చేతులు కలిసేనా?: ఒకే హోటల్లో మోడీ, షరీఫ్ బస!
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఈ వారంలోనే జరగనున్నాయి. ఈ సమావేశాలకు సభ్య దేశాల ప్రభుత్వాధినేతలంతా దాదాపుగా హాజరవుతారు. ఐరాసలో భారత్, పాకిస్థాన్ లు కూడా సభ్య దేశాలుగా ఉన్నందున ఈ రెండు దేశాల ప్రధానుల హోదాలో నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్‌లు కూడా ఈ సమావేశాల కోసం ఈ వారంలో అమెరికాకు వెళుతున్నారు.
కాగా, దాయాది దేశాలుగా వ్యవహరిస్తున్న ఈ రెండు దేశాల ప్రధానులు అమెరికా నగరం న్యూయార్క్‌లో ఒకే హోటల్‌లో బస చేయబోతున్నారు. బుధవారం సాయంత్రానికి న్యూయార్క్ చేరుకోనున్న నరేంద్ర మోడీ న్యూయార్క్ నగరంలోని వాల్దార్ఫ్ ఆస్టోరియా హోటల్‌లో బస చేయనున్నారు.

ఇక సెప్టెంబర్ 25న న్యూయార్క్ చేరుకోనున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా నేరుగా మోడీ బస చేయనున్న వాల్డార్ఫ్ ఆస్టోరియా హోటల్‌కే వెళతారు.
ఒకే హోటల్‌లో బస చేస్తున్నప్పటికీ వీరిద్దరి మధ్య భేటీకి సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదు. అయితే ఒకవేళ అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడితేనైనా వీరి మధ్య మాట కలిసి చేతులు కలుపుతారా? లేదా? అన్న కోణంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కాగా, వీరిద్దరూ ఉండే ఆ హోటల్ చైనాకు చెందిన ఓ సంస్థ ఇటీవలే సొంతం చేసుకుంది. ఈ హోటల్‌లో భారత్, పాక్ ప్రధానులతోపాటు చైనా అధ్యక్షుడు జింపింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బస చేయనున్నారు.












Click it and Unblock the Notifications