Pakistan army : పాకిస్తాన్ ఆర్మీ వ్యవసాయం-10 లక్షల ఎకరాల భూసేకరణ-కారణాలివే..
పాకిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాజకీయాల్లో పలుమార్లు తలదూర్చి నేతల్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఆర్మీ.. ఇప్పుడు మరో పాత్రలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకూ సైనిక వ్యవహారాలతో పాటు ఎన్నికైన ప్రభుత్వాలపై పట్టు కొనసాగిస్తున్న ఆర్మీ.. ఇప్పుడు పేదలకు కడుపు నింపేందుకు వ్యవసాయం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం భారీ ఎత్తున భూసేకరణకు సిద్ధమైంది.
ఆర్ధిక సంక్షోభం బారిన పడి కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో పేదల సంఖ్య పెరుగుతోంది. అంతే కాదు దేశంలో ఆహారం లేక పస్తులుండిపోతున్న వారి సంఖ్యా ఎక్కువే ఉంది. ఈ నేపధ్యంలో దేశానికి కాపలా కాస్తున్న ఆర్మీ ఇప్పుడు ప్రజల్ని ఆదుకునేందుకు నేరుగా ఎంటర్ కావాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం 10 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని సేకరిస్తోంది. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఈ 10 లక్షల ఎకరాల భూమిని లీజు పద్ధతిలో ప్రభుత్వం నుంచి తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

దేశంలో ఆర్ధిక సంక్షోభం తీవ్రమవుతున్న క్రమంలో ఈ ఏడాది ఆరంభంలోనే ఆహార భద్రత కోసం ఆర్మీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి భారీగా వ్యవసాయ భూమి సేకరించి ఇందులో వ్యవసాయం నిర్వహించాలని ఆర్మీ నిర్ణయించింది. దీని వల్ల భారీగా సహజ వనరులు ఆదా కావడంతో పాటు వ్యవసాయంలోనూ సత్ఫలితాలు వస్తాయనే వాదన వినిపిస్తోంది. గోధుమలు, పత్తి, చెరుకు వంటి వాణిజ్య పంటల్ని సాగుచేయాలని నిర్ణయించిన ఆర్మీ.. వీటిోత పాటు కూరగాయలు, పండ్ల చెట్ల పెంపకం కూడా చేపట్టాలని భావిస్తోంది.
వాణిజ్య పంటల సాగులో వచ్చే లాభాల్లో 20 శాతం సాగుపై పరిశోధన, అభివృద్ధికి వాడబోతున్నట్లు ఆర్మీ వెల్లడించింది. మిగిలిన 80 శాతం ఆదాయాన్ని ప్రభుత్వం, ఆర్మీ సమానంగా పంచుకుంటాయి. అదే సమయంలో ఆర్మీ వ్యవసాయం చేయడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశంలో బలంగా ఉంటూ రాజకీయాల్ని, ప్రభుత్వాల్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఆర్మీ.. ఇప్పుడు వ్యవసాయంలో భారీ లాభాలు గడించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆహార భద్రత పేరుతో ఆర్మీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల పాకిస్తాన్ గ్రామీణ ప్రాంతాల్లో రెండున్నర కోట్ల భూమిలేని పేదలకు ఎలాంటి ఉపయోగం లేదనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications