నేపాల్ కొత్త రాజ్యాంగం: అందర్నీ సంతృప్తిపర్చలేం
ఖాట్మాండ్: నేపాల్ కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. భారత్ సరిహద్దుల్లోని బిరాట్ నగర్ పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తున్న మాధేశీ కార్యకర్తలపై పోలీసులు సోమవారం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
అభ్యంతరాలను పరిష్కరించుకోవడానికి చర్చలకు రావాలని ప్రధాని సుశీల్ కోయిరాలా ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. కొత్త రాజ్యాంగం ఆవిష్కరణను పురస్కరించుకొని మూడు ప్రధాన పార్టీలు నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్ యూఎంఎల్, యూసీపీఎన్ మావోయిస్టు రాజధానిలో సంయుక్తంగా బహిరంగ సభ నిర్వహించాయి.
భారత వ్యతిరేక వైఖరి ముద్ర ఉన్న మావోయిస్టు నేత ప్రచండ మాట్లాడుతూ... భారత్‌కు నేపాల్ మంచి మిత్రుడిగా ఉండాలనుకుంటోందని, కానీ చెప్పినదానికల్లా తలూపాలనుకోవడం లేదని అన్నారు.

నేపాల్ తాజా పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగ ప్రకటన నేపథ్యంలో భారత సరిహద్దుల్లోని నేపాల్ ప్రాంతాల్లో హింసాత్మక ఘటన పట్ల చింతిస్తున్నామని, ఉద్రికత తగ్గేలరా చర్యలు తీసుకోవాలని, సకాలంలో ఈ పని చేసి ఉంటే తీవ్ర పరిణామాలు జరగకుండా ఉండేవన్నారు.
భారత దేశంలోని నేపాల్ రాయబారి దీప్ కుమార్ ఉపాధ్యాయ మాట్లాడుతూ... హిందువుల మనోభావాలను రాజ్యాంగం పరిరక్షిస్తుందని చెప్పారు. నేపాల్ భిన్న జాతులతో కూడుకున్న దేశమని, అందరినీ సంతృప్తిపర్చడం సాధ్యం కాదని చెప్పారు.












Click it and Unblock the Notifications