కరాచీలో దావూద్ ఇబ్రహీం... ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్... వ్యూహాత్మకమే...
అండర్ వరల్డ్ డాన్,భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఒకరైన దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నట్లు ఎట్టకేలకు పాకిస్తాన్ ఒప్పుకుంది. దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడన్న వాదనను దశాబ్దాలుగా తోసిపుచ్చుతూ వచ్చిన పాకిస్తాన్ ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది. పాకిస్తాన్‌లోని కరాచీలో దావూద్ ఉంటున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

88 మంది జాబితా...
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జారీ చేసిన కొత్త జాబితాకు అనుగుణంగా పాకిస్తాన్ 88 మంది ఉగ్రవాద నాయకులు, ఉగ్రవాద గ్రూపుల సభ్యులపై ఆంక్షలు విధించింది. ఇందులో దావూద్ ఇబ్రహీం పేరును కూడా పేర్కొన్న పాకిస్తాన్... అతని నివాసాన్ని కరాచీలోని వైట్ హౌజ్‌గా పేర్కొంది. దావూద్‌తో పాటు జమాత్ ఉద్ దవాకు చెందిన హఫీజ్ సయిద్,జైషే మహమ్మద్‌కి చెందిన మహమ్మద్ మసూద్,జకియుర్ రెహమాన్ లఖ్వీలపై పాకిస్తాన్ ఆంక్షలు విధించింది. అలా అల్ ఖైదా,తాలిబన్,హక్కని నెట్‌వర్క్,ఐసిస్‌లపై కూడా ఆంక్షలు అమలుచేసింది.

ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు...
ఈ ఆంక్షలతో ఆ ఉగ్రవాద సంస్థలు,సభ్యుల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయనుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఆర్థికంగా సహకరిస్తోందని ఎప్పటినుంచో విమర్శలు ఎదుర్కొంటోంది. ఐక్యరాజ్య సమితి,అంతర్జాతీయ సమాజం నుంచి పాక్‌పై ఒత్తిళ్లు పెరగడంతో ఎట్టకేలకు దావూద్ పేరును కూడా పాకిస్తాన్ బయటపెట్టక తప్పలేదు.
1993 ముంబై పేలుళ్ల తర్వాత దావూద్ పాకిస్తాన్‌లోనే తలదాచుకున్నాడని భారత్ దశాబ్దాలుగా తన వాదన వినిపిస్తున్నా... పాకిస్తాన్ మాత్రం దాన్ని ఖండిస్తూనే వచ్చింది. తాజాగా ఇమ్రాన్ సర్కార్ ఎట్టకేలకు దావూద్ ఆచూకీని బయటపెట్టింది.

పాక్ వ్యూహాత్మకం...
గత ఏడాది అక్టోబర్‌లో పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) బ్లాక్ లిస్టు నుంచి తాత్కాలికంగా తప్పించి గ్రే లిస్టులో చేర్చింది. ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో పాకిస్తాన్ పనితీరు సంతృప్తికరంగా లేకపోతే గ్రే లిస్టు నుంచి తిరిగి బ్లాక్ లిస్టులో పెడుతామని హెచ్చరించింది. ఇందుకోసం 4 నెలల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణపై ఎఫ్ఏటీఎఫ్ సమీక్ష జరపాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా అది అక్టోబర్‌కు వాయిదా పడింది. ఒకవేళ పాక్ చర్యలు సంతృప్తికరంగా లేకపోతే ఎఫ్ఏటీఎఫ్ తన సభ్య దేశాల ఆర్థిక సంస్థలను పాకిస్తాన్‌తో ఒప్పందాలు చేసుకోకుండా, లావాదేవీలు నెరపకుండా నియంత్రించేలా ఆదేశాల ఇవ్వవచ్చు. అదే జరిగితే.. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌కు కోలుకోని దెబ్బ తగిలినట్లే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉగ్రవాద సంస్థలు,ఉగ్రవాద సభ్యులతో కూడిన జాబితాను రూపొందించి వారిపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.