ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి.. నామినేట్ చేసిన పాకిస్థాన్.. కారణం ఇదే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ ప్రతిపాదించింది. ఈ మేరకు ట్రంప్ ను నోబెల్ బహుమతి- 2026 కు నామినేట్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారత్- పాక్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ వ్యవహరించిన తీరు.. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చిన విధానం కారణంగా 2026 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకుంది.
భారత్- పాక్ మధ్యలో దౌత్య పరమైన చర్చలు.. రెండు అణుదేశాల మధ్య సయోధ్య కుదర్చడం, కాల్పుల విరమణ ఒప్పందానికి సహకరించడం.. ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించడం లాంటి నాయకత్వ లక్షణాలు కారణంగా ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు పాకిస్థాన్ పేర్కొంది. ఈ మేరకు ట్రంప్ నిజమైన శాంతి స్థాపనకు నిర్మాత అని ప్రశంసలు కురిపించింది పాకిస్థాన్. నోబెల్ శాంతి ప్రతిపాదనను వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ధ్రువీకరించారు.

ఇక భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం తనవల్లే ఆగిపోయిందంటూ ట్రంప్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చి కాల్పుల విరమణ ఒప్పందం చేయించినట్లు ట్రంప్ ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించారు. అయితే ట్రంప్ వాదనలను భారత్ ఖండిస్తూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత్-పాక్ ఘర్షణలు ఆగడంలో ట్రంప్ పాత్ర ఏమీ లేదని స్పష్టంగా తెలిపారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం సెల్ఫ్ డబ్బా కొడుతూనే ఉన్నారు.
అయితే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ట్రంప్ తాజాగా తన సొంత సోషల్ మీడియా ఛానెల్ ట్రూత్ లో పోస్టు చేశారు. తాను భారత్- పాక్ యుద్ధాన్ని ఆపానని.. కాంగో, రువాండాల మధ్య ఉద్రిక్తతలు, సెర్బియా, కొసావో, రష్యా- ఉక్రెయిన్, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ఆపడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. తనకు ఇప్పటికే నాలుగైదు సార్లు నోబెల్ బహుమతి వచ్చి ఉండాల్సిందని కానీ ఇవ్వలేదన్నారు.
ఇక అమెరికా చరిత్రలో ఇప్పటివరకు నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించారు. థియోడర్ రోస్ వెల్ట్(1906), వుడ్ రో విల్ సన్(1919), జిమ్మీ కార్టర్(2002), చివరగా బరాక్ ఒబామా(2009) ఉన్నారు. ఈ క్రమంలో ఈ అవార్డును ఎలాగైనా సాధించి వీళ్ల సరసన చేరాలని ట్రంప్ తెగ ఉవ్విళ్లూరుతున్నారట. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యలపై పెద్దన్న పాత్ర వహిస్తున్నారని పరిష్కారం చూపిస్తూన్నారని ఇటీవల అమెరికాలో ఓ ప్రత్యేక వార్తా కథనం పేర్కొంది.












Click it and Unblock the Notifications