ఉత్తరకొరియా: వ్యూహం మార్చిన కిమ్? అనూహ్యంగా ఆస్ట్రేలియాకు లేఖ! ఇతర దేశాలకూ లేఖాస్త్రం?
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యూహాన్ని మార్చారు. తన శత్రుదేశమైనా అమెరికా, అధ్యక్షుడు ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు ఇతర ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఉత్తరకొరియా కిమ్ అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఆశ
ప్యాంగ్‌యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యూహాన్ని మార్చారు. తన శత్రుదేశమైనా అమెరికా, అధ్యక్షుడు ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు ఇతర ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు.
ఉత్తరకొరియా కిమ్ అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఆశ్రయించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఓ లేఖ రాసిన ఆయన తమకు మద్ధతుగా, అమెరికాకు వ్యతిరేకంగా నిలవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరారు.

ట్రంప్ వచ్చాక మాకు ముప్పు పెరిగింది...
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ దేశానికి ముప్పుపెరిగిందని, తమ దేశంపై దాడి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని, యుద్దం కూడా ప్రకటించిందని కిమ్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఆంక్షల సడలింపునకు సహకరించండి...
అమెరికా ప్రోద్భలంతో ఐక్యరాజ్యసమితి తమ దేశంపై విధించిన ఆంక్షల సడలింపునకు సంబంధించి సహకరించాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కిమ్ జాంగ్ ఉన్ కోరారు. డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఫారెన్ ఎఫైర్స్ కమిటీ నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఈ లేఖ వచ్చింది. జకార్తాలోని ఉత్తరకొరియా ఎంబసీ ద్వారా ఈ లేఖ ఆస్ట్రేలియా చేరింది.

అమెరికాతో ప్రపంచానికే ప్రమాదం...
కిమ్ తన లేఖ ముగింపులో.. అంతర్జాతీయ న్యాయం జరగాలని ఆకాంక్షించారు, అమెరికా యావత్ ప్రపంచానికే ప్రమాదకరమని అభివర్ణించారు. అంతేకాదు, అమెరికా ప్రపంచాన్ని భయంకరమైన అణుయుద్ధ ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోదంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు తమకు రాసిన లేఖలో కిమ్ పేర్కొన్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగశాఖ మంత్రి జూలీ బిషప్ తెలిపారు.

కిమ్ మనసులో ఆందోళన...
ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రాసిన లేఖను ఫెయిర్ ఫాక్స్ వార్తా సంస్థ ప్రచురించింది. అమెరికా విషయంలో తాను ఒంటరినయ్యానేమో అనే ఆందోళన ఉత్తరకొరియా అధ్యక్షుడి మనసులో ఉందని ఆస్ట్రేలియా విదేశాంగశాఖ మంత్రి జూలీ బిషప్ పేర్కొన్నారని ఫెయిర్‌ఫాక్స్ తన కథనంలో పేర్కొంది.

ఇతర దేశాలకూ కిమ్ లేఖలు?
అమెరికా, ఉత్తరకొరియాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి రాసిన ఈ లేఖ సంచలనంగా మారింది. ఐక్యరాజ్యసమితిలో తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తరకొరియా ఆ ఆంక్షల సడలింపునకు అవసరమైన ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాకు లేఖ రాసిన కిమ్ అంతటితో ఊరుకోరని, దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలకు లేఖలు రాసే అవకాశం ఉందని, అమెరికాకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చే అవకాశం ఉందని వారు అంచనావేస్తున్నారు.












Click it and Unblock the Notifications