వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్ ప్రేమతో ఎడారి పాలైన పాకిస్తాన్ యువకుడు.. ప్రేయసిని కలిసేందుకు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబాటు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మొహమ్మద్ అహ్మర్

ప్రేమ మనుషులను కలుపుతుందంటారు. కానీ, ఆలోచించకుండా తప్పటడుగు వేస్తే బతుకును ఎడారికీడ్చడమే కాదు, కటకటాల పాలూ చేయగలదు.

పాకిస్తాన్‌లోని బహావల్‌పూర్ పట్టణానికి చెందిన 21 ఏళ్ల మొహమ్మద్ అహ్మర్ ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు.

ముంబయిలో ఉన్న తన ప్రేయసిని కలుసుకునేందుకు గత నెల అహ్మర్ అక్రమంగా భారత, పాకిస్తాన్ సరిహద్దులు దాటడానికి ప్రయత్నించారు.

అయితే అహ్మర్ తన గమ్యస్థానానికి చేరకుండా ఎడారిలో చిక్కుకుపోయారు. భారత భద్రతా దళం ఆ యువకుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.

విచారణ సమయంలో అహ్మర్ వద్ద రూ. 500 దొరికాయి తప్ప ఎలాంటి ఆయుధాలూ లభించలేదు. దాంతో పాటు, తన ప్రేమ కథను ఆ యువకుడు అధికారులకు వినిపించాడు.

ఈమధ్య కాలంలో సరిహద్దులు దాటిన ఘటన ఇదొక్కటే కాదు

ప్రేమ కోసమే కంచెలు దాటి..

అహ్మర్ సోషల్ మీడియా ద్వారా ముంబయికి చెందిన ఓ అమ్మాయితో కాంటాక్ట్‌లో ఉన్నారని ద‌ర్యాప్తు అధికారులు వెల్లడించారు.

సోషల్ మీడియాలో ఒక భారతీయురాలితో అహ్మర్‌కు స్నేహం కుదిరిందని, వారిద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారని బహావల్‌పూర్‌లోని ఆయన బంధువు ఒకరు తెలిపారు.

భారత మీడియా రిపోర్టుల ప్రకారం, అహ్మర్ వీసా కోసం దరఖాస్తు పెట్టుకున్నారుగానీ, అది మంజూరు కాలేదు. దాంతో, అక్రమంగా సరిహద్దు దాటాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అధికారులతో చెప్పారు.

"అహ్మర్‌కు సోషల్ మీడియాలో ముంబయికి చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆమె అహ్మర్‌ను ముంబయి రమ్మని కోరారు. దాంతో, ఆయన కంచె దాటి ఇవతలకు వచ్చారని విచారణలో తేలింది. కంచె దాటగానే ముంబయి చేరుకుంటానని ఆయన అనుకున్నారు.. సరిహద్దుల వెలుపలే ముంబయి ఉన్నట్లు" అని శ్రీగంగా నగర్ పోలీసు సూపరింటెండెంట్ ఆనంద్ శర్మ వెల్లడించారు.

అహ్మర్ సరిహద్దు దాటిన ప్రదేశం అనూప్‌గఢ్‌కు, ముంబయికి మధ్య 1400 కి.మీ దూరం ఉంటుంది.

"డిసెంబర్ 4 రాత్రి బహావల్‌పూర్ సమీపంలోని రాజస్థాన్‌లో ఎడారి ప్రాంతమైన శ్రీగంగా నగర్‌లోని అనూప్‌గఢ్ వద్ద భారత, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దును అహ్మర్ దాటారు. వెంటనే ఆయన్ను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అదుపులోకి తీసుకుంది" అంటూ స్థానిక ఎస్‌హెచ్‌ఓ ఫూల్ చంద్ ఈ ఘటనను ధృవీకరించారు.

"కంచె దాటి భారతదేశంలో ప్రవేశించగానే అహ్మర్‌ను ఒక బీఎస్ఎఫ్ అధికారి గమనించారు. భద్రతా దళానికి స్వయంగా లొంగిపొమ్మని చెప్పారు. తరువాత, అహ్మర్ సైనికుల వద్ద లొంగిపోయారు" అని ఆనంద్ శర్మ తెలిపారు.

నిర్దోషి అని తేలితే వెనక్కి పంపుతారు

అహ్మర్‌ను విచారించడానికి, ఆయన వాదనలను ధృవీకరించడానికి వివిధ భద్రతా సంస్థల ప్రతినిధులతో కూడిన సంయుక్త విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎస్‌హెచ్ఓ ఫూల్ చంద్ తెలిపారు.

అహ్మర్ ప్రేమిస్తున్నానని చెప్పిన అమ్మాయి నిజంగా ఉందా, ఆమెతో టచ్‌లో ఉన్నారా, ఆయన సరిహద్దు దాటడంలో చట్టవిరుద్ధమైన దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకునేందుకు ఈ కమిటీ ముంబయి చేరుకుంది.

దర్యాప్తు కమిటీ ఆ అమ్మాయిని కలుసుకున్నట్లు ఆనంద్ శర్మ ధృవీకరించారు.

"ఇందులో దేశ విద్రోహ కార్యకలాపాలేమీ లేవని దాదాపుగా నిశ్చయమైంది. అయితే, కేంద్ర సంస్థలు కూడా తమ స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి" ఆయన తెలిపారు.

"అహ్మర్ పూర్తిగా నిర్దోషి అని తేలిన తరువాత బీఎస్ఎస్‌కు, పాకిస్తాన్ రేంజర్స్‌తో ఒక ఫ్లాగ్ మీటింగ్ జరుగుతుంది. అహ్మర్‌ను తమ దేశ పౌరుడిగా పాకిస్తాన్ గుర్తించి, కంచె దాటారని అంగీకరిస్తే ఆయన్ను వెనక్కి పంపిస్తాం. అలా జరగకపోతే, ఈ విషయాన్ని దిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్‌ను తెలియజేస్తాం. తరువాత, వారు దీన్ని ముందుకు తీసుకెళతారు" అని ఆనంద్ శర్మ వివరించారు.

ఆన్‌లైన్ ప్రేమ వ్యవహారంలో మరో యువకుడు కూడా జూలైలో సరిహద్దు దాటేందుకు ప్రయత్నించాడు

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు?

దర్యాప్తు బృందం తెలిపిన వివరాలు ప్రకారం, తను ముంబయిలో కాలేజీలో చదువుకుంటున్న ఒక సాధారణ అమ్మాయి. అహ్మర్‌తో మాట్లాడుతూ ఉంటానని ఆమె చెప్పారు. కానీ, ప్రేమ విషయంలో ఆమె అంత సీరియస్‌గా లేరు.

"నేను ఏదో మాటవరసకి సరదాగా 'నువ్వు రా' అన్నాను. తను నిజంగా వస్తాడనుకోలేదు" అని ఆమె కమిటీకి చెప్పారు.

పాకిస్తాన్‌లో అహ్మర్ తండ్రి చాలా కాలంగా అనారోగ్యంతో మంచంపైనే ఉన్నారని, వృద్ధురాలైన తల్లి తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నారని అహ్మర్ బంధువు అర్షద్, జర్నలిస్టు మహ్మద్ ఇమ్రాన్ భిండర్‌తో చెప్పారు.

అహ్మర్ సోదరులిద్దరూ సమీప ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. భారత మీడియాలో విడుదలైన అహ్మర్ ఫొటోను ఆయన బంధువు ధృవీకరించారు.

అహ్మర్‌ను తన తల్లితో, గ్రామ లంబార్దార్‌తో అధికారులు మాట్లాడించారు. కానీ, విడుదల కోసం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్యలూ తీసుకోలేదని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

సరిహద్దులు దాటే ఘటనలు

ఈమధ్య కాలంలో సరిహద్దులు దాటిన ఘటన ఇదొక్కటే కాదు. సింధ్‌ను ఆనుకుని ఉన్న రాజస్థాన్, గుజరాత్‌ ప్రాంతాల్లో భారత, పాకిస్తాన్ సరిహద్దులో ఎక్కువ భాగానికి కంచెలు వేసినప్పటికీ, ఇటీవలి కాలంలో సరిహద్దులు దాటిన ఘటనలు అనేకం.

గత నెల, బహావల్‌పూర్‌కు చెందిన 30 ఏళ్ల అల్లావుద్దీన్ శ్రీగంగా నగర్ సరిహద్దును దాటారు. అయితే, విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.

2021 ఆగస్టులో, సింధ్‌లోని తార్పార్కర్ జిల్లాకు చెందిన ఒక యువకుడు తన కుటుంబంతో గొడవపడి గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోకి ప్రవేశించాడు.

2021 ఏప్రిల్‌లో, బార్మర్ సెక్టార్‌లోని ఎనిమిదేళ్ల చిన్నారి కూడా అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దును దాటింది.

2020 నవంబర్‌లో, తన ప్రియురాలి ఇంటికి దొంగచాటుగా వెళ్లేందుకు రాజస్థాన్‌లోని బార్మర్‌కు చెందిన ఒక వ్యక్తి సరిహద్దు దాటి సింధ్‌కు వెళ్లారు. ప్రియురాలి కుటుంబ సభ్యులు ఇది గమనించి ఆయన్ను పట్టుకున్నారు.

అంతకుముందు 2020 జూలైలో, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన వ్యక్తి, కరాచీకి చెందిన ఓ అమ్మాయిని కలవడానికి సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు. ఇది కూడా ఆన్‌లైన్ ప్రేమ వ్యవహారమే. గూగుల్ మ్యాప్ సహాయంతో ఆ వ్యక్తి మోటర్ బైక్‌పై తన ఇంటి నుంచి బయలుదేరారు. కానీ, కచ్ ప్రాంతానికి చేరుకోగానే ఒక మారుమూల ప్రదేశంలో స్పృహ తప్పి పడిపోయారు. అపస్మారక స్థితిలో స్థానికులకు కనిపించారు.

ఇలాంటివి ఎన్నో ఘటనలు.

"అహ్మర్ అనుప్‌గఢ్‌లో సరిహద్దు దాటిన చోట లైలా మజ్ను సమాధి ఉండడం యాదృచ్ఛికం" అని ఆనంద్ శర్మ అన్నారు.

లైలా మజ్నులను అక్కడ సమాధి చేయలేదు. కానీ, ఒకప్పుడు ప్రేమలో విజయం సాధించాలని కోరుకునేవారు అక్కడికి వచ్చి ప్రార్థించేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Pakistani teenager crosses the border into India to meet his girlfriend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X