పెషావర్ ఘటన: భారతే కారణమన్న పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్
పెషావర్: పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉగ్రవాదులు దాడి అనంతరం భారత్ అందించిన మద్దతును పాకిస్ధాన్ నేతలు ప్రశంసిస్తుండగా.. పాకిస్ధాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మాత్రం దాడులకు భారతే కారణమంటున్నారు.
తెహ్రీక్-ఏ-తాలిబన్ కమాండర్ మౌలానా ఫజులుల్లా ఓ ఆఫ్ఘనిస్ధాన్ సంతతికి చెందినవాడని, అతడికి శిక్షణ ఇచ్చింది భారత్ కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అని ఆరోపించారు. చిన్నారులను చంపిన తాలిబన్లకు శిక్షణ ఇచ్చిందే భారతేనని సీఎన్ఎన్-ఐబీఎన్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు.

పాకిస్థాన్ వ్యాప్తంగా దాడులు చేసేందుకు భారత్, ఆఫ్ఘన్ దేశాలు తాలిబన్ కమాండర్ కు సహకరిస్తున్నాయని అన్నారు. జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ కూడా పెషావర్ దాడులకు భారత్ కారణమని అంటున్నాడు. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో తాలిబన్ల దాడి వెనుక భారత్ హస్తం ఉందన్నాడు.
ఇటీవలే హఫీజ్ సయీద్ ట్విట్టర్ ఎకౌంట్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌కు వ్యతిరేకంగా జీహాదీ పేరుతో ట్వీట్స్‌ను చేస్తుండటమే ఇందుకు కారణం. అంతేగాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలకు సపోర్ట్‌గా భారత్ తన బలగాలను పంపితే, కాశ్మీర్‌లోని తమ సహోదరులకు సాయపడేందుకు ముజాహిదిన్‌లు ముందుకు కదులుతారని హెచ్చరించారు.
సాయం కోసం కాశ్మీరీలు ఎలుగెత్తుతున్నారని, వారికి సాయపడడం తమ ధర్మం అని హఫీజ్ పేర్కొన్నాడు. ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో మొత్తం 141 మంది చనిపోయారు. ఇందులో 132 మంది విద్యార్థులు కాగా, 9 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు.












Click it and Unblock the Notifications