19మంది హతం: భారత్ అడ్డు చెప్పినా పాక్ పోలింగ్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో సైనికులకు, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు కూడా మృతిచెందారు. ఈ మేరకు వివరాలను పాక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఉత్తర వజీరిస్థాన్‌లో తాలిబన్లు, సైనికుల ఎదురు కాల్పుల్లో ఐదుగురు కమాండర్లతో సహా 19 మంది ఉగ్రవాదులు మరణించారు. వారిని వెంటాడుతున్న క్రమంలో ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. దీంతో ఏడుగురు సైనికులు మృతిచెందారు.
వజీరిస్థాన్ ప్రాంతంలో ఇప్పటికే 90 శాతం మేర తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆ దేశ సైన్యాధికారి ఒకరు తెలిపారు. నిరుడు జూన్‌లో జరిగిన దాడుల అనంతరం ఆఫ్ఘాన్ సరిహద్దులోని షావల్ ప్రాంతం తాలిబన్ల కేంద్రంగా మారిందన్నారు.

భారత్ అడ్డు చెప్పినా.. గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో పోలింగ్
భారత్ అభ్యంతరం చెప్తున్నా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభించారు. వివాదాస్పద ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పట్ల గత వారమే భారత్ తీవ్రంగా స్పందించింది. అయినప్పటికీ పాక్ 24 అసెంబ్లీ స్థానాలలో సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభించింది.
మొత్తం 272 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 6,18,364 మంది ఓటర్లు ఉన్నట్లు పాక్ వెల్లడించింది. ఇక్కడ ఎన్నికల నిర్వహణ 'బలవంతంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడమేనని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని' భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. కాగా, పాక్ మాత్రం భారత్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పేర్కొంది.












Click it and Unblock the Notifications