ప్యారిస్‌పై దాడి జరిగిందిలా: ఉగ్రవాదుల హతం
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులు, పేలళ్ల ఘటనలో 153మంది మృతి చెందినట్లు, 300మందికిపైగా గాయాలపాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో దాడికి పాల్పడిన ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఉగ్రదాడి జరిగిందిలా..
ప్యారిస్‌లో మారణహోమం సృష్టించిన ఉగ్రావాదులు మొదటగా టెన్త్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పులు తెగబడ్డారు. అత్యాధునిక తుపాకులు చేతపట్టుకున్న దుండగులు.. భోజనం చేస్తున్నవారిపై కాల్పులు జరిపారు. ఆ వెంటనే జాతీయ ఫుట్ బాల్ స్టేడియం స్టేడ్ డీ ఫ్రాన్స్ బయట మూడు శక్తిమంతమైన పేలుళ్లకు దిగారు.
ఆ సమయంలో ఫ్రాన్స్, జర్మనీల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరుతుండటంతో స్టేడియం కిక్కిరిసి ఉంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే కూడా అదే స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తుండటం గమనార్హం. పేలుళ్ల శబ్ధంతో ఉలిక్కిపడ్డ అధికారులు.. అధ్యక్షుణ్ని సురక్షిత ప్రాంతానికి తరలించి, ప్రేక్షకులను అత్యవసరద్వారాలగండా బయటికి పంపేప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మరి కాసేపటికే లెవెన్త్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఓ థియేటర్ లోకి చొరబడ్డ దుండగులు.. ప్రేక్షకులపై ఏకబిగిన కాల్పులు జరిపారు. ఇక్కడ కనీసం 15 మంది మరణించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
సెంట్రల్ ఫ్రాన్స్‌లోని బటాక్లాన్ కాన్సెర్ట్ హాలులోనూ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. అత్యధిక ప్రాణనష్టం ఇక్కడే జరిగినట్లు పోలీసులు తెలిపారు. చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయానికి ఈ ప్రాంతం కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం. గత జనవరిలో చార్లీ హెబ్డో ఆఫీసులో జరిగిన ఉగ్రదాడిలో 17 మంది దుర్మణం చెందిన సంగతి తెలిసిందే.

ఇక్కడికి సమీపంలోని ఓ కాంబోయియన్ రెస్టారెంట్‌లోకీ చొరబడ్డ దుండగులు ముగ్గురిని హతమార్చారు. వరుస కాల్పులు, పేలుళ్ల సంఘటనలతో అప్రమత్తమైన ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. ఉగ్రదాడి నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దును ఫ్రాన్స్ మూసివేసింది.
యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ దళాలు, క్యాబినెట్ మంత్రులు, పారిస్ మేయర్, ఇతర ఉన్నతాధికారులతో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అత్యవసర సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు.

దాడిని ఖండించిన దేశాధినేతలు
పారిస్‌లో ఉగ్రవాదుల దాడులను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు వ్లాద్‌మిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని అమానవీయ చర్యగా వ్యాఖ్యానించారు. జర్మన్ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కల్ కూడా ఉగ్రవాదుల చర్యలను ఖండించారు.

పారిస్‌లో ఉగ్రదాడులను తీవ్రంగా ఖండించిన రాష్ట్రపతి, ప్రధాని మోడీ
పారిస్‌లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. ఈ కష్ట సమయంలో ఫ్రాన్స్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ప్యారిస్‌లో ఉగ్రదాడుల ఘటనను తీవ్రంగా ఖండించారు.
ఉగ్రదాడి ఘటన తీవ్ర మనోవేదన, క్షోభకు గురి చేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పేలుళ్లలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాక్షించారు.












Click it and Unblock the Notifications