వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్: ‘‘భారత్‌లో ముస్లింల కంటే మా పరిస్థితి దారుణం’’అని మధేసీలు ఎందుకు అంటున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నేపాల్ మాజీ ఉపాధ్యక్షుడు పరమానంద్ ఝా

మధ్యాహ్నం 12 గంటలు అయింది. కాఠ్‌మాండూలోని నేపాలీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం క్యాంటీన్‌లో ప్రజలు భోజనం చేస్తున్నారు.

ఇక్కడ అందరూ నేపాలీలోనే మాట్లాడుతున్నారు. నేను మాత్రం హిందీలో నా నేపాలీ స్నేహితులతో మాట్లాడుతున్నాను. మా ఎదురు టేబుల్‌లపై కూర్చున్న సరోజ్ మిశ్ర నావైపు పదేపదే చూస్తున్నారు. ఆయన నాకేదో చెప్పాలని అనిపిస్తున్నట్లు నాకు అనిపించింది.

దీంతో, మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? అని ఆయన్ను నేను అడిగాను. వెంటనే సరోజ్ స్పందిస్తూ.. ''మీరు మీడియా ప్రతినిధులా? ఒకవేళ మీరు మీడియా వారే అయితే, మేం చెప్పేది కూడా కాస్త రాయండి. ఇక్కడి మధేసీల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. మధేసీ నాయకులంతా పిరికిపందలు. వారు కాఠ్‌మాండూకు వచ్చి తమ సొంత ప్రయోజనాలను చూసుకుంటున్నారు. మధేసీ ప్రజలను అసలు పట్టించుకోవడం లేదు. మేం ఉపేంద్ర యాదవ్‌ను చాలా నమ్మాం. కానీ, ఆయనొక విశ్వాసఘాతకుడు. భారత్‌లో ముస్లింల పరిస్థితి ఎలా ఉందో.. ఇక్కడ మధేసీల పరిస్థితి కూడా అంతే’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మధేసీలు

హిందీలో ప్రమాణంతో వివాదం

2008లో నేపాల్.. ఫెడరల్ డెమొక్రటిక్ రిపబ్లిక్‌గా మారింది. గణతంత్ర నేపాల్‌కు తొలి అధ్యక్షుడిగా రాంబరన్ యాదవ్ బాధ్యతలు తీసుకున్నారు. ఉపాధ్యక్షుడిగా పరమానంద్ ఝా ఎన్నికయ్యారు.

రాంబరన్ యాదవ్, పరమానంద్ ఝా.. ఇద్దరూ మధేసీలే. రాంబరన్ సొంత జిల్లా ధనుషా. పరమానంద్ సొంత జిల్లా సప్తరీ. ఈ రెండు ప్రాంతాలు భారత్‌లోని బిహార్‌కు సరిహద్దుల్లో ఉంటాయి.

పరమానంద్ ఝా.. నేపాల్ సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. అయితే, ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు ఆయన హిందీలో ప్రమాణం చేశారు. దీనిపై అప్పట్లో కాఠ్‌మాండూలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఆయన ఇంటి దగ్గర ఒక బాంబు దాడి కూడా జరిగింది. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. హిందీలో ప్రమాణం చెల్లదని కోర్టు ప్రకటించింది.

ఈ వివాదంపై బీబీసీతో పరమానంద్ ఝా మాట్లాడారు. ''అప్పట్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మీన్ బహాదుర్ రాయ్‌మాంఝీ ఉండేవారు. ఆయనే నేతృత్వంలోని ధర్మాసనమే హిందీలో నా ప్రమాణం చెల్లదని ప్రకటించింది. అయితే, ఆ ధర్మాసనంలో ఒక మధేసీ న్యాయమూర్తి కూడా ఉన్నారు. అసలు వారి లాజిక్ ఏమిటో నాకు అర్థం కాలేదు’’అని ఆయన చెప్పారు.


విద్యా దేవీ భండారీ

నేపాల్‌లో భాషపై చాలా చర్చ నడుస్తోంది. మైథిలీ భాషకు తాము ప్రాధాన్యం ఇస్తామని సప్తరీ జిల్లా పరిపాలనా విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించాయి. అయితే, తాము నేపాలీ భాషకు ప్రాధాన్యం ఇస్తామని కాఠ్‌మాండూ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లింది. నేపాలీకే ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు సూచించింది.

దీనిపై పరమానంద్ ఝా మాట్లాడుతూ.. ''నా ప్రమాణానికి సంబంధించిన కేసులో అసలు లాజిక్కే లేదు. అయినా లాజిక్ ఎవరు చూస్తారు? మీరు.. నేపాలీలో మళ్లీ ప్రమాణం చేయాలి లేదా అచేతన స్థితిలో ఉపాధ్యక్షుడిగా కొనసాగాలి అని కోర్టు చెప్పింది. అచేతన స్థితిలో ఉండటం అంటే.. మనకు రావాల్సిన హక్కులేమీ ఉండవు. దీంతో నేను అచేతన స్థితిలోనే ఉంటానను కానీ, నేపాలీలో ప్రమాణం చేయనని తెగేసి చెప్పాను. ఆ తర్వాత నేపాలీ పార్లమెంటులో చర్చ జరిగింది. అన్ని పార్టీలు కలిసి రాజ్యాంగానికి ఏడో సవరణను తీసుకొచ్చాయి. రాజ్యాంగ పదవులు చేపట్టేవారు తమ మాతృభాషలో ప్రమాణం చేయొచ్చని ఈ నిబంధన చెబుతోంది. ఆ తర్వాత నేను మైథిలీలో మళ్లీ ప్రమాణం చేశాను. అప్పుడే నేను పూర్తిగా ఉపాధ్యక్షుడిని అయ్యాను’’అని ఆయన చెప్పారు.

''2011లో నేపాల్‌లో జనాభా లెక్కలు చేపట్టారు. అప్పట్లో దేశంలో 123 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నట్లు తేలింది. హిందీ మాట్లాడేవారు అప్పట్లో 14వ స్థానంలో ఉండేవారు. పదేళ్ల తర్వాత మళ్లీ జనాభా లెక్కలు చేపట్టారు. కానీ, ఇప్పటివరకు ఆ డేటాను బయటకు వెల్లడించలేదు. మైథిలీ, భోజ్‌పురీ, అవధి ప్రజలు కూడా హిందీ మాట్లాడతారు. కానీ, వారి మాతృభాష హిందీ కాదు. నరేంద్ర మోదీ ఇక్కడకు వచ్చినప్పుడు మేం హిందీలోనే మాట్లాడాం. మేం హిందీలో మాట్లాడితే మా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక్కడి ప్రజల్లో లక్షల మందికి నేపాలీ రాదు’’అని ఆయన వివరించారు.


భారత ముస్లింలతో పోలిక ఎందుకు?

మధేసీలను భారత్‌లో ముస్లింలతో సరోజ్ మిశ్ర పోల్చడంపై పరామానంద్ ఝాను ప్రశ్నించాను. ఈ పోలిక ఎంత వరకు సమంజసం? అని అడిగాను.

ఈ ప్రశ్నపై పరమానంద్ ఝా మాట్లాడుతూ.. ''ఇక్కడ మా పరిస్థితి కూడా భారత్‌లోని ముస్లింల పరిస్థితి లాంటిదే. భారత్‌లో ముస్లింలను ద్వితీయ పౌరులుగా పిలవరు. కానీ, ఇక్కడ మాత్రం మేం ద్వితీయ పౌరులమే. ఇక్కడ మా పౌరసత్వంపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక బిల్లును అధ్యక్షురాలు వెనక్కి పంపారు. అందుకే సరోజ్ మిశ్ర అలా అభిప్రాయపడి ఉండొచ్చు’’అని అన్నారు.

ప్రస్తుతం నేపాల్‌లో పౌరసత్వం వివాదం కూడా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మధేశీలు దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

ఇదివరకు భారత మహిళలను నేపాలీ పురుషులు పెళ్లి చేసుకుంటే, ఆ మహిళలకు నేపాలీ పౌరసత్వం వచ్చేది. కానీ, 2015 తర్వాత ఈ నిబంధనల్లో మార్పులు చేశారు. మరోవైపు వారసత్వంగా వచ్చే పౌరసత్వం విషయంలోనూ నిబంధనలు మార్చారు.

ఇదివరకు వివాహం ఆధారంగా మహిళలకు పూర్తి పౌరసత్వం ఇచ్చేవారు. వీరికి ఇతర పౌరుల్లానే అన్ని హక్కులూ ఉండేవి. ఇప్పటికి 2015 తర్వాత కూడా భారత్‌లో పుట్టినిల్లు ఉండే మహిళలకు పౌరసత్వం ఇస్తారు. అయితే, ఈ పౌరసత్వంలో అన్ని హక్కులూ ఉండవు.

నేపాలీ కాంగ్రెస్ నాయకురాలు సీతా దేవి కూడా ఇలానే అవరోధాలు ఎదుర్కొంటున్నారు. మధేసీ నేపాలీ కాంగ్రెస్‌లో ఆమె ప్రముఖ నాయకురాలు. అయితే, ఆమె పుట్టినిల్లు భారత్‌లో ఉంది. దీంతో ఆమెకు నేపాలీ పౌరసత్వం ఇచ్చినప్పటికీ, నేపాల్‌లోని ఏ ప్రావిన్స్‌కూ ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు.

కొత్త రాజ్యాంగంతో వివక్ష

2015కు ముందు పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. నేపాలీ పౌరసత్వానికి సంబంధించి ప్రస్తుతం నేపాలీ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ముందుకు ఒక బిల్లు పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఆ బిల్లుకు ఆమోదం కల్పిస్తే, సీతా దేవికి పుట్టే పిల్లలకు వారసత్వంగా పౌరసత్వంతోపాటు అన్ని హక్కులూ వస్తాయి. అయితే, సీతాదేవి లాంటి వారికి మాత్రం దీనిలో నిబంధనలు లేవు.

ఈ బిల్లుకు పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

అధ్యక్షురాలి దగ్గర పెండింగ్‌లోనున్న ఆ బిల్లుకు ఆమోదం లభించకపోతే.. సీతాదేవి పిల్లలకు కూడా చాలా హక్కులు ఉండవు. కొత్త రాజ్యాంగం ప్రకారం, వారసత్వంగా పౌరసత్వం లభించిన వారు మాత్రమే కొన్ని పదవులకు పోటీ చేయడానికి వీలవుతుంది. ఈ నిబంధనలను మధేసీలు వ్యతిరేకిస్తున్నారు.

నేపాల్‌లోని భారత్, పాకిస్తాన్‌ మహిళల మధ్య తేడా ఏమిటి?

ఈ విషయంపై నేపాల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు సీకే లాల్ మాట్లాడారు. ''నేపాల్‌లో సాంస్కృతిక, రాజకీయ పౌరసత్వం గురించి చర్చ జరుగుతోంది. అధ్యక్షురాలి దగ్గర పెండింగ్‌లోనున్న బిల్లుకు ఆమోదం లభిస్తే, వివాహం ఆధారంగా విదేశీ మహిళలకు పౌరసత్వం లభిస్తుంది. కానీ, వారికి అన్ని హక్కులూ ఉండవు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. సదరు మహిల భారత్ లేదా పాకిస్తాన్ లేదా చైనాకు చెందినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఒకప్పుడు భారత్‌తో ఉండే ''రోటీ-బేటీ’’ సంబంధాలకు ఇక ముగింపు పడినట్లే. ముఖ్యంగా ఈ పౌరసత్వం చిక్కుల వల్లే భారతీయులను నేపాలీలు పెళ్లి చేసుకోవడం లేదు’’అని ఆయన చెప్పారు.

''భారత్‌లో ముస్లింలకు రాజ్యాంగం అన్ని హక్కులనూ ఇచ్చింది. కానీ, వాస్తవంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. కానీ, ఇక్కడ నేపాలీ రాజ్యాంగంలోనే మధేసీలపై వివక్ష ఉంది. భారత్‌లో ముస్లింల మాట ఎవరూ ఎలా వినిపించుకోరో.. ఇక్కడ మధేసీల గోడు కూడా అలానే ఎవరూ వినరు. శ్రీలంకలోని తమిళులు, పాకిస్తాన్‌లోని హిందువుల్లానే నేపాల్‌లోని మధేసీలు ఉన్నారు’’అని ఆయన అన్నారు.

మధేసీలపై వివక్ష విషయంలో మరో విషయాన్ని కూడా పరమానంద్ ఝా చెప్పారు. ''భోజ్‌పురీ, మైథిలీ, అవధి మాట్లాడే ప్రజలు కూడా ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలన్నీ నేపాలీలోనే రాయాల్సి ఉంటుంది. రోజూ అవధి, భోజ్‌పురీ లేదా మైథిలీ మాట్లాడేవారికి నేపాలీపై ఎంత పట్టు ఉంటుంది? నేపాలీ మాతృభాషగా ఉండేవారే ఈ పరీక్షల్లో ముందుంటారు. ఇది కూడా ఒకరకమైన వివక్షే’’అని ఆయన అన్నారు.

''భారత్ వినదు.. నేపాల్ పట్టించుకోదు’’

''మా గురించి భారత్ పట్టించుకోదు. నేపాల్ ప్రభుత్వమూ మా మాట వినదు. భారత్‌కు ఏదైనా అవసరం పడితే, నేపాల్‌లోని కమ్యూనిస్టు నాయకులతో సంప్రదింపులు జరుపుతోంది. వారంతా నేపాల్ పర్వత ప్రాంతాల్లో ఉంటారు. అసలు మా దగ్గరకు ఎవరూ రారు. ఈ విషయాన్ని చాలాసార్లు భారత దౌత్యవేత్తల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు సరిహద్దులు దాటాలంటే మేం చాలా పత్రాలు, అధికారిక ప్రక్రియలు పూర్తి చేయాల్సి వస్తోంది. ఒకప్పుడు ఉండే రోటీ-బేటీ బంధాలు ఇప్పుడూ పూర్తిగా కనుమరుగు అయ్యాయి. ఈ భయం వల్లే భారతీయులను ఏ నేపాలీ పెళ్లి చేసుకోవడం లేదు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింద దిగజారుతుంది’’అని పరమానంద్ జా వ్యాఖ్యానించారు.

''భారత్‌ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలన్నీ నేపాల్ పర్వత ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. అసలు మైదానాల్లోని మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇంకెంత కాలం మేం భారత్‌ చుట్టూ తిరగాలి? అక్కడ మా కోసం మహాత్మా గాంధీ ఇప్పుడు లేరు. భారత సైన్యం కూడా గూర్ఖాలకే ప్రాధాన్యం ఇస్తోంది. మధేసీలను అసలు పట్టించుకోవడం లేదు. 2014లో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత మా పరిస్థితి మెరుగుపడుతుందని భావించాం. కానీ, అలా జరగలేదు’’అని ఆయన అన్నారు.

నేపాల్ తరాయి మైదాన ప్రాంతానికి చెందిన కంచన్ ఝా ఏళ్ల నుంచీ ఒక న్యూస్ వెబ్‌సైట్ నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నేపాలీ కాంగ్రెస్‌లో ఉన్నారు. మధేసీలపై వివక్ష విషయంలో బీబీసీతో ఆయన మాట్లాడారు. ''మాకు భారత్‌లో బంధువులు ఉన్నారు. ఇక్కడ పర్వత ప్రాంతాల్లో జీవించే వారికంటే మేం భిన్నంగా ఉంటాం. అందుకే మమ్మల్ని భారత్‌కే వెళ్లిపోవాలని తిడుతుంటారు. భారత్‌లో కూడా ఇలానే ముస్లింలను పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని అంటారు కదా. నిజానికి భారత్‌లో చాలా మంది ముస్లింలకు పాకిస్తాన్‌లో బంధువులు ఉంటారు. అయితే, వారంతా పాకిస్తాన్‌కే వెళ్లిపోవాలా? పాకిస్తాన్‌పై ద్వేషం నేడు భారత జాతీయవాదంలో భాగమైంది. అలానే ఇక్కడి నేపాలీ జాతీయవాదంలో మధేసీలపై ద్వేషం కనిపిస్తుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

నేపాలీ జాతీయవాదం..

''భారత్‌లో కూడా ఒక దేశం-ఒక భాష నినాదం అప్పుడప్పుడూ వినిపిస్తుంటుంది. కానీ, నేపాల్ ఆ దిశగా చాలా వేగంగా వెళ్తోంది’’అని కంచన్ ఝా వ్యాఖ్యానించారు.

అయితే, మధేసీలపై వివక్ష ఆరోపణలను కేపీ శర్మ ఓలి ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి ప్రదీప్ జ్ఞావాలీ ఖండించారు.

''అసలు భారత్‌లో ముస్లింలతో మధేసీలు పోల్చుకోవాల్సిన పరిస్థితి ఏమిటి? అసలు ఇలాంటి పోలికలు సరికాదు. నేను వీటిని పూర్తిగా ఖండిస్తున్నాను’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు మధేసీలకు ఏదైనా సమస్య ఉండే భారత్ వైపు చూడటం మానుకోవాలని నేపాల్ పర్వత ప్రాంత నాయకులు అంటున్నారు. ''నేపాల్ విషయంలో భారత్ నిర్హేతుకంటా వ్యవహరిస్తోందనే వాదన ఇక్కడ ఉంది. ఒకవేళ మధేసీలు కూడా భారత్ వైపే ఉంటే.. వారు కూడా విమర్శకులకు లక్ష్యం అవుతారు’’అని ఒక నేపాలీ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.

మరోవైపు భారత్‌లో నేపాల్ రాయబారిగా పనిచేసిన రంజిత్ రాయ్ మాట్లాడుతూ.. ''భారత్ విదేశాంగ విధానంలో నేపాల్ చాలా సంక్లిష్టంగా మారుతోంది. ఇక్కడ భారత్ వ్యతిరేక భావజాలానికి కమ్యూనిస్టు నాయకులే కారణం’’అని అన్నారు.

అసలు భారత ముస్లింలతో మధేసీలు పోల్చుకోవడమే అతిపెద్ద తప్పని షేర్ బహాదుర్ దేఓబా ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసన మినేంద్ర రిజాల్ వ్యాఖ్యానించారు.

''మధేసీ నాయకుడు రాజేంద్ర మహతో కూడా ఒకసారి ఎన్నికల్లో తన ఓటమిని భారత్ ఓటమిగా చెప్పారు. టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన షోయబ్ మాలిక్.. ముస్లింలకు క్షమాపణలు చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. మహతో తనని తాను భారత్‌లో భాగమని భావిస్తున్నారా? అలానే ముస్లింలందరికీ షోయబ్ ఏమైనా అధికార ప్రతినిధా? నిజంగా మధేసీలకు ఏదైనా సమస్యలు ఉంటే నేపాలీ ప్రభుత్వంతో మాట్లాడాలి. భారత్ వైపు చూడకూడదు’’అని మినేంద్ర వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Nepal: Why do Madhesi say that our condition is worse than Muslims in India?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X