జో బైడెన్ దంపతులతో కలిసి- మోదీకి అరుదైన ఆహ్వానం
వాషింగ్టన్: వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమెరికా భాగస్వామ్యంతో జనరల్ ఎలక్ట్రిక్ జెట్ ఇంజిన్లు తయారీతో పాటు అడ్వాన్స్డ్ డిఫెన్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 అత్యున్నత సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోన్న విషయం తెలిసిందే. అమెరికా సహా జీ20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఈ భేటీలో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. ఈ భేటీ అజెండాలో చేర్చాల్సిన అంశాలు, ప్రస్తావనకు తీసుకుని రావాల్సిన విషయాలపైనా మోదీ.. జో బైడెన్‌తో చర్చిస్తారు.

2021లో మోదీ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. అప్పట్లో వైట్‌హౌస్‌ను సందర్శించారాయన. అది- క్వాడ్ సమ్మిట్‌లో భాగం. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు క్వాడ్‌లో సభ్యత్వం ఉంది. అమెరికా వేదికగా జరిగిన క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనడానికి అప్పట్లో మోదీ ఆ దేశ పర్యటన చేపట్టారు. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా ఆయన పర్యటన సాగబోతోంది.
రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. రక్షణ రంగం, వాణిజ్యం-పెట్టుబడులలు, పసిఫిక్ రీజియన్ దేశాల మధ్య సహకారం, ఆర్థిక వ్యవహారాలు, హెచ్1-బీ విసాల సంఖ్య పెంపు.. వంటివి మోదీ-బైడెన్ భేటీలో ప్రస్తావనకు వస్తాయని తెలుస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలు మొదలుకుని భారత్-అమెరికా మధ్య ఇప్పటికే అనేక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతోంది.
ఈ రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాటిని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా- ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అదే సమయంలో ఈ రెండు దేశాలకు ఉమ్మడి శతృవుగా భావిస్తోన్న చైనా దూకుడును కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కూడా మోదీ- బైడెన్ చర్చలు జరుపుతారని చెబుతున్నారు.
తమ దేశ పర్యటనకు వచ్చే మోదీకి జో బైడెన్ నుంచి అరుదైన ఆహ్వానం లభించింది. జూన్ 22వ తేదీన వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసే విందుకు హాజరు కావాలంటూ జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ నుంచి మోదీకి ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు, ఆయన భార్య.. భారత ప్రధానికి వైట్ హౌస్‌లో విందు ఏర్పాటు చేయడం సుదీర్ఘ విరామం తరువాత ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications