ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన వెనుక పాక్ పెట్టిన ఒత్తిడేంటి ? అసలేం జరిగింది ?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉధృతంగా కొనసాగిస్తున్న వేళ హఠాత్తుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ చేసిన ప్రకటన తీవ్ర సంచలనం రేపింది. అప్పటివరకూ ఇరు దేశాల మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు భారత్, పాక్ ఇద్దరూ బయటపెట్టలేదు. అలాగే ట్రంప్ మధ్యవర్తిత్వంతో తాము కాల్పుల విరమణకు అంగీకరించినట్లు కూడా ఇరుదేశాలూ చెప్పలేదు. కానీ ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ బయటపెట్టడం ఇప్పుడు భారత్ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది.
అయితే ట్రంప్ ఇంత హఠాత్తుగా ఎందుకు ఈ కాల్పుల విరమణ ప్రకటన చేయాల్సి వచ్చింది. అంతకు ముందు చోటు చేసుకున్న పరిణామాలేంటన్న దానిపై ఇప్పటికే ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా పాకిస్తాన్ అమెరికాను ఆశ్రయించి భారత్ పై అణుప్రయోగం చేస్తామంటూ చేసిన బెదిరింపులే ట్రంప్ ప్రకటనకు కారణమైనట్లు తెలుస్తోంది. లేకపోతే ట్రంప్ ఇంత హడావిడిగా భారత్-పాక్ కాల్పుల విరమణపై ఇరు దేశాలతో సంబంధం లేకుండా ప్రకటన చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది.

వాస్తవానికి సార్వభౌమ, స్వతంత్ర దేశాలైన భారత్, పాకిస్తాన్ తరఫున వీళ్లిద్దరితో సంబంధం లేని మూడో దేశం అమెరికా అధ్యక్షుడు ఇలాంటి ఓ ప్రకటన చేయడం ఆధునిక కాలంలో చాలా అరుదైన విషయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇరు దేశాలూ అమెరికాకు ఎంత లొంగిపోయి ఉన్నాయనే దానికి ఈ ప్రకటన అద్దం పడుతుందని చెప్తున్నారు. లేకపోతే ట్రంప్ ఇంత దైర్యంగా భారత్,పాక్ తరఫున ఇలాంటి ప్రకటన చేసే అవకాశం లేదంటున్నారు.
భారత్ ఎప్పుడైతే పరిమిత లక్ష్యాలతో కూడిన ఆపరేషన్ సిందూర్ ను చేపట్టి విజయవంతం అయిందో అదే రోజు పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ) సమావేశమైంది. ఇందులో పాల్గొన్న పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అమెరికా రక్షణ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడారు. భారత్ తో యుద్దంతో తాము ఓడిపోతే పరిస్దితి ఎదురైతే అణుప్రయోగం తప్పదంటూ ఆర్మీ ఛీఫ్ మార్కో రూబియోకు చెప్పినట్లు సమాచారం. తద్వారా అలాంటి పరిస్దితి రాకుండా భారత్ ను అడ్డుకోవాలంటూ పాకిస్తాన్ ఒత్తిడి పెట్టింది. దీని ఫలితంగా అమెరికా వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరి తరఫునా కాల్పుల విరమణ ప్రకటన చేసేసింది.

అప్పటివరకూ భారత్-పాక్ యుద్దంతో తమకు సంబంధం లేదని, ఇద్దరూ తమకు మిత్రులేనంటూ చెబుతూ వచ్చిన ట్రంప్, జేడీ వాన్స్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ఈ ప్రకటన చేయడం వెనుక పాకిస్తాన్ పెట్టిన అణు ఒత్తిడే ఉందంటున్నారు. అయితే ట్రంప్ చర్యతో భారత్, ప్రదాని మోడీ ఇరుకునపడ్డారు. అమెరికా చెప్పిందని చెప్పకుండా పాకిస్తాన్ తమకు కాల్ చేసిందని, అందుకే తాము కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. అయితే పాకిస్తాన్ తో కాశ్మీర్ అంశంలో మూడో దేశం మధ్యవర్తిత్వం లేకుండా గతంలో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని ఇప్పుడు ట్రంప్ ఎంట్రీతో భారత్ ఉల్లంఘించిందా అన్న ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.












Click it and Unblock the Notifications