ముంబై దాడుల సూత్రధారికి పాక్ లో 78 ఏళ్ల జైలుశిక్ష-ఐరాస సంచలన ప్రకటన..!
2008లో జరిగిన ముంబై దాడులు భారత్ ను వణికించాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన ముష్కరులు గుజరాత్ తీరంలో బోటు ద్వారా దేశంలోకి ప్రవేశించి దేశ ఆర్ధిక రాజధానిపై అనూహ్య దాడులకు దిగారు. ఈ దాడుల్లో వందల మంది భారత పౌరులు చనిపోయారు. వేలాది మంది గాయాల పాలయ్యారు. ఈ కేసులో పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ కు ఉరిశిక్ష విధించినా.. కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ ను పట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాం.
పాకిస్తాన్ లోనే ఉంటూ ముంబై దాడులకు కుట్ర రచించిన హఫీజ్ సయీద్ ను భారత్ మోస్ట్ వాంటెడ్ గా ప్రకటిస్తే, అగ్రరాజ్యాల సహా ఐరాస కూడా తీవ్రవాదిగా గుర్తించింది. అయితే ఇప్పుడీ మోస్ట్ వాంటెడ్ ను భారత్ కు అప్పగించే విషయంలో పాకిస్తాన్ ముందుకు రావడం లేదు. భారత్-పాకిస్తాన్ మధ్య నేరస్తుల మార్పిడి ఒప్పందం కూడా లేదు. అయితే పాకిస్తాన్ లోనే హఫీజ్ సయీద్ ఉంటున్నాడని తెలిసీ ఏం చేయలేకపోతున్న భారత్ కు ఐరాస తాజాగా ఓ ఊరటనిచ్చే వార్త చెప్పింది.

ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పాకిస్తాన్ జైల్లో 78 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నట్లు ఐరాస తాజాగా చెప్పినట్లు పీటీఐ వార్తాసంస్ధ వెల్లడించింది. ఏడు వేర్వేరు ఉగ్రవాద ఘటనలకు నిధులు సమకూర్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సయీద్ కు మొత్తంగా అక్కడి కోర్టులు 78 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. దీంతో సయీద్ ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
డిసెంబరు 2008లో ఐరాస భద్రతా మండలి 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీ గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించబడిన సయీద్, పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధంలో ఉన్నాడని తెలిపింది. ఫిబ్రవరి 12 2020 నుండి 78 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నాడని వెల్లడించింది. ఏడు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలిన ఫలితం" అని ఆంక్షల కమిటీ తాజా ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications