ఆపిల్ కంప్యూటర్: గుర్తు తెలియని వృద్ధురాలి కోసం 63 లక్షల చెక్కు
న్యూఢిల్లీ: సిలికాన్ రీసైక్లింగ్ కంపెనీ 'క్లీన్‌బే ఏరియా'కు 1976లో తయారు చేసిన ఆపిల్ 1 కంప్యూటర్‌ను ఇచ్చిన గుర్తు తెలియని ఓ వృద్ధురాలి కోసం దాదాపు రూ. 63 లక్షల చెక్కు ఎదురుచూస్తోంది. ఆ వృద్ధ మహిళ ఇచ్చిన ఆపిల్ 1 జనరేషన్ కంప్యూటర్‌ను వేలం వేయగా 'క్లీన్‌బే ఏరియా' రెండు లక్షల డాలర్లు పలికింది.
'క్లీన్‌బే ఏరియా' నిబంధనల ప్రకారం వేలంలో వచ్చిన డబ్బులో యాభైశాతం సొంతదారుకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆపిల్ 1 జనరేషన్ కంప్యూటర్‌ను తమకు అందజేసిన మహిళ ఎవరో తెలియడం లేదని, ఆమెను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని 'క్లీన్‌బే ఏరియా' వైస్ ప్రెసిడెంట్ విక్టర్ గిషున్ మీడియాకు తెలిపారు.
ఇంతకీ, ఆపిల్ 1 కంప్యూటర్ అంత ధర పలకడానికి గల కారణాలను విశ్లేషిస్తే, ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ 1976లో ఈ కంప్యూటర్‌ను రూపొందించారు. ఆ జనరేషన్‌లో కేవలం 200 కంప్యూటర్‌లు మాత్రమే వారు తయారుచేసి అప్పట్లో అమ్మారు.

అప్పట్లో వీటి ధర సుమారు రూ. 42,500. ఇంతకీ ఈ కంప్యూటర్ 'క్లీన్‌బే ఏరియా' ఎలా చేరిందంటే? స్టీవ్ చేతులమీదుగా ఆ కంప్యూటర్‌ను కొనుగోలు చేసిన ఒక పెద్దాయన ఈమధ్యే మరణించారు. తన భర్త చనిపోయిన తర్వాత 60 ఏళ్ల వృద్ధ మహిళ ఇంట్లో పేరుకుపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను కంపెనీకి అందజేశారు.
ఆ ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఒక పాత చెక్క కంప్యూటర్ ఆయన్ని ఆకర్షించింది. 2014లో న్యూయార్క్‌లో వేలానికి వచ్చిన ఆపిల్ 1 జనరేషన్ కంప్యూటర్‌తో సరిపోల్చి, ఈ కంప్యూటర్ ఎంతో విలువైందని గుర్తించాడు. వెంటనే దానిని వేలంపాటలో పెట్టారు.
ఇది స్టీవ్ వోజ్నియాక్ రూపొందించిన ఆపిల్ 1 జనరేషన్‌కు సంబంధించిన కంప్యూటర్ కావడంతో పెద్ద సంఖ్యలో వేలంపాటలో పాల్గొన్నారు. చివరకు ఈ కంప్యూటర్ రెండు లక్షల డాలర్లు పలికింది. ఆమె ఎప్పుడు తమ వద్దకు వచ్చినా లక్ష డాటర్ల చెక్కును అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications