనుకుంటున్న సమాచారాన్ని అందజేశారు. ఖాట్మండులో మోడీ బసచేసిన ఓ హోటల్‌లో జీత్ కుటుంబసభ్యుల్ని కలుసుకుని వారికి అతన్ని అప్పగించారు. నేపాల్‌లో పర్యటనలో ఓ ప్రత్యేకత చోటుచేసుకోబోతోందని, భావోద్వేగ కోణంతో అది ఇమిడివుందని మోడీ అంతకుముందు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications